.
Subramanyam Dogiparthi ....
ఫక్తు రాఘవేంద్రరావు సినిమా ఈ పట్టాభిషేకం సినిమా . 1985 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమాకు కధ , సంభాషణలను పరుచూరి బ్రదర్స్ సమకూర్చారు . 16 సినిమాలలో కలిసి వెండితెరను ఊపేసిన బాలకృష్ణ , విజయశాంతి జోడీ ఈ సినిమాలో కూడా జోడి.
- అగ్గిపెట్టె , సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నట్లు రాఘవేంద్రరావు గారికి పళ్ళు , పూలు , బిందెలు , వగైరాలతో పాటు టెన్నిస్ బాల్స్ కూడా పనికొస్తాయి పాటల్లో వరదై పారటానికి . ఈ సినిమాలో టెన్నిస్ బాల్స్ పారతాయి . బాలకృష్ణ కోసమే నేయబడిన కధ .
బాలకృష్ణ , శరత్ బాబు రామలక్ష్మణులు అయితే నూతన్ ప్రసాద్ ఆ ఇంట్లో హనుమంతుడు . శారద సీతమ్మ . బాలకృష్ణ గొప్ప టెన్నిస్ ప్లేయర్ . టెన్నిస్ అంటే ఆసక్తి కల హీరోయిన్ విజయశాంతి ప్రేమలో పడిపోతుంది . కోటీశ్వరుడు అయిన హీరోయిన్ తండ్రి రావు గోపాలరావు , అన్న రాజ్ వర్మ వాళ్ళ ప్రేమకు అడ్డం పడతారు .
Ads
బ్రేకులు వేస్తుంటారు . వాళ్ళకు తోడుగా విలన్లు కన్నడ ప్రభాకర్ , రాజేంద్రప్రసాద్ నిలుస్తుంటారు . వీళ్ళందరికీ దేహశుద్ధి చేసి బుధ్ధి చెప్పి ప్రేమించిన హీరోయిన్ని హీరో గారు పెళ్లి చేసుకోవడంతో సినిమా సుఖాంతం అవుతుంది . కధ రొటీనుదే అయినా పరుచూరి బ్రదర్స్ బిర్రుగా నడిపించారు . పదునైన డైలాగులను సమకూర్చారు .
రాఘవేంద్రరావు మార్క్ పాటల చిత్రీకరణ సినిమాను కాస్త ఆకర్షణీయంగా చేసింది . సినిమాలో ఆరు పాటలుంటే ఆరూ బాలకృష్ణ , విజయశాంతిల మీదే . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు హుషారుగా ఉంటాయి . ముఖ్యంగా చెప్పుకోవలసింది రుక్మిణీ కళ్యాణం . కృష్ణుడిగా బాలకృష్ణ , రుక్మిణిగా విజయశాంతిల నృత్యం అందంగా ఉంటుంది .
మిగిలిన పాటలన్నీ గరం మసాలా పాటలే . ఒక పాటయితే డిస్కో కింగ్ పాటకు కాపీగా అనిపిస్తుంది, అన్నీ ఆయన పాత ట్యూన్లే అనే విమర్శ ఉంది… ఇక్కడే ఇలాగే ఉండిపోతే , ఓ ప్రియతమా నీవు లేని రాతిరి నిలిచిపోను ఊపిరి , సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమ కళ్యాణ ఘడియ వచ్చె డ్యూయెట్లన్నీ బాగుంటాయి .
గుడ్ షాట్ లవ్లీ అంటూ సాగే పాట హీరోహీరోయిన్లు టెన్నిస్ , టేబుల్ టెన్నిస్ ఆడుతూ పాడతారు . బాలసుబ్రమణ్యం , జానకమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు . (ఒకటీరెండు పాటల్లో రొమాంటిక్ మూలుగులు, నిట్టూర్పులు కూడా…)
క్లైమాక్సులో హేంగ్ గ్లైడర్ మీద వెళ్లి హీరోయిన్ని హీరో గారు వీరోచితంగా కాపాడటం బాలకృష్ణ అభిమానులకు ఆరోజుల్లో బాగా నచ్చిన సీన్ . బాలయ్య సినిమా అంటే ఆమాత్రం ఉండాలి మరి . స్వంత బేనరయిన రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణంలో హరికృష్ణ నిర్మాతగా వచ్చింది ఈ సినిమా .
యూట్యూబులో సినిమా వీడియో లేదు . కొన్ని సీన్లు , పాటలూ ఉన్నాయి . బాలకృష్ణ , విజయశాంతి అభిమానులు వాటితో సర్దుకోవచ్చు . రుక్మిణీ కళ్యాణం పాట మిస్ కాకండి . బాలకృష్ణ యన్టీఆర్ లాగా ఉంటాడు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
(ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… రాఘవేంద్రరావు, బాలకృష్ణ కాంబో పెద్ద సక్సెస్‌ఫుల్ కాదు, తండ్రికి అన్ని భారీ హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు కొడుక్కి పెద్ద హిట్ ఇవ్వలేకపోయాడు, గతంతో రాఘవేంద్రరావు ఇది అంగీకరించి బాధపడ్డట్టు గుర్తు… ఒక హిట్ కావాల్సిందేననే పట్టుదలతో అన్ని కమర్షియల్ హంగులూ దట్టించి తీసిన ఈ పట్టాభిషేకం సినిమాకు కూడా ఎక్కడో తేడా కొట్టింది…)
Share this Article