కరోనా ప్రబలినాక…. మనుషులు వేల మంది దిక్కులేని చావులు చస్తున్నారు… భాష కఠినంగా ఉంది కదా… కొన్ని హాస్పిటళ్లలో శవాలు కూడా చికిత్స పొందుతూ చస్తున్నాయి, మార్చురీలో పడి విముక్తి కోసం దిక్కులు చూస్తున్నాయి… టెస్టు కష్టం, ట్రీట్మెంట్ కష్టం… సిస్టం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయినట్టుగా ఉంది… చివరకు శ్మశానాల్లో కూడా అంత్యక్రియల కోసం నిరీక్షణ… మరి భారీగా కాలబెట్టే కెపాసిటీ లేదాయె… ఫస్ట్ వేవ్‌లో ఇటలీలో ఈ ఫోటోలు, వార్తలు చూస్తూ, చదువుతూ అయ్యో అనుకున్నాం… ఈ సెకండ్ వేవ్ మనల్నే కొట్టింది… ఇంకాస్త గట్టిగా… ఆ ఫోటోలు, ఆ వార్తలు ఇప్పుడు మన చుట్టే… ఫేస్బుక్ శ్రద్ధాంజలుల వేదిక అయిపోయింది… వాట్సప్ నిండా ఆ విషాదాలే… అసలు మనిషిని ఎలాగూ బతకనివ్వడం లేదు, పల్స్ ఆపేస్తున్నారు, పర్స్ దోచేస్తున్నారు… కనీసం మరణించాకైనా గౌరవంగా పంపించేస్తున్నామా..? లేదు… అదేకదా సమస్య…
బంధుమిత్రులు రారు.., శ్మశానంలో టైం దొరికినా హడావుడి… ప్యాకేజీ… ఏదో అనాథ శవాన్ని కాల్చినట్టే దాదాపుగా… రోదనలు, చివరిచూపులు, దింపుడు కళ్లం ప్రక్రియలూ ఏమీ ఉండవ్… దించితే చాలు, కాలిపోవడమే… అవునూ, ఇళ్ల వద్దకు వైద్యం వస్తోంది… ఆక్సిజన్ వస్తోంది… ఐసోలేట్ అయిపోతే సరిపడా ఆహారం వస్తోంది… మెడికల్ కిట్లు వస్తున్నయ్… కాలం మారుతోంది… అన్నీ ఇంటివద్దకే వస్తున్నయ్… శ్మశానం..? ఎస్… శ్మశానానికి శవం పోనక్కర్లేదు… శవం దగ్గరికి శ్మశానమే వస్తుంది… పద్ధతిగా అంత్యక్రియల్ని పూర్తిచేసి, డబ్బులు లెక్కపెట్టుకుని, ప్రొఫెషనల్‌గా మరోచోటకు వెళ్లిపోతుంది… ఆశ్చర్యపోకండి… ఆ రోజులూ వస్తున్నయ్…
Ads
కేరళలో ఇంటి వద్దే అంత్యక్రియలు పేరిట ఉన్న ఈ ఫేస్ బుక్ వీడియో లింక్ చూశారుగా… కేరళలో ఇళ్ల వద్దే అంత్యక్రియలు పేరిట పోస్ట్ చేయబడిన ఈ వీడియోను ఒకటిన్నర రోజుల్లో దాదాపు 13 లక్షల మంది చూశారు… వైరల్ అయిపోయింది… ఎందుకు..? అది కలుక్కుమనిపించేలా ఉంది కాబట్టి… ఈరోజులు కూడా వచ్చాయా అనే విభ్రాంతిని కలిగిస్తున్నది కాబట్టి… ఇప్పుడు అన్నీ ‘ఫ్రం హోం’ లేదా ‘ఎట్ హోమ్’ లేదా ‘హోమ్ డెలివరీ’… అసలు హోమ్ లేనివాళ్ల గతేమిటి అనడక్కండి… అది మరో విషాదపర్వం… ఈ వీడియోలో రోదిస్తూ కుటుంబసభ్యులు, పీపీఈ కిట్‌తో జీవనసహచరి… ఓ బల్ల… దానిపై పద్దతిగా ప్యాక్ చేసిన శవం… రెండు సిలిండర్లు… మధ్యలో శవదహనం ఆగొద్దు కదా… ఊపిరి నిలిపే ఆక్సిజన్ లేకపోయినా, ఊపిరి తీశాక కాల్చేసే గ్యాస్‌కు కొరతేమీ లేదుగా… కొడుకు కావచ్చు, శవం చుట్టూ తిరిగి, కాష్టానికి (??) నిప్పంటించాడు… ఓ టెంపరరీ ఛాంబర్ తయారైంది… మనిషి పైలోకాలకు వెళ్లిపోయాడు… ఈ ‘హోం కాష్టం’ చెప్పేదేమిటయ్యా అంటే…. చితి, దహనం, కాష్టం, శ్మశానం అనేవి తమ రూపస్వభావాల్ని మార్చుకుంటున్నయ్…!! అవునూ, ఇవన్నీ దహనాల గురించి… మరి సంప్రదాయికంగా ఖననాల్నే పాటించేవాళ్ల మాటేమిటి..? అది ఈ విషాదపర్వంలోని మరో అధ్యాయం…!!!
Share this Article