.
నిజమే కదా… మరీ ఆరు సమోసాలు లంచంగా తీసుకోవడం ఏమిటి..? అదీ పోక్సో కేసులో… ప్చ్, యూపీ పోలీసుల మొత్తం ఇజ్జత్ తీసేశాడు ఆయన…
విషయం ఏమిటంటే..,? వార్త చదవండి…
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఒక దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన ఒక కేసులో తుది నివేదిక (FR) దాఖలు చేయడానికి ఒక దర్యాప్తు అధికారి ఆరు సమోసాలను లంచంగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సోమవారం విచారణ సందర్భంగా ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి నరేంద్ర పాల్ రాణా ఈ తుది నివేదికను రద్దు చేశారు.
Ads
పోలీస్ స్టేషన్‌లో దాఖలైన నివేదిక ప్రకారం…, 14 ఏళ్ల బాలిక 2019 ఏప్రిల్ 1న పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తి ఆమెను వెంబడించి, సమీపంలోని గోధుమ పొలంలోకి లాగి అసభ్యకరమైన పనులు చేశాడు. బాలిక కేకలు వేయడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన వీరేష్ బాలికను కులం పేరుతో దూషించి, చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు.
బాధితురాలి తండ్రి ప్రకారం…, పోలీసులు మొదటి నుంచీ పక్షపాత వైఖరిని ప్రదర్శించారు. ప్రారంభంలో వారు ఫిర్యాదును నమోదు చేయడానికి నిరాకరించారు, దీంతో బాలిక తండ్రి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు ఈ కేసు పోక్సో చట్టం కింద నమోదు చేయబడింది.
పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, దర్యాప్తు అధికారి 2024 డిసెంబర్ 30న కోర్టుకు తుది నివేదిక (FR) సమర్పించారు, ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా, బాధితురాలి తండ్రి 2025 జూన్ 27న ప్రొటెస్ట్ పిటిషన్‌ను దాఖలు చేశారు…
సంఘటనా స్థలంలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను అధికారి నమోదు చేయడంలో విఫలమయ్యారని, బాధితురాలు తన వాంగ్మూలంలో తాను అత్యాచారానికి గురయ్యానని పేర్కొందని పిటిషన్‌లో ఆరోపించారు. ఇంత తీవ్రమైన కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా, నిర్లక్ష్యంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
నిందితుడు వీరేష్‌కు సమోసాల దుకాణం ఉందని, దర్యాప్తు అధికారి ఆ దుకాణాన్ని సందర్శించి ఆరు సమోసాలను లంచంగా అంగీకరించి, ఆ తర్వాత తప్పుడు నివేదికను దాఖలు చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.
అంతేకాకుండా, తుది నివేదిక (FR)లో, బాధితురాలు వీరేష్‌ను సమోసాలకు ఉద్దెర అడిగిందని, అతను నిరాకరించడంతోనే వివాదం చెలరేగిందని, అది దురుద్దేశంతో కల్పించిన ఆరోపణలతో కూడిన కేసు అని సదరు అధికారి పేర్కొన్నారు… వార్నీ, ఏం కేసురా బాబూ..!! (ఉపయోగించిన చిత్రం కేవలం ప్రతీకాత్మక చిత్రం మాత్రమే)
Share this Article