.
ఈమధ్య మళ్లీ RIC పేరు వినిపిస్తోంది… ఏమిటిది..? ఎందుకు..? ఈ ప్రశ్నలపై సెర్చింగులు కూడా సాగుతున్నాయి… ఆ కూటమి ఇండియాకు అవసరమా..? ప్రత్యేకించి అమెరికా పెత్తనాలు, సుంకాలు, ఆంక్షలు, ఆర్థిక వేధింపులే గాకుండా… అది పోషించే పెద్దన్న పాత్రను, దాని మిత్ర కూటమిని ఈ రిక్ బ్యాలెన్స్ చేయగలదా..? ఇవీ ప్రశ్నలు…
ఒకప్పుడు అమెరికా, రష్యా… ప్రపంచ దేశాలు ఎటో ఒకవైపు ఉండి, రెండు అగ్రదేశాల నడుమ ప్రచ్ఛన్నయుద్ధం సాగేది… అఫ్‌కోర్స్, తటస్థ దేశాలూ కొన్ని ఉండేవి… ఎప్పుడైతే రష్యా ప్రపంచ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా నిలవలేకపోయిందో… ఇక అమెరికా ఏకపక్షంగా ప్రపంచాన్ని పాలిస్తోంది…
Ads
రష్యాతో దోస్తీ కొనసాగుతున్నా అమెరికా వైపు క్రమేపీ ఇండియా మొగ్గు చూపించసాగింది… ఈమధ్య ట్రంప్ అధ్యక్షుడయ్యాక చాలా దేశాలపైనే గాకుండా ఇండియా మీదా విరుచుకుపడుతున్నాడు… రష్యాతో వ్యాపారం చేస్తే ఏకంగా 500 శాతం సుంకం వేస్తానని బెదిరించాడు… బ్రిక్స్ దేశాల కూటమి గనుక తన డాలర్‌కు పోటీగా మరేదైనా కరెన్సీ తీసుకొస్తే ఒక్కొక్కరి అంతుచూస్తానంటున్నాడు…
ప్రపంచ దేశాలను సుంకాల పేరితో హడలగొడుతున్నాడు… చాలా ఇష్యూస్… రష్యాతో వైరం ఈనాటిది కాదు, చైనాతోనూ వైరమే, కానీ మరో అగ్రదేశంగా ఎదుగుతున్నందున చైనా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు… కానీ అదీ ప్రత్యర్థే… ఆ చైనా మీద ఏం సాధించాలనుకున్నా పాకిస్థాన్ అనే ధూర్తదేశపు అడ్డా అమెరికాకు సరిపోవడం లేదు, పైగా పాకిస్థాన్- చైనా దోస్తులు… అందుకని దానికి ఇండియా కావల్సి వచ్చింది… క్వాడ్ అనే కూటమిని కట్టింది… (ఆర్థికంగా ఇండియా అవసరం, ఇండియా అతి పెద్ద వినిమయ మార్కెట్)…
క్వాడ్ ఏర్పాటు స్పిరిట్ కూడా అమెరికా మరిచిపోయింది… అది అంతే, నమ్మలేం… అమెరికాను నమ్మలేం సరే, రిక్ కూటమి కడితే అందులో చైనాను నమ్మగలమా..? అదీ అంతే కదా… నమ్మించి పోటు పొడిచే రకం… ఇదే చర్చ…
- అమెరికా వాడికన్నా చైనా వాడితో దోస్తీ కొంత నయం… పాకిస్థాన్ విషయంలో గానీ, తన కవ్వింపులు, కబ్జాల విషయంలో గానీ, రష్యాతో బంధం మరింత బలపడే విషయంలో గానీ, అమెరికా పెత్తనాన్ని బ్యాలెన్స్ చేయడంలో గానీ, ప్రత్యామ్నాయ ఆర్థికశక్తి సృష్టిలో గానీ… చాలా కోణాల్లో చైనాతో దోస్తీయే నయమనే చర్చ కూడా సాగుతోంది…
ఈ రిక్ (రష్యా, ఇండియా, చైనా) కూటమి ఒక వ్యూహాత్మక కూటమి, ఈ ప్రయత్నాన్ని మొదట 1990ల చివరలో అప్పటి రష్యా ప్రధాన మంత్రి యెవ్జెనీ ప్రిమాకోవ్ మొదలుపెట్టాడు… పైకి ఏం చెప్పుకుంటున్నా సరే, అమెరికా, దాని మిత్రదేశాలకు చాలా అంతర్జాతీయ వ్యవహారాల్లో ఓ పర్‌ఫెక్ట్ చెక్ అవుతుంది… ఎందుకు ఈ వాయిస్‌కు బలం ఉంటుందంటే..?
ప్రపంచ భూభాగంలో 19% కంటే ఎక్కువ విస్తీర్ణం… ప్రపంచ GDPలో 33% కంటే ఎక్కువ వాటా… ఇవన్నీ అణ్వాయుధ దేశాలు, పైగా రష్యా, చైనా UN భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు… ఇలా రిక్ కూటమికి బలమైన దౌత్య, వ్యూహాత్మక శక్తి వస్తుంది.
- కానీ, ముందే చెప్పుకున్నట్టు… చైనా ఎలా బలమో, చైనా అంతే బలహీనత ఈ కూటమికి… రష్యా, ఇండియా దోస్తీ కాలపరీక్షకు నిలిచింది… పరస్పర సహకారం ఈరోజుకూ బాగానే ఉంది… ఎటొచ్చీ చైనాతోనే సమస్య… కోవిడ్, తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారత్- చైనా సైనిక ప్రతిష్టంభన కారణంగా ఈ రిక్ కూటమి బలమైన ఆచరణలో రాకుండా బ్రేకులు వేసింది…
అమెరికా సెగ తగులుతోంది కదా… ఇప్పుడు మళ్లీ రష్యా, చైనాలు RIC కూటమిని పునరుద్ధరించడానికి ఆసక్తి చూపుతున్నాయి… RIC ఫార్మాట్‌ను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో బీజింగ్, న్యూఢిల్లీలతో చర్చలు జరుపుతున్నట్లు రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో ఇటీవల పేర్కొన్నాడు…
RIC సహకారం మూడు దేశాలకు, ప్రాంతీయ,, ప్రపంచ శాంతి, భద్రత, స్థిరత్వం, పురోగతికి ప్రయోజనకరంగా ఉంటుందని చైనా పేర్కొంది… రష్యా,, భారతదేశంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది…
భారతదేశం ఈ విషయంపై అంత ఖచ్చితమైన వైఖరిని తీసుకోలేదు… భారత్- చైనా సరిహద్దు సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు, చైనాను నమ్మలేదు, అందుకే భారత్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది… కానీ స్థూలంగా ఇప్పుడు ఇండియా అమెరికాకు కావాలి, రష్యాకు కావాలి… అది మాత్రం నిజం… మన అడుగులు ఎటువైపు అనేది కాలం చెబుతుంది..!! అదేసమయంలో ఈ సార్క్, కామన్‌వెల్త్, జీ7 ఎట్సెట్రా కూటములన్నీ వేస్ట్… ఓ కొత్త బలమైన కూటమి ఆవశ్యకత మాత్రం ఉంది..!!
.
తాజా వార్త :: త్వరలో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ జరగబోతోందని అమెరికన్ మీడియా వార్త
Share this Article