.
నిన్న జగడపు చనువుల జాజర పాటకు, అర్థమేమిటో తెలియకుండా… చచ్చుపుచ్చు రీల్స్ చేసి భ్రష్టుపట్టిస్తున్న వాళ్ల గురించి చెప్పుకున్నాం కదా… ఓసారి ఇదీ చదవండి…
దేవుడి కీర్తనల్లో శృంగారమే కాదు, అన్ని రకాల ఉద్వేగాల కీర్తనలకూ ప్రాధాన్యం ఉంటుంది… లాలి, భక్తి, రక్తి, వైరాగ్యం, ముక్తి అన్నీ… వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటామనేది మన అవగాహన, మన పరిణతి, మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది… సరే, ఓ మంచి కీర్తనపై ఈ విశ్లేషణ ఓసారి చదవండి…
Ads
Rochish Mon
…. వేంకటేశ్వరుడి నవ్వులు ఆమెకు అక్షతలు
——————
“వీడె మిత్తువు రావమ్మా వీఁడె పానుపుపై నున్నాఁడు
జోడైన వయసులే సొంపులు వుట్టించీని”
తాంబూలం (వీడె) ఇద్దువుగాని రావమ్మా; వీడు పాన్పుపై ఉన్నాడు; జత కలిసిన వయసులే సొంపుల్ని స్రవింపజేస్తాయి (వుట్టించీని) అని అంటూ అన్నమయ్య ఒక శృంగార సంకీర్తన చేస్తున్నారు. జతకలిసిన వయసులే సొంపుల్ని స్రవింపజేస్తాయి అని అనడం చాల గొప్పగా ఉంది.
సొంపు అంటే అందం అనీ, సుఖం అనీ, సంతోషం అనీ, వన్నె అనీ అర్థాలు ఉన్నాయి. జత కలిసిన వయసులు వీటినన్నిటినీ స్రవింపజేస్తాయి అని అన్నమయ్య నుడి. అందుకే సొంపు పదం వాడి ఉంటారు. అన్నమయ్య ఇలా అనడమే ఒక సొంపు; అన్నమయ్య అన్నందువల్లే అది సొంపు. సొంపుల్ని స్రవింపజేస్తాయి అని అనడం అన్నమయ్య మాత్రమే అనగలిగింది. ఉట్టు అన్న పదానికి పుట్టు, కలుగు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఆ అర్థాలూ ఇక్కడ సరిగ్గా పొసుగుతాయి.
ప్రబంధ కవులు చిమ్మిన దానికన్నా మించిన భావుకతతో ఎంతో ఇంపుగానూ, జానుతెనుగుతోనూ, సింగారాల సిరిగానూ ఉన్న ఈ శృంగార సంకీర్తనలోకి మఱింత ముందుకెళదాం…
- “సొలసి నీవు చూచిన చూపులెల్లాఁ బతికిని
కలువ పూవుదండలై కమ్ముకొనెను
నెలఁత నీవు చక్కని నెమ్మోము చూపితేను
వలుద చంద్రబింబమై వలపులు రేఁచెను”
పరవశించిపోయి (సొలసి) నువ్వు చూసిన చూపులన్నీ సజీవమైన (బతికిన ) కలువ పూల దండలై కమ్ముకున్నాయి; వనితవైన నువ్వు చక్కటి నిండు ముఖాన్ని చూపిస్తే పెద్ద చంద్రబింబమై వలపు వచ్చింది (రేచేను) అంటూ మనోజ్ఞమైన బావుకతను మనకు అందిస్తున్నారు అన్నమయ్య.
పరవశించిపోయి చూసిన చూపులన్నీ కలువపూల దండలై కమ్ముకున్నాయి అని అంటూ ఎంతో గొప్ప భావుకతను ప్రభవింపజేశారు అన్నమయ్య.
నువ్వు నీ చక్కటి నిండైన ముఖాన్ని చూపిస్తే చంద్రబింబంలా వలపు వచ్చింది అనడంలో ప్రేమను పెద్ద చంద్రబింబంగా ఉపమించడం ఉన్నతంగా ఉంది.
- “అరిది నాతనితోడ నాడిన మెల్లని మాట
తరితీపు తేనెలై దైలువాఱెను
సరుగ నీవప్పుడు సన్న నేసిన సన్న సురత
పులతలై చుట్టుకొనెను”
అపురూపంగా (అరిది) అతడితో చెప్పిన మెల్లని మాట వలపు (తరితీపు) తేనెలై పొరలి పాఱింది; అందంగా (సరుగ లేదా సరగ) నువ్వు అప్పుడు చిన్నగా (సన్న) చెయ్యగా సైగ (సన్న), రతి అనే (సురతపు) లతలు చుట్టుకున్నాయి అంటూ సంభ్రమాన్నిచ్చే భావుకతతో సంగమ దృశ్యాన్ని హృద్యంగా, హృదయంగమంగా చిత్రించారు అన్నమయ్య.
