.
Thummeti Raghothama Reddy .....
ఇటీవల నా మాజీ కోలీగ్ ఒకరు చనిపోయారని తెలిస్తే, ఉద్యోగ జీవితంలో కొంత కాలం నా రిలీవర్ కనుక, నేను ఉంటున్న ఏరియా సమీపంలోనే అతను ఉంటున్నాడు కనుక, నేను వెళ్లాను. అతని మరణవార్తను, ఇంటి లొకేషన్ను మరో మాజీ కోలీగ్ చెప్పాడు.
నాకు సమాచారం ఇచ్చిన ఆ మాజీ కోలీగ్ , ఈ మరణించిన కోలీగ్ ను ఇటీవల వచ్చి పరామర్శ చేసాడట, ఏదో జబ్బుతో బాధపడుతూ ఉన్నాడని తెలిస్తే, ఏదో పనిమీద హైదరాబాదు వచ్చి చూసాడట. ఇక ఎక్కువ కాలం బ్రతకడని అప్పుడే అనుకున్నాడట. చాలా దూరం కనుక ఇక అంత్యక్రియలకు రాలేను అని, మీకు సమీపంలో ఉంటున్నాడని చెప్పాడు.
Ads
అప్పుడు వాళ్ళిద్దరూ బాగా సన్నిహితంగా ఉండేవారు. నేను వెళ్లడానికి కూడా, తటపటాయించాను. ప్రయాణ సమస్యలు. నా ఉద్యోగ జీవితంలో వేలాది మంది కార్మికులతో కలిసి పనిచేసాను. ప్రస్తుతం వారిలో చాలా మంది సర్వీసులో లేరు. కొందరు ఉన్నా , వారి గురించి ఏమీ తెలియదు.
రిటైర్ అయిన కోలీగ్స్ నుండి కేవలం అయిదుగురు మాత్రమే ప్రస్తుతం నాకు పరిచయంలో ఉన్నారు. వారే మధ్య మధ్య మా మాజీ కోలీగ్స్ కొందరి గురించి విశేషాలు చెప్తుంటారు. ఎవరెవరు ఎక్కడ స్థిరపడ్డారు, ఎవరెవరు చనిపోయారు , ఎవరెవరు ఏ ఏ జబ్బులతో చనిపోయారు వగైరా చెప్తుంటారు.
ఓ అయిదారుగురు మినహా, నా ఉద్యోగ జీవితపు కోలీగ్స్ ఎవరూ ఇప్పుడు నాకు తెలియదు. ఉద్యోగ సంబంధాలు, ఉద్యోగంతోనే పొయ్యాయి. నేను వెళ్లింది హైదరాబాదు శివారు ప్రాంత, ఓ గేటెడ్ అపార్ట్మెంట్ సముదాయంలోకి. నేను దిగిన బస్టాప్ కు కిలో మీటరు దూరంలో ఉంటుంది. అప్పటికి ఉదయం పదకొండు గంటలు అవుతున్నది, రాత్రి వర్షం కురిసింది, ఆ ఉదయం ఒకవైపు ఎండ చర్రుమనిపిస్తున్నది, మరో వైపు వాతావరణం ఉబ్బరిస్తున్నది.
చనిపోయిన కోలీగ్ యొక్క కొడుకు కూతురు, వాళ్ల కుటుంబాలు అమెరికా నుండి అప్పుడే వచ్చాయట.
‘అంత్యక్రియల ప్యాకేజీ పనివారు’ తమ పనులను ప్రారంభించారు.
అపార్ట్మెంట్ నుంచి శవాన్ని కిందికి తెచ్చారు, మనుషుల్లో గంభీరం నెలకొన్నది.
ఉద్యోగం విరమణ తరువాత, మళ్లీ ఈ మనిషిని చూడటం ఇదే. సన్నబడ్డాడు. ఒకప్పుడు స్థూలకాయం ఉండేది.
నా నుండి చార్జ్ తీసుకునే సమయంలో, మర్యాదగా వ్యవహారించేవాడు. ఏమీ పేచీలు పెట్టేవాడు కాదు.పెద్దమనిషి తరహా.
మరణించిన కోలీగ్ యొక్క ఏడుస్తున్న భార్యను , ఆమె కూతురు కూడా ఏడుస్తూ, కిందికి తీసుకుని వచ్చింది. తల్లి పోలికలు కూతురువి. తండ్రి పోలికలు కొడుకువి.
మరణించిన కోలీగ్ యొక్క కోడలు అంత్యక్రియల వ్యవహారం చూస్తున్నది. ఇద్దరు ఆడపిల్లలు- వారి వయసు అయిదు సంవత్సరాల వరకు ఉంటుంది- వారు మాత్రం అల్లరి చేస్తూ, ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. మరే మాటలు లేవు.
అందరూ అక్కడ జరుగుతున్న తంతును చూస్తూ ఎవరి ఆలోచనల్లో వారున్నారు. కొందరు తక్కువ స్వరంతో ఏవో మాట్లాడుకుంటున్నారు.
నా పక్కకు నిలబడిన, నా మాజీ కోలీగ్ చెప్తున్నాడు…
‘ ’అదిగో అటువైపు నిలబడిన వారు, ఆయన అత్తవారి తరపు వారు. ఇద్దరు బావమరుదులు, వారి కుటుంబాలు, ఆయన కొడుకు కూతుళ్ళ అత్తవారి కుటుంబాలు. ఇదుగో ఇటువైపు నిలబడిన వారు బహుశా అపార్ట్మెంట్ల వారు అయుండాలి.
