.
బొబ్బిలిపులి సినిమాలో దాసరి సంధించిన డైలాగ్స్ గుర్తున్నాయా..? కోర్టు బోనులో నిలబడి ఎన్టీయార్ ఆవేశంగా అడుగుతాడు… “కోర్టు కోర్టుకు, తీర్పు తీర్పుకు తేడా ఉంటే, మీ న్యాయస్థానాల్లో తీర్పు ఉన్నట్లా, లేనట్లా?”
ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే… బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు… పంథొమ్మిది సంవత్సరాల క్రితం.., భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై, భారతదేశంపై జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటైన వరుస బాంబు పేలుళ్లతో అతలాకుతలమైంది…
Ads
11 నిమిషాల్లోనే.., ఏడు ప్రెషర్ కుక్కర్ బాంబులు ముంబై లోకల్ రైళ్లలోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లను రద్దీ సమయాల్లో ఛిద్రం చేసి, 209 మంది అమాయక పౌరులను చంపాయి… 800 మంది గాయపడ్డారు.., వారిలో చాలామంది శాశ్వతంగా వికలాంగులయ్యారు, జీవితాంతం వీల్‌చైర్‌లలో గడిపారు…
ఈ దాడిని భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన స్లీపర్ సెల్స్ నిర్వహించాయి… ఈ పేలుడుకు 12 మందిని దోషులుగా నిర్ధారించారు – వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించగా, ఏడుగురికి 2015లో ప్రత్యేక MCOCA కోర్టు జీవిత ఖైదు విధించింది…
18 సంవత్సరాల విచారణ తర్వాత.., ముంబై హైకోర్టు 12 మంది టెర్రర్ దోషులను నిర్దోషులుగా విడుదల చేసింది.., అత్యంత కలవరపెట్టే విషయం ఏమిటంటే, ఈ వ్యక్తులకు ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఎస్. మురళీధర్ కోర్టులో ప్రాతినిధ్యం వహించారు…
అమాయకులను జైళ్లలో వేస్తారు, కొందరు అక్కడే మరణిస్తారు, వాళ్ల కుటుంబాలు కూడా ఈ నిందను మోస్తూ శిక్షను అనుభవిస్తాయి… ఈ అన్యాయం మాటేమిటి అంటాడు ఆయన… అవునూ, వాళ్లంతా నిర్దోషులే… సరే, అసలు సంఘటన నిజమే కదా, ఎవరో కొందరు కుట్ర చేశారు కదా… మరణాలు నిజమే కదా…
మరి దోషులు ఎవరు..? ప్రాసిక్యూషన్ నేరనిరూపణలో విఫలమైందనే అనుకుందాం… మరి దోషులెవరో తేలాలి కదా యువరానర్..? ఆ దిశలో మీ ఆదేశం ఏది..?
ఈ కేసులో జమియత్ ఉలేమా-ఎ-హింద్ న్యాయ సహాయం అందించింది, నిందితుల తరపున వాదించడానికి డాక్టర్ మురళీధర్‌తో సహా న్యాయవాదుల బృందాన్ని నియమించింది… సదరు మురళీధర్‌ను సుప్రీంకోర్టుకు పదోన్నతి కోసం కొలీజియం రెండుసార్లు నామినేట్ చేసిందని సోషల్ మీడియాలో సమాచారం కనిపిస్తోంది… కానీ ప్రభుత్వం ససేమిరా అంటూ వెనక్కి తగ్గింది, ఆ సిఫారసులకు అంగీకరించలేదట…
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని భావిస్తోంది, రేపు సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది… ఇది వోకే… కానీ ఇలాంటి తీవ్రమైన నేరాల దర్యాప్తును ఎన్ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలే చేపడితే మేలేమో.,. లేదా కేంద్రమే ఈ కేసుల ప్రాసిక్యూషన్‌కు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలేమో… ఇలాంటివి రాష్ట్రాలతో అయ్యేపనులు కావు అనిపిస్తోంది…
జమియత్ ఉలేమా-ఎ-హింద్ సంస్థ ఉగ్రవాద నిందితులకు సాయంగా, అనేక కేసుల్లో న్యాయసహాయం అందిస్తోందని సోషల్ మీడియా ఓ సమాచారాన్ని షేర్ చేస్తోంది…
▪︎ 2019 కమలేష్ తివారీ హత్య.
▪︎ 26/11 ముంబై ఉగ్రవాద దాడులు.
▪︎ 2002 అక్షరధామ్ ఆలయంపై దాడి.
▪︎ 2010 జర్మన్ బేకరీ బాంబు పేలుడు.
▪︎ 2010 చిన్నస్వామి స్టేడియం బాంబు పేలుడు.
▪︎ 2011 జవేరీ బజార్ వరుస పేలుళ్లు.
▪︎ ఇండియన్ ముజాహిదీన్ కుట్ర కేసులు.
▪︎ సిమి కుట్ర కేసు (మధ్యప్రదేశ్).
▪︎ ఘట్కోపర్ పేలుళ్లు.
▪︎ ఉత్తరప్రదేశ్‌లో అల్-ఖైదా మాడ్యూల్.
▪︎ ఐసిస్ కుట్ర కేసులు.
▪︎ లష్కర్ కనెక్షన్ కేసు.
ఇప్పుడు కలవరపరుస్తున్న ఓ ప్రశ్న… నిజంగా ఈ దేశం ఉగ్రవాదంపై సీరియస్ పోరాటం చేస్తోందా..?
Share this Article