Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘చోడో కల్‌ కీ బాతే, కల్‌ కీ బాత్‌ పురానీ– నయే దౌర్‌ మే లిఖేంగే నయీ కహానీ!’’

July 8, 2025 by M S R

..

( మెరుగుమాల నాంచారయ్య ) …. ‘‘ దురదృష్టవశాత్తూ గడియారం ముల్లు వేగంగా పరిగెడుతోంది. కాలం ముందుకు సాగుతోంది. గతం ఆలోచనలు పెరిగిపోతున్నాయి. భవిష్యత్తు కుంచించుకుపోతోంది. అవకాశాలు తగ్గిపోతుంటే విచారం వ్యక్తం చేయడాలు ఎక్కువైపోతున్నాయి. ’’

ప్రస్తుత ప్రపంచం తీరుపై ప్రసిద్ధ జపాన్‌ రచయిత హరూకీ మురాకమీ ఇది వరకు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. వయసు మీద పడుతున్నప్పుడు చేసే ధ్యానంలా ఈ మాటలు కనిపిస్తున్నాయి. మనను వీడకుండా పీడించే గత కాలపు ఆలోచనలు, జ్ఞాపకాల బరువు పెరిగిపోతోంది.

Ads

రాబోయే రోజుల్లో మనకు దొరకాల్సిన అవకాశాలు నిండుకుంటున్నాయి. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు తమ చరిత్రలను ఉద్వేగపూరితంగా మాట్లాడుకునే పద్ధతులకు, పోకడలకు ఇది అద్దం పడుతోంది.

ఇటీవల ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో జాతీయవాదం, ఎమర్జెన్సీ (1975–77)పై ప్రచురించిన వ్యాసాల్లో ఆసక్తికర చర్చలు సాగాయి. లోచూపు కోసం, మరిచిపోయిన చరిత్రల కోసం, అన్నింటికీ మించి వర్తమానాన్ని అర్ధం చేసుకోవడానికి మనం గతానికి సంబంధించిన ఘటనలను, పరిణామాలను కళ్ల ముందుకు రప్పించి చూడాల్సి అవసరం ఉందంటే ఎవరు కాదంటారు?

నేటి సమస్యలన్నింటికీ సమాధానాలు గతంలో దొరకవు. ప్రస్తుత దృష్టితో చరిత్రను పరిశీలించి ప్రయోజనం పొందడం కుదిరేపని కాదు. మనం అభిమానించే ప్రముఖ వ్యక్తులు, జవహర్లాల్‌ నెహ్రూ, మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్, రామ్‌ మనోహర్‌ లోహియా వంటి మహనీయులు అందించిన సిద్ధాంతాలు, అభిప్రాయాలను ఊతకర్రలుగా చేసుకుని ఎల్లకాలం మనం భవిష్యత్తును నిర్మించుకోలేము.

గాంధీ, లోహియా వంటి గత కాలం దార్శినికులకు తమ సొంత ఆలోచనలు ఉన్నాయి. వాటి ఆధారంగా సొంత నిర్ణయాలు తీసుకుని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు తమలోని లోపాలేమిటో సూటిగా చెప్పేవారు. మనం వారి అభిప్రాయాల నుంచి అవసరమైన అంశాలు తీసుకుంటూ, వారిలా ఆలోచించడంలో తప్పులేదు. కాని, మనం ఇప్పుడు సమకాలీన సమస్యలపై ఆలోచించకుండా పై ప్రముఖుల భావనలతో ఇప్పుడు బతికేయడం సాధ్యం కాదు.

ఉపయోగించడం నిలిపివేసిన గతకాలపు మార్గాలను తిరిగి తెరవడం ఆచరణ సాధ్యం కాదు. ఇవి ప్రస్తుత అవసరాలకు ఉపయోగపడే రాచమార్గాలు కాదు కాబట్టి అవి లేవనే దిగులు వల్ల ప్రయోజనం లేదు. పాత స్వర్ణ యుగాలు, మహోన్నత హిందూ జాతీయవాదం వంటి కాలం చెల్లిన అంశాలపై మనం జరిపే చర్చలను భవిష్యత్తు తరాలు తప్పక తమ వార సత్వంగా స్వీకరించాలా? అంటే–అవసరం లేదనే భావనే కలుగుతుంది. మారిన ప్రస్తుత పరిస్థితులు, ససమస్యలను లోతైన అధ్యయనంతో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలేగాని వాటికి గతించిన గతంలో పరిష్కారాలు వెతక కూడదు.

