.
ఏసీబీ వలలో గతంలో పెద్ద పెద్ద తిమింగలాలు పడ్డాయి… వందల కోట్ల మేరకు మింగిన కేసులూ దొరికాయి… కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసిన ఎవడిని తన్నినా వందల కోట్లు రాలుతున్నాయి… తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగిన ముగ్గురు ఇంజనీర్ల అవినీతి యవ్వారం విభ్రమ కలిగించే స్థాయిలో ఉంది…
అసలు ఇంజనీర్లే అంతగా కుమ్మేశారంటే ఇక కంట్రాక్టు ఏజెన్సీలు, కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్ద తలలు ఇక ఏమేరకు సంపాదించారో అర్థం చేసుకోవల్సిందే… అసలు ఏసీబీ ఈ మొత్తం డొంకను తవ్వగలదా..? విచారణ కమిషన్లు ఈ బాగోతాల్ని మొత్తం తేల్చగలదా అనే కొత్త సందేహాలు కలిగేలా బయటపడుతున్నయ్ వివరాలు…
Ads
ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)లు, ఒక ఈఈ… కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల భాగస్వాములైన ఈ ముగ్గురూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు… ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం… ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఈ విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్‌రావు, కాళేశ్వరం ఈఎన్‌సీగా పనిచేసిన హరిరామ్ నాయక్, ఈఈ నూనె శ్రీధర్ ఆస్తుల మార్కెట్ విలువ రూ.1000 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు…
విశ్రాంత ఈఎన్‌సీ అనే పదమే తప్పేమో… అవిశ్రాంతంగా దంచుకుంటూనే ఉన్నాడు… అసలు వీళ్లపై నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లు, రిమాండ్ రిపోర్టులు, కస్టడీ విచారణ నివేదికలు అన్నీ ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్లు సమాచారం…
నూనె శ్రీధర్ కుమారుడి వివాహం థాయ్‌లాండ్‌లో జరిగింది… ఆ ఖర్చులపైనా ఈడీ దృష్టి సారించింది… మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌రావు కొన్ని కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులపైనా ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు… మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు… ఈ ముగ్గురు ఇంజనీర్లకు లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ భూమి, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తేలింది…

హరిరామ్ నాయక్
… కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీగా పనిచేశారు… ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు… నూనె శ్రీధర్
… సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేశారు. ఈ ఏడాది జూన్ 11నఏసీబీ అధికారులు శ్రీధర్‌ను అరెస్టు చేశారు… మురళీధర్‌రావు
… ఈ విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్‌రావును మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు… తండ్రి ఈఎన్సీ, కొడుకు అభిషేక్‌రావుకు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు…
మళ్లీ అదే ప్రశ్న… ఇలాంటి వాళ్లను మన వ్యవస్థ శిక్షించగలదా..? కొన్నేళ్ల కేసులు పరిశీలించండి… ఒక్కరైనా జైలులో ఉన్నారా..? వీళ్లనే ఏమీ చేయలేేకపోతున్న సిట్యుయేషన్‌లో పెద్ద పెద్ద కంట్రాక్టు ఏజెన్సీలు, వాటి ఓనర్లు, మద్దతుగా నిలిచి అపారంగా దండుకున్న రాజకీయ నాయకులను ఏం చేయగలమనేదే పెద్ద ప్రశ్న…
చివరగా… ఒక్కొక్కరూ వందల కోట్ల ఆస్తులతో పట్టుబడుతున్నారు కదా… పట్టుబడని వాళ్లు కూడా బోలెడు మంది… తెలంగాణ సంపద కొందరి వద్దకే ప్రవహిస్తోంది కదా… ఫాఫం, పంచాయతీరాజ్ ఈఎన్సీ కనకరత్నం మాత్రం మరీ 50 వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు… ఇంత బతుకూ బతికి చివరకు…!! ఇదీ రిటైరైన తరువాత ఎక్స్‌టెన్షన్ పొందిన కేరక్టరే… అసలు ఏ శాఖలోనూ, ఏ పోస్టుకూ అసలు ఎక్స్‌టెన్షన్లు ఉండకూడదని ఓ చట్టం తీసుకురండి రేవంత్ రెడ్డి సాబ్..!!
Share this Article