అపురూపంగా ఆమె మెల్లగా అన్న మాట వలపు తేనెలై పొంగిపొరలిందట; ఆపై ఆమె చిన్నగా సైగ చెయ్యగా రతి లతలు చుట్టుకున్నాయట. ఇంత మానసోల్లాసమైన రచనను ఎక్కడా, ఏ కవీ ఇంత వఱకూ అందివ్వలేదేమో?
- “యెనసి శ్రీవెంకటేశు యెదుట నవ్విన నవ్వు
చెనకి పైఁజల్లిన సేసలాయను
పెనఁగి చేతులు వట్టి పిలిచిన పిలుపులు
తనివోని కంకణ దారాలాయను”
సంగమించి (ఎనసి) శ్రీవేంకటేశ్వరుడు ఎదురుగా నవ్విన నవ్వులు తాకి (చెనకి) తలపై చల్లిన అక్షతలు (సేస) అయ్యాయి; పెనవేసుకుని (పెనఁగి) చేతుల్ని పట్టుకుని పిలిచిన పిలుపులు తృప్తిపడని (తనివోని) కంకణ దారాలయ్యాయి అంటూ భావుకత అలరుల్ని (శోభల్ని) కురిపించారు అన్నమయ్య.
ఇక్కడ ‘పెనఁగి చేతులు వట్టి పిలిచిన పిలుపులు
తనివోని కంకణ దారాలాయను’ అన్న పంక్తులు
శంకర కవి రాసిన ‘హరిశ్చంద్రోపాఖ్యానము’లో “బహు బంధ రతికేళి పటిమచేఁ దనివోని పుంభావ సంభోగముల బెడంగు…” అన్న పంక్తుల్ని గుర్తుకు తెస్తున్నాయి.
సంగమించిన తరువాత వేంకటేశ్వరుడు నవ్విన నవ్వులు తాకి అవి ఆమె తలపై చల్లిన అక్షతలయ్యాయట. ఎంత శ్రేష్ఠమైన భావుకత! చేతుల్ని పట్టుకుని పిలిచిన పిలుపులు చేతికి తృప్తిపడని కంకణాల దారాలయ్యాయట. ఉచ్చస్థాయి భావుకత అంటే ఇదే.
సంగమం ఒక రసావిష్కారాన్నిస్తుంది. జయదేవుడు తన ఒక అష్టపది (11) లో “ఆశ్లేషా దను చుంబనా దను నఖోల్లోఖా దను స్వాంతజ / ప్రోద్బోధాదనుసంభ్రమా దనుర తారంభాదనుప్రీతయోః / అన్యార్థంగతయోర్భ్రమాన్మిళిత యోస్సంభాషణైర్జానతో / దంపత్యో రహ కోన తమసి వ్రీడావిమిశ్రోరసః” అని అంటాడు.
అంటే కౌగిలించుకోవడంతోనూ, చుంబించడంతోనూ, గోళ్లతో గిచ్చడంతోనూ, కామోద్రేకంతోనూ, రతి సంభ్రమంతోనూ, రతి ప్రారంభంలోనూ, సంతోషిస్తూ చీకట్లో ఒకళ్లనొకళ్లు చూసుకోలేని స్థితిలో ఓలలాడుతూ రతి చివరలో సిగ్గుపడుతున్నారు; ఇలాంటి మదన సుఖాన్నిచ్చే చీకటి రాత్రుల్లో ఉద్భవించని రసమేదీ లేదు అని అర్థం.
అన్నమయ్య ఈ సంకీర్తనలో అనితరసాధ్యమైన భావనతో, భావుకతతో శృంగార రసాన్ని అవిష్కరించారు. నాయికానాయకుల సంగమాన్ని ఇలా ఇంతలా అపూర్వమైన, అద్వితీయమైన భావుకతతో జానుతెనుగు పదాలతో ఇంపుగా సొంపైన కవిత్వంగా చెప్పడం ఒక్క అన్నమయ్యకే సాధ్యం.
ఇంతకు పూర్వం ఈ తరహా రచన ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా? ఎవరు సమాధానం చెప్పగలరు? ఎవరూ నిలబడగలిగే సమాధానం చెప్పలేరేమో? అహా అన్నమయ్యా! నువ్వు మా తెలుగు కవిత్వానికి అయ్యవయ్యా!!
భాసమానమైన భావుకతతో భవ్యమైన సంకీర్తనై శృంగారపు సింగారాల సిరిగా విలసిల్లూతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది….. రోచిష్మాన్ 9444012279
Share this Article