ఆధునిక భారత చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. పాలకుల బాధ్యతలకు సంబంధించిన ప్రధానాంశాలను ఆత్యయిక పరిస్థితి మనకు గుర్తుచేస్తుంది. అయితే, మనం ఎమర్జెన్సీపై చేస్తున్న చర్చ అంతా చారిత్రక పరిశీలన కిందికి రాదు. మరి ప్రస్తుత సమస్యలు, పాలకుల లోపాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికే ఆ చీకటి రోజులను గుర్తుచేకుంటున్నామా? ఎమర్జెన్సీ నాటి దుర్మార్గాలను గుర్తుచేస్తూ ప్రయోజనం పొందడానికి బీజేపీ ప్రయత్నాలను మనం అర్ధం చేసుకోవచ్చు.

మరి బీజేపీయేతర పక్షాలు ఎందుకు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాయి? అని ప్రశ్నిస్తే– అవి ప్రస్తుతం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన పని నుంచి పారిపోవడానికే అని జవాబు చెప్పవచ్చు. ఎమర్జెన్సీపై చర్చ విషయంలో అన్ని పక్షాలకూ ప్రయోజనం ఉంది. అందరిలో దోషాలున్నాయి. వర్తమానంలో వాడుకోవడానికి గతంలోని కొన్ని అంశాలను వినియోగించుకునే పోకడలు ప్రపంచంలోని అన్ని సమాజాల్లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక, నైతిక మార్పులు విస్తృత స్థాయిలో పరుగులు తీస్తున్న ప్రస్తుత సమయంలో భారతదేశంలో మనం ఇంకా 1970ల నాటి ఘటనలు, సిద్ధాంతాలు, చర్చనీయాంశాలలోనే కూరుకుపోయి ఉంటే ఎవరికి ప్రయోజనం? మనం అనవసరంగా గతం గురించి గుర్తుచేసుకుంటూ ఆలోచిస్తే, భవిష్యత్తు కుంచించుకుపోతుంది.

అందుకే ఇప్పుడు ఒక పాత హిందీ సినిమా పాట గుర్తుకొస్తోంది. ‘‘ చోడో కల్‌ కీ బాతే, కల్‌ కీ బాత్‌ పురానీ, నయే దౌర్‌ మే లిఖేంగే నయీ కహానీ!’’

  • (పాత విషయాలు వదిలేయండి. నిన్నటి విషయాలు పాతవి. నూతన మార్గంలో కొత్త కథ రాసుకుందాం’’.)

(ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో ఇటీవల ప్రచురితమైన డాక్టర్‌ ప్రతాప్‌ భాను మెహతా వ్యాసానికి సంక్షిప్త అనువాదం)…….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టాప్- 10 నుంచి బిల్ గేట్స్ ఔట్… తన మాజీ ఉద్యోగి తనను దాటేశాడు…
  • ది హంట్… వీపీ సింగ్‌పై రెక్కీ… జయలలితపైనా కన్ను… బ్యాకప్ బాంబర్…
  • అంత గౌరవమే ఉంటే… ఆ రికార్డు బ్రేక్ చేసి లారాకే అంకితం ఇవ్వాల్సింది
  • కేటీయార్ పోరాటాలు కొత్త పుంతలు కాదు… విచిత్ర పుంతలు ఫాఫం..!!
  • ‘‘చోడో కల్‌ కీ బాతే, కల్‌ కీ బాత్‌ పురానీ– నయే దౌర్‌ మే లిఖేంగే నయీ కహానీ!’’
  • క్షమించండి… యాదాద్రి కాదు… ఒడిశాలోని తారాతరిణి శక్తిపీఠం ఇది…
  • నాలుగు మెట్రో కథలు… కొత్తతరం నగర జీవితాలు… మెట్రో ఇన్ దినో…
  • అందరికీ సన్నబియ్యం… ఆచరణలో కష్టమైనా సర్కారు సక్సెస్..!
  • దలై లామా..! స్వధర్మం, స్వయంపాలన, స్వజనం కోసం అదే నిబద్ధత..!!
  • తండ్రి సమస్యను పరిష్కరించి… ఏటా 40 వేల కోట్ల మేరకు ఫాయిదా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions