.
తాజాగా రాజ్యసభకు ప్రభుత్వం / రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురిలో క్రికెటర్లు లేరు, సినిమా తారలు లేరు… కానీ నాలుగు భిన్న వృత్తులు… నాలుగు దిక్కుల నుంచీ… ఓ విశిష్టమైన ఎంపిక ఈసారి…
జూలై 13న చరిత్రకారిణి మీనాక్షి జైన్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సీనియర్ సి. సదానందన్ మాస్టర్, 26/11 కేసు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా రాజ్యసభకు నామినేటయ్యారు…
Ads
నామినేటెడ్ సభ్యులకు మిగతా రాజ్యసభ సభ్యులకు వర్తించే అన్ని ప్రోటోకాల్స్ వర్తిస్తాయి గానీ రాష్ట్రపతి ఎన్నికలకు వోటు హక్కు మాత్రం ఉండదు… వీరిలో జైన్ ఢిల్లీ (ఉత్తరం), ష్రింగ్లా స్వస్థలం డార్జిలింగ్ (తూర్పు), నికం ముంబై (పశ్చిమ) సదానందన్ మాస్టర్ కేరళ (దక్షిణం) నుండి వచ్చారు…
ఎస్, ముందే చెప్పుకుంటున్నట్టు… వీళ్లు సెలబ్రిటీలు కారు… భావోద్వేగ ఎంపికలు కూడా కావు… సంగీత దిగ్గజాలో, ఒలింపిక్ పతకధారులో కూడా కాదు… 2018-22 ఎంపికలు కావు… అప్పట్లో ఇళయరాజా, మేరీ కోమ్, పీటీ ఉష తదితరులు… కానీ ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ ఎంపికలు…
జైన్ విషయమే తీసుకొండి… ఆమె చాలామందికి తెలియదు, కానీ ప్రభావశీల చరిత్రకారిణి, ఆమె గత రెండు దశాబ్దాలుగా మన నాగరిక చరిత్రను భారతీయ దృక్పథం నుండి – తరచుగా హిందూ దృక్పథం నుండి – పునర్నిర్మించడానికి ప్రయత్నించింది… మధ్యయుగ దండయాత్రలు, ఆలయ విధ్వంసాలు, మొఘల్ పాలన వంటి అంశాల్లో ఆమె ఓ చరిత్ర పరిశోధకురాలుగా భిన్నమైన ధోరణితో వెళ్లింది…
జైన్ రాసిన ‘రామ అండ్ అయోధ్య’ (2013); ‘సతి: ఎవాంజెలికల్స్, బాప్టిస్ట్ మిషనరీస్, అండ్ ది చేంజింగ్ కలోనియల్ డిస్కోర్స్’ (2016); ‘ది బ్యాటిల్ ఫర్ రామ: కేస్ ఆఫ్ ది టెంపుల్ ఎట్ అయోధ్య’ (2017); ‘ఫ్లైట్ ఆఫ్ డెయిటీస్ అండ్ రీబర్త్ ఆఫ్ టెంపుల్స్: ఎపిసోడ్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ’ (2019) వంటి పుస్తకాలు వామపక్ష చరిత్రకారులకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ చేస్తున్న పోరాటానికి మేధోపరమైన లోతును అందించాయి…
పక్కా ఆర్ఎస్ఎస్ ఎంపిక… సదానందన్ మాస్టర్ నామినేషన్ కూడా అంతే ముఖ్యమైనది… సదానందన్ మాస్టర్ రాజకీయ హింస నుండి బయటపడిన వ్యక్తి… 1994లో కేరళలోని కన్నూర్ జిల్లాలో సీపీఐ(ఎం) కార్యకర్తల దాడిలో ఆయన రెండు కాళ్లను కోల్పోయాడు… వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయుడు… కేరళలో సంఘ్ చురుకైన కార్యకర్త… ఇదీ ఆర్ఎస్ఎస్ ఎంపికే…
ఇది గుర్తింపు రాజకీయాలకు కాకుండా సైద్ధాంతిక విధేయత, గ్రౌండ్- లెవల్ సంస్థ- నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుంది… ఆయన జనసమూహాన్ని ఆకర్షించేవాడు కాదు, కానీ కేడర్-బిల్డర్… ఆ తర్వాత నికమ్ అనే న్యాయవాది… భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద వ్యతిరేక విచారణలలో ప్రసిద్దుడు…
