.
నిజానికి చాన్నాళ్లుగా సిధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులు ఆలోచించడమే మరిచిపోయారు… మధ్యలో మన అదితి రావు హైదరిని వనపర్తి సంస్థానపు కోట గుళ్లో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం నాలుగు రోజులు వార్తల్లో మెరిశాడు.., అప్పుడప్పుడూ ఏవో పొలిటికల్, కంట్రవర్సీ ప్రకటనలు చేస్తున్నప్పుడు మాత్రం వార్తల తెరపై కనిపించాడు…
సినిమాలపరంగా 2006లో బొమ్మరిల్లు తరవాత తనకు నిజమైన తెలుగు హిట్ లేదు… సుదీర్ఘమైన కెరీర్, కానీ ఎందుకో బాగా వెనుకబడిపోయాడు… ఇక కెరీర్ క్లోజ్ అయినట్టే అనుకునే దశలో అప్పుడొకటి, ఇప్పుడొకటి వస్తోంది… ఇప్పుడు తాజాగా త్రీ బీహెచ్‌కెే సినిమాతో వచ్చాడు… (మధ్యలో ఏడెనిమిదేళ్లు అస్సలు తనకు సినిమాలే లేవు)… పూర్ కెరీర్ మేనేజ్‌మెంట్…
Ads
ఈ సినిమాలో తనకు తోడుగా సీనియర్ హీరో శరత్ కుమార్… తనూ తెలుగు వాళ్లకు చాన్నాళ్లుగా తెరమీద కనిపించడం లేదు… ఒకెేసారి కన్నప్ప ప్లస్ ఈ సినిమా… అప్పుడెప్పుడో, అంటే 1996 లో ఎరుపు లోలాకు కులికెను కులికెను, ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను అంటూ ప్రేమలేఖలో ముగ్దంగా మెరిసిన దేవయాని మళ్లీ కనిపించింది ఇన్నేళ్లకు… (తమ్ముడు సినిమాలో లయలాగా)…
మిగతా ఇద్దరు ఫిమేల్ తారలు చైత్రా, మీథా కూడా తెలుగు తెరకు కొత్తే… సో, మొత్తానికి ప్యూర్ తమిళ టీమే… యోగిబాబుతో సహా… క్లుప్తంగా చెప్పాలంటే… శరత్ కుమార్, సిధార్థ్ తప్ప మిగతావాళ్లు నటించడానికి పెద్దగా ఏమీలేదు, దేవయాని కూడా… కాస్త మిథా కాస్త నయం… అయితే ఒకటి మెచ్చుకోవాలి… సినిమా మొత్తం బోర్‌గా నడుస్తున్నా సరే, ఎక్కడా ఒక్క హై లేకుండా విసిగించినా సరే… అశ్లీలం జోలికి గానీ, అనవసరం ఐటమ్స్ జోలికి గానీ పోలేదు…
నీట్‌గా ఉంది, స్ట్రెయిట్‌గా ఉంది… పెద్ద పెద్ద ట్విస్టులు, స్క్రీన్ ప్లే ప్రయోగాలు గట్రా ఏమీ లేవు… ఒక సొంతిల్లు కొనుక్కోవాలని అనుకునే సగటు మధ్యతరగతి జీవితాన్ని చూపించాడు దర్శకుడు… మన ఆదాయం ఎప్పుడూ రూపాయి అయితే అవసరాలు పది రూపాయలు… పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనుకోని ఖర్చులు, ఇదే జీవితం… అదే చూపించాడు దర్శకుడు…
బీజీఎం వంటివీ మరీ అసహజంగా హోరెత్తించకుండా కాపాడాడు… ఎటొచ్చీ, కథ నీరసంగా సాగుతూ ఉంటుంది… సింపుల్‌గా చెప్పాలంటే ఇది టెస్ట్ మ్యాచ్ వంటి సినిమా… కానీ ప్రస్తుతం ప్రేక్షకులు కోరుకునేది టీ20 మ్యాచ్… అదుగో ఆ స్పీడ్ లోపించింది… ప్రేక్షకులు ఏదో కొత్తగా కోరుకుంటున్నారు… తమ రొటీన్ జీవన కష్టాలను మరిపించే ఫిక్షన్, ఫాంటసీ ఏదైనా సరే… అవి మరిచిపోదామని థియేటర్ వెళ్లే అక్కడా తమ కష్టాలే కనిపిస్తే థ్రిల్ ఉంటుందా..? అదే ఈ సినిమా విజయం మీద పెద్ద ప్రశ్న..!!
Share this Article