బాధాకరమైన విషయం ఏమిటంటే? ఆయన తల్లిదండ్రుల తరఫు రిలేషన్స్ నుండి వచ్చిన వారు ఎవరూ లేరు. అన్నా తమ్ముడు కానీ, వారి పిల్లలు కానీ ఎవరూ రాలేదు.
ఆయన ఇంటికి ఎప్పుడూ అత్తవారింటి వారే వచ్చేవారు. ఆయన అన్నా తమ్ముడు , వాళ్ల కుటుంబాలు రాగా నేను చూడలేదు. ఇతని కొడుకు కూతురు పెళ్లిళ్లకు కనపడ్డారు తప్పితే, వచ్చి ఇతని ఇంట్లో ఓ రోజు రెండు రోజులు ఉన్నది లేదు. మనోని తల్లిదండ్రులు కూడా వాళ్ల విలేజ్ లోనే చనిపోయారు. భార్య తరఫున సంబంధాలే కానీ, తన తరఫున సంబంధాలు లేవు.
e
పెట్టుకుంటేనే కద , ఏ సంబంధమైనా? నేను చెప్పేవాన్ని. కానీ అతని భార్య సాగనిచ్చేది కాదు. చివరికి ఏం తీసుకుపోతాం రెడ్డీ సాబ్?
మనోడు రిటైర్ అయిన తరువాత, హన్మకొండలో ఇల్లు కొనుగోలు చేసి, మూడు సంవత్సరాల పాటు ఉన్నాడు.
ఈ అపార్ట్మెంట్ ను రెండు సంవత్సరాల క్రితం కొడుకు కొని, అక్కడ ఇల్లు రెంటుకు ఇచ్చి, ఇక్కడ ఉండమని చెప్పాడట. రిటైర్ అయిన తరువాత అయిదు సంవత్సరాలు బ్రతికినట్టు లెక్క. అసలు జబ్బు ఏమిటో తెలియదు కానీ, గుండె పోటు వల్ల మూడు రోజుల క్రితం చనిపోయాడు. కొడుకు కూతురు కుటుంబాలు వచ్చేదాకా ఉంచారు ’’ అని చెప్పాడు.
తరువాత హెచ్చిన డప్పు చప్పుడులో , అతని మాటలు వినపడలేదు. అతని కంఠస్వరంలో విమర్శ ఉంది.
నేను వెళ్లిన అరగంటలోనే పాడె లేపారు. అపార్ట్మెంట్ సముదాయం నుండి బయటకు తెచ్చి పూల దండలతో అలంకరించిన ఫోర్ వీలర్ ‘రథం’ లోపల పెట్టారు, కొందరు అందులో ఎక్కి కూర్చున్నారు. వాళ్ల బంధువులు పెద్దపెద్ద కార్లలో వెనుక బయలుదేరారు.
‘ రెడ్డీ సాబ్! శ్మశానం దూరంలో ఉంది. మనం వెళ్లడం కష్టం’ అన్నాడు. నేను అతనితో కలిసి సమీప బస్టాప్ వరకు నడిచాను. ఆయన వెళ్లే బస్సు వస్తే, అతనికి చేయి కలిపి వీడ్కోలు పలికాను. తరువాత వచ్చిన బస్సు నేను ఎక్కాను.
ఓ పాతిక సంవత్సరాల క్రితం, ఒక సీనియర్ కథారచయిత ఒకరు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
‘ ట్రైబల్ వాడు వేటకు వెళ్తే బామ్మర్దిని తోడుగా తీసుకుని వెళ్తాడట కానీ , అన్ననో తమ్మున్నో తీసుకుని వెళ్లడట’
ఎందుకంటే? సోదరులను నమ్మడట!’
పాత గ్రామీణ సమాజంలో కూడా ఒక మాట ఉంది.
‘ బామ్మర్దులు బ్రతుకు కోరితే, అన్నదమ్ములు చావు కోరుతారు’ అని. ఇవన్నీ ఆస్తిపాస్తులతో ముడిపడి ఉన్న సంబంధాలు.
సోదరుడు చనిపోతే, ఆస్తిని ఆశిస్తారు. అలా అందరూ కాకపోవచ్చు.
మరొకప్పుడు మరో రచయిత కామెడీగా ఇలా అన్నాడు.
‘ ఎవరింట్లో అయితే భార్య తరఫు మనుషులు ఎక్కువ కనపడితారో, ఆ ఇంట్లో భార్య పెత్తనం నడుస్తుందని, భర్త తరఫు మనుషులు ఎక్కువ కనపడితే, ఆ ఇంట్లో భర్త పెత్తనం నడుస్తుందని అర్థం అట!
పెళ్లి తరువాత భార్య వైపు సంబంధాలు బలపడి, తోబుట్టువుల సంబంధాలు బలహీన పడతాయి!
మనవన్నీ ఆస్తిపాస్తుల పీఠముడుల సంబంధాలు. ‘పాలివారు- పగవారు’ అనే మాట కూడా ఉంది.
ఆస్తిపాస్తుల సంబంధాల్లో, అపనమ్మకం ఉంటుంది!…….. తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Share this Article