.
John Kora
అవినీతికి అడ్డా… హెచ్‌సీఏ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పదవీ కాలం ముగియడం… పైగా అవినీతి ఆరోపణలు రావడంతో… సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించారు.
ఆ ఎన్నికల్లో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ పేరుతో ప్యానల్ ఏర్పాటు చేసిన జగన్ మోహన్ రావు… తన సమీప ప్రత్యర్థి అమర్‌నాథ్‌పై కేవలం ఒకే ఒక ఓటుతో గెలిచాడు. అమర్‌నాథ్‌కు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, ఆర్షద్ ఆయుబ్ మద్దతు ఇచ్చారు. అయితే…
Ads
- అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవిత మద్దతుతో జగన్ ప్రెసిడెంట్‌గా గెలిచారు…
అప్పటి దాకా క్రికెట్ క్లబ్స్‌తో పెద్దగా సంబంధం లేని జగన్ గెలుపుపై మొదటి నుంచి ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తప్పుడు దారిలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యాడని ఆరోపణలు చేశారు. గతంలో తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ చైర్మన్‌గా, హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా పని చేసిన జగన్ మోహన్ రావు… ఈ సారి ఏకంగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయిపోయాడు…
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ కావడానికి అడ్డదారులు తొక్కినట్లు సీఐడీ విచారణలో తాజాగా స్పష్టమైంది… (బీఆర్ఎస్ క్యాంపుకి షాక్…) గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడైన బీజీపీ నాయకుడు సి.కృష్ణ యాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసి… శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌నే గౌలిపుర క్రికెట్ క్లబ్‌గా నమ్మించి, హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు తెలిసింది.
- అప్పటి మంత్రి కేటీఆర్ అండదండలు కూడా ఉండటంతో (కులం కూడా ఒకటే) ఎన్నికల్లో డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచినట్లు తెలుస్తోంది…
కాంగ్రెస్ పార్టీ తరపున మహ్మద్ అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న బిజీలో ఉండటంతో హెచ్‌సీఏలో ఏం జరిగిందన్న విషయాలను అప్పట్లో తెలుసుకోలేకపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన విషయాలు తెలుసుకొని స్పందించారు…
కానీ ఎవరూ దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే హెచ్‌సీఏలో జరుగుతున్న అవకతవకలపై మాజీ క్రికెటర్లు దృష్టి పెట్టారు. ఐపీఎల్ సమయంలో సన్‌రైజర్స్ యాజమాన్యంపై జగన్ మోహన్ రావు చేసిన ఒత్తిడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది…
ఇదే అంశాన్ని అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారు. అప్పుడే హెచ్‌సీఏలో జరుగుతున్న అవకతవకలపై దర్యాప్తుకు ఆదేశించారు.
వాస్తవానికి బీసీసీఐ, దాని అనుబంధ అసోసియేషన్లకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. అలా ఉంటే బీసీసీఐ గుర్తింపు అంతర్జాతీయంగా రద్దు అవుతుంది. ఐసీసీ నిబంధనల్లో ఇది స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే సొసైటీగా, స్వతంత్ర సంస్థగా గుర్తింపు పొందిన బీసీసీఐ మొత్తం రాజకీయ నాయకులతోనే నిండిపోయింది…
రాజకీయ నాయకులు లేదా వారి వారసులే బీసీసీఐ, దాని అనుబంధ అసోసియేషన్లను నడిపిస్తున్నారు. ఇది కేవలం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అన్ని రాష్ట్రాల అసోసియేషన్ల పరిస్థితి అంతే…
బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలే కాదు… ప్రాంతీయ పార్టీల నాయకుల పెత్తనం ఆయా అసోసియేషన్లలో నడుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ సంస్థ కావడంతో ఇది రాజకీయ నాయకులకు మంచి ఏటీఎంలా మారిపోయింది. దీంతో సహజంగానే అవినీతి, అక్రమాలకు అడ్డాగా నిలుస్తోంది…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇవ్వాళే కాదు… గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కుంది… అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఉన్న… ఉప్పల్ స్టేడియంకు మ్యాచ్‌లు కేటాయించకపోవడానికి ఇక్కడి హెచ్‌సీఏ మేనేజ్‌మెంటే కారణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి…
ఏదేమైనా హెచ్‌సీఏను పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే… తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మనుగడే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది….. #భాయ్‌జాన్
Share this Article