1993 ముంబై వరుస పేలుళ్ల నుండి నవంబర్ 2008 ముంబై దాడుల వరకు తను ప్రాసిక్యూటర్… తనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మద్దతు… ఇది మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయ గతిశీలతకు ఒక నిదర్శనం.., నికమ్ కేవలం ఒక నిష్ణాతుడైన న్యాయవాది మాత్రమే కాదు; ఉగ్రవాదం, న్యాయం, క్రిమినల్ న్యాయశాస్త్రంపై చర్చలలో పార్టీకి శక్తివంతమైన స్వరం… రాజ్యసభలో ఆయన ప్రవేశం అంటే బిజెపికి కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వంటి వారిని ప్రతిపక్ష స్థానాల్లో ఎదుర్కోవడానికి ఒక చట్టపరమైన జ్ఞాని రావడమే…
ఈ ముగ్గురి ఎంపికకూ కాస్త భిన్నంగా, ష్రింగ్లా ఎంపిక… తను ఓ బ్యూరోక్రాట్… తను చాన్నాళ్లు విదేశాంగ కార్యదర్శి… G20 భేటీల కోఆర్డినేటర్… ఈయనది సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఎంపిక అంటున్నారు… ఇది విదేశాంగ వ్యవహారాలు, వాణిజ్య విధానంపై విశ్వసనీయ సాంకేతిక నిపుణుడిని పార్లమెంటులో చేర్చే ప్రయత్నం…
ష్రింగ్లా స్వస్థలం డార్జిలింగ్… తనకు బీజేపీ టికెట్ ఇవ్వలేకపోయింది… కానీ ఇప్పుడు నేరుగానే పార్లమెంటుకు పంపిస్తోంది… జాగ్రత్తగా పరిశీలిస్తే… గతంలోలాగా తరచూ ఓడిపోయేవాళ్లను పార్లమెంటుకు పంపించే తరహా పునరావాస ఎంపికలు కావు ఇవి… వ్యూహాత్మక, సమతుల ఎంపికలు ఇవన్నీ… పార్లమెంటులోకి భిన్నరంగాల నైపుణ్యాలను ప్రవేశపెట్టడం…
ఒక జయశంకర్, ఒక అశ్విని వైష్ణవ్ తరహాలోనే… కేవలం రాజకీయ నాయకులనే కాదు, బ్యూరోక్రాట్లను, మేధావులను, భిన్నరంగాల నిపుణులను కూడా పార్లమెంటులో నిర్మాణాత్మక, నాణ్యమైన చర్చలు, సూచనల కోసం ప్రవేశపెట్టడం ఇదంతా…
ఇంకాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఈసారి గవర్నర్లు, రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆర్ఎస్ఎస్ ముద్ర బలంగా కనిపిస్తోంది… కేవలం మోడీషాల ఎంపికలు కావు ఇవి… హర్యానా గవర్నర్‌గా ఎంపికైన ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్ ఆర్ఎస్ఎస్ సంబంధాలు కలిగిన వ్యక్తి.., గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఎంపిక పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం ఆబ్లిగేషన్…
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా ఎంపిక విషయానికొస్తే, జమ్మూలో ఆయనకున్న సంఘ్ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి… స్థూలంగా ఈ ఏడు ఎంపికలూ (రాజ్యసభ సభ్యులు, గవర్నర్లు) బీజేపీపై మళ్లీ పెరుగుతున్న ఆర్ఎస్ఎస్ గ్రిప్ సూచిస్తున్నాయి…!!
Share this Article