.
తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా రెండుగా చీలినట్టు నిన్న పెద్ద కలకలం… మెగా వర్సెస్ మెగాయేతర… అన్నింటికీ మించి మెగా ఫ్యాన్స్ అంటే జనసేన, పవన్ కల్యాణ్, చిరంజీవి, రాంచరణ్ ఫ్యాన్స్ గట్రా అందరూ ఒక్కటైపోయి దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డిని సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు…
కొందరైతే మరీ కులాల్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు… ఎందుకు..? శిరీష్ ఏదో ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టరయ్యాక, తాము తీవ్రంగా నష్టపోయాక హీరో (రాంచరణ్) గానీ దర్శకుడు (శంకర్) గానీ కనీసం ఫోన్ కూడా చేయలేదనీ, ఇంకా ఏవేవో మాట్లాడాడు… తెలుగు సినిమా రంగంలో ఉన్న నిర్మాణ సంస్థల మీద కూడా నోరు పారేసుకున్నాడు…
Ads
అక్కడ మొదలైంది వివాదం… రచ్చ ఎటెటో వెళ్లిపోయింది… అకారణంగా రాంచరణ్‌ను తూలనాడినట్టు మాట్లాడుతున్నాడు కదానే భావనతో ఇక మెగా ఫ్యాన్స్ దాడి మొదలెట్టారు… ఈ విషయంలో శిరీష్‌దే తప్పు… తెలుగు ఇండస్ట్రీలో మెగా క్యాంపు ప్రభావం ఏమిటో, ఫ్యాన్స్ ఎలా రియాక్టవుతారో తెలియదా..? ఇండస్ట్రీలో సినిమా వ్యాపారంలో ఉన్నవాళ్లు ఏం దాచుకోవాలో, ఏం మాట్లాడాలో, ప్రతి మాట చిలువలు పలువలుగా బయటికి ఎలా ప్రచారమవుతుందో తెలియదా..?
ఇన్నేళ్లూ దిల్ రాజే తప్ప శిరీష్ ఎప్పుడూ ఇంటర్వ్యూలు గట్రా ఇవ్వడు… తనకు ఏం మాట్లాడాలో తెలియదు… తెలియనప్పుడు నోరు తెరవొద్దు… దిల్ రాజు అప్పుడప్పుడూ ఫ్లోలో ఏదైనా మాట జారినా వెంటనే కవర్ చేసుకుంటాడు… తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న స్థితి దిల్ రాజుది… తను తెలివైన వ్యాపారి… పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించే ‘‘ఆ నలుగురు’’ కూటమిలో మెగా అల్లు అరవింద్ కూడా ఉన్నాడు దిల్ రాజుతో పాటు… చాలా విషయాల్లో సహకరించుకుంటారు… అలాంటప్పుడు పిచ్చి వ్యాఖ్యానాలకు ఎందుకు దిగినట్టు శిరీష్..?
నిజానికి గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజుదే తప్పు… తనే చెబుతున్నాడు పెద్ద దర్శకులతో తాను ఎప్పుడూ పనిచేయలేదు కదా, సరైన ఒప్పందాలు, కట్టుబాట్లు కూడా పెట్టుకోకపోవడంతో తప్పు జరిగిందని..! అక్కడివరకూ వోకే… ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తరువాత రాంచరణ్ డేట్లు దొరకడమే దిల్ రాజుకు ప్లస్… అప్పుడెప్పుడో శంకర్ ఇచ్చిన డేట్లున్నాయని, రాంచరణ్‌ను తీసుకెళ్లి తనకు అప్పగించడం ఓ మైనస్, తప్పు… శంకర్ ఆల్రెడీ వట్టిపోయిన సంగతి తెలియలేదు ఫాఫం తనకు… రాంచరణ్‌ను ఒకరకంగా ఆ డిజాస్టర్‌కు బుక్ చేసిందే దిల్ రాజు…
పైగా తనే ఎక్కడో అంటున్నాడు… ఆల్రెడీ నష్టపోయి ఉన్నాం, పదే పదే మమ్మల్ని ఆ సినిమా గురించే అడుగుతున్నారు, పొడుస్తున్నారు అని…. అడుగుతారు, జవాబులు చెప్పకుండా ఉండాల్సింది… ఆ ప్రశ్నల్ని అవాయిడ్ చేయాల్సింది… చివరకు ఏమైంది..? శిరీష్ ఇంటర్వ్యూ కాస్తా పెంట పెంట అయిపోయింది…
దిల్ రాజు ఏదో కవర్ చేయడానికి… రాంచరణ్‌తో మళ్లీ సినిమా తీస్తానని ఏదో చెప్పినా మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆగలేదు… చివరకు శిరీషతో సారీ చెప్పించాల్సి వచ్చింది… ఇలా… ఇంపార్టెంట్ స్థానాల్లో ఉన్నవాళ్లు, ప్రత్యేకించి సినిమా వ్యాపారులు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఈ వివాదం మరోసారి స్పష్టంగా చెప్పింది… తన సినిమా వ్యాపారం, తమ ఫీలింగ్స్ గురించి తను తప్ప ఇంకెవరూ ఎక్కడా ఏమీ మాట్లాడవద్దని దిల్ రాజు ముందుగా తమ కుటుంబంలోనే ఓ కట్టుబాటు పెట్టుకుంటే బెటర్… ఇలా లెంపలేసుకునే పరిస్థితి మళ్లీ మళ్లీ రాకుండా..!!
Share this Article