.
నోస్ట్రడామస్ పేరు విన్నారు కదా… సేమ్, బాబా వాంగ పేరు కూడా… ప్రపంచంలో ఎప్పుడేం జరగబోతున్నదో జోస్యాలు చెప్పిన ప్రపంచ ప్రముఖ జ్యోతిష్కులు… వాళ్లు చెప్పినవి ఎన్ని నిజమయ్యాయి, ఎన్ని అర్థమయ్యాయి, ఎన్ని ఫెయిలయ్యాయనే లెక్కలు వదిలేస్తే…
అంతే పేరున్నది జపాన్‌కు చెందిన రియో టాట్సుకి… ఆమెను మరో బాబా వాంగ అంటుంటారు… 1999 లో స్వదస్తూరితో ‘ది ఫ్యూచర్ ఐ సా’ అని ఓ పుస్తకం రాసింది… యువరాణి డయానా మరణం, 2011 జపాన్ భూకంపం, సునామీ, కోవిడ్ మహమ్మారి గురించి రాసిందని చెబుతారు…
Ads
ఆమె నిజానికి 2025 తరువాత ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేదు… కానీ ఆమె చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది ఓ జోస్యం మీద… 2025 జూలై 5… ఓ భారీ ఉత్పాతం… నీటి అడుగున ఓ విస్పోటనం భారీ సునామీని సృష్టించి జపాన్‌ను ధ్వంసం చేస్తుంది, ఇది ఫిలిప్పీన్స్, జపాన్ మధ్య సంభవిస్తుంది… ఇదీ ప్రస్తుతం వైరల్ అవుతున్న జోస్యం…
మామూలుగా నెట్‌లో వైరల్ కావడం వరకూ వోకే… రకరకాల జోస్యాలు వస్తూనే ఉంటాయి, అదుగో యుగాంతం, ఇదుగో విధ్వంసం వంటి కాన్‌స్పిరసీ థియరీలు వస్తూనే ఉంటాయి కదా… కానీ ఈమె జోస్యం భయాన్ని క్రియేట్ చేస్తోంది…
జపాన్‌కు పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు అనేకమంది… సునామీ భయంతో… ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లు డబ్బులు వాపస్ అడుగుతున్నారు… కొన్ని విమానాలే రద్దు చేశారు… హోటళ్ల బుకింగ్స్ నిలిచిపోయాయి… భయం పాకిపోతోంది… జూన్ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోయాయట. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు…
ప్రస్తుతం ఏ భూకంపమూ వచ్చే సూచనలు శాస్త్రీయంగా కనిపించడం లేదని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నా ఫలితం కనిపించడం లేదు… ఇవి భూకంపనలు కాదు, జస్ట్, సోషల్ మీడియా కంపనలు మాత్రమే అంటున్నారు…
ఆమె చెప్పిన జోస్యానికి తగినట్టుగా పలు గ్రహకూటములను కూడా ఊహిస్తూ అప్పుడే చాలామంది సోషల్ మీడియాలో భయాన్ని మరింత పెంచుతున్నారు… నిజంగానే ఏదో జరగబోతోందనే భావన వ్యాపిస్తోంది… ఇక చూడాలి… ఆమె కాలజ్ఞానం ఫలిస్తుందా..? కాలఅజ్ఞానంగా మిగిలిపోయి, దివ్యదృష్టి జ్యోతిష్యానికి మరో మరక పడుతుందా..?!
Share this Article