.
Subramanyam Dogiparthi…… 16 కేంద్రాలలో వంద రోజులు ఆడింది ఈ దొంగ సినిమా . ఎంత మంది దొంగలు సక్సెస్ అయ్యారో ! హీరోయే దొంగయితే ప్రేక్షకులకు బాగానే లైక్ చేస్తారు . సాదాసీదా కధ అయినా చిరంజీవి అల్లరి డైలాగులతో , హీరోయినుతో పాటు హీరోయిన్ తండ్రిని కూడా టీజ్ చేస్తూ చలాకీతనంతో సినిమాను నడిపిస్తాడు .
చిరంజీవి+ కోదండరామిరెడ్డి+ రాధ+ పరుచూరి బ్రదర్స్+ వేటూరి+ చక్రవర్తి+ సలీం = 16 సెంటర్లలో వంద రోజులు . విలన్లు నమ్మించి చిరంజీవి తండ్రిని మోసం చేస్తారు . ఆ అపనింద షాకుతో తండ్రి మరణిస్తాడు . కుటుంబం వీధిన పడుతుంది . చెల్లెలి ఆకలి తీర్చటానికి అన్న బ్రెడ్ దొంగ అయి , ఆ తర్వాత ప్రొఫెషనల్ దొంగ అయిపోతాడు . అయితే దొంగిలించిన డబ్బుని రాబిన్ హుడ్ లాగా లేనివారికి ఖర్చు పెడుతూ ఉంటాడు .
Ads
విలన్ మీద కక్ష తీర్చుకుంటానికి విలన్ కూతురిని ప్రేమలోకి దింపుతాడు . చిన్నప్పుడు తప్పిపోయిన చెల్లెలిని కలుసుకుంటాడు . ఆమె పెళ్ళి కోసం తేనే మనసులు సినిమాలో సంధ్యారాణి తండ్రిలాగా దొంగతనం చేస్తాడు . సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు . అనాధ అయిన అతని చెల్లెలి పెళ్ళిని భుజాన వేసుకుంటాడు .
ఆ పెళ్ళికి కావలసిన డబ్బును ఛాలెంజిగా తీసుకుని యాభై వేలు సంపాదించటానికి హీరో కష్టపడుతూ ఉంటాడు . హీరో సక్సెస్ కాకుండా ఉండటానికి విలన్లు అడ్డంకులను సృష్టిస్తూ ఉంటారు . వాటిని అధిగమించి విలన్లను పోలీసులకు అప్పచెప్పి ఎవరికి కావలసిన వారితో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడంతో సినిమా సుఖాంతం అవుతుంది . టూకీగా ఇదీ స్టోరీ .
స్టోరీ మామూలుదే . కధను చెప్పే మసాలా , సినిమాను నడిపించే నైపుణ్యం , వగైరా ముఖ్యం . ఇవన్నీ కోదండరామిరెడ్డి గారికి బాగా తెలుసు . సినిమా హిట్టయింది . హిట్టవటానికి ముఖ్య కారణాలు పాటలు , డాన్సులు , డైలాగులు . పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అల్లరి అల్లరిగా సూటిగా బాగుంటాయి .
అసెంబ్లీలో MLAలు బండబూతులు తిట్టుకుంటున్నట్లు వంటి డైలాగులు , ఉన్న ప్రభుత్వాన్ని పడకొట్టడం వంటి చురకలు , చెణుకులు పుష్కలంగా ఉన్నాయి . సంతోషం ఏమిటంటే అసెంబ్లీలో తిట్టుకునే పెజాసేవకులు 1984/85 కే ఉన్నారు . ఈ డైలాగులతో పాటు వేటూరి వారి పాటలు . వాటిని పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలను అభినందించాలి .
అందమా అలా అలా అల్లుకో ఇలా ఇలా డ్యూయెట్లో చిరంజీవి , రాధల డాన్స్ చాలా బాగుంటుంది . అలాగే చిరంజీవి , సిల్క్ స్మితల డాన్స్ కూడా . నిజంగానే పోటీ పడతారు ఇద్దరు . ఇది పందెం ఇది పంతం అంటూ సాగుతుంది వారిద్దరి మధ్య పోటీ డాన్స్ .
చిరంజీవికి ఇండియా మైకేల్ జాక్సన్ అనే పేరుని తెచ్చిన డాన్స్ గోలీ మార్ గోలీ మార్ అనే పాటతో ఉంటుంది . కుర్రోళ్ళకు బాగా నచ్చింది . దొంగ దొంగ ముద్దుల దొంగ , తప్పనక ఒప్పనక డ్యూయెట్లు కూడా బాగా చిత్రీకరించబడ్డాయి . నృత్య దర్శకుడు సలీంను అభినందించాలి .
చిరంజీవి , రాధలతో పాటు రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , గొల్లపూడి మారుతీరావు , నూతన్ ప్రసాద్ , చలపతిరావు , పి యల్ నారాయణ , పూర్ణిమ , రాజ్యలక్ష్మి , శుభ , శ్రీధర్ , రాజేంద్రప్రసాద్ , రాజా , మమత , అత్తిలి లక్ష్మి , ఝాన్సీ , ప్రభృతులు నటించారు .
త్రివిక్రమరావు గారి భారీ సినిమా కదా ! తారాగణం కూడా భారీగానే ఉంటుంది . వియత్నాం వీడు సుందరం వ్రాసిన ఈ సినిమా మా గుంంటూరులో సరస్వతిలో ఆడింది .
It’s a commercial , action plus sentimental , feel good Chiramjeevi- Kodandarami Reddy mark entertainer . చిరంజీవి , రాధ అభిమానులకు బాగా నచ్చుతుంది . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
దొంగ అనే టైటిల్ ఇంపార్టెన్స్ తెలిసినవాడు కదా… చిరంజీవి సినిమాలు చాలా ఉన్నయ్… దొంగ, మంచి దొంగ, దొంగ మొగుడు, కొండవీటి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ ఎట్సెట్రా…
Share this Article