.
ఒక మంచి ప్రయత్నం… ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా దుమ్మురేపుతున్న హొంబలె ఫిలిమ్స్ దశావతారాల్ని ఓ సీరీస్‌లాగా… ఆధునిక టెక్నాలజీతో యానిమేటెడ్ సినిమాలుగా తీసుకురావాలనేది సత్సంకల్పం…
అందులో మొదటిది ఇప్పుడు విడుదలైన మహావతార్ నరసింహ… టూడీ, త్రీడీలలో… పాన్ ఇండియా రిలీజ్ చేశారు… ఐదు ముఖ్యమైన భాషల్లో..! విష్ణు పురాణం, నరసింహ పురాణం, శ్రీమద్ భాగవత పురాణం అనే మూడు పురాణాల్ని క్రోడీకరించి రాసుకున్న కథ…
Ads
అందరికీ తెలిసిన కథే… కానీ కొత్తగా ఏం చెప్పగలరు..? కొత్తగా చూపగలరు గానీ… అదుగో ఆ ప్రయత్నమే ఇది… బాగుంది… పేరున్న స్టార్లను తీసుకుంటే వాళ్ల ఇమేజీ సినిమా కథపై, సీన్లపై పడుతుంది, కథలో మార్పులుంటాయి, కమర్షియల్ వాసనలు కమ్ముకుంటాయి…
అసలే భక్తి కథల్ని కూడా క్రియేటివ్ ఫ్రీడం పేరిట అనేక ఉపకథల్ని చేర్చి, మసాలాలూ చేర్చి, పొల్యూట్ చేసి, పిచ్చి పిచ్చి క్రియేషన్లతో పిచ్చిలేపే ఇండస్ట్రీ మనది… ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ… చాలా ఉదాహరణలున్నాయి.,. అయితే ఇవి యానిమేటెడ్ సినిమాలు కాబట్టి… హాయిగా, ఎవడి ఇమేజీ బారిన పడకుండా… కేవలం కథ, కథనానికి తగిన సీన్లతో చూడొచ్చు…
ఈ తరం పిల్లలకు పురాణాలు పరిచయం చేయాలనుకుంటే ఫ్యామిలీతో కలిపి వెళ్లాలి… అబ్బే, యూట్యూబులో, నెట్‌లో నరసింహ స్వామి కథ తెలియదా అంటే… తెలుస్తుంది, మ్యాటర్ ఆఫ్ వన్ క్లిక్… కానీ కథ చెప్పే విధానాన్ని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ, పురాణకథల్ని తెలుసుకోవాలి… తెలియనివ్వాలి…
సరే, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కథేమిటో అందరికీ తెలుసు, మళ్లీ దాని గురించి ఇక్కడ వివరణ అవసరం లేదు… కథ తెలియనితరంతోపాటు కథ తెలిసినతరం కూడా భక్తిభావనను ఫీలయ్యేలా సినిమాను తీయడంలో చాలావరకూ దర్శకుడు సక్సెస్… చివరి అరగంట బలమైన బీజీఎం, హై సీన్లతో హోరెత్తించారు…
థియేటర్లలో పలుచోట్ల చప్పట్లు వినిపిస్తున్నాయంటే… సినిమా బాగా రక్తికట్టిందని అర్థం… జరుగుతున్నది అదే… ఈ సినిమాకు ఆకర్షణే విజువల్స్, గ్రాండియర్… గ్రాఫిక్స్ కథకు తగినట్టు ఎలా ఉండాలో చెబుతుంది ఈ సినిమా… (ఆదిపురుష్, హరిహరవీరమల్లు బాపతు నాసిరకం గ్రాఫిక్స్ చూసిన ప్రేక్షకులు నరసింహ గ్రాఫిక్స్ ఖచ్చితంగా అలరిస్తాయి… మరీ అవతార్ బాపతు నాణ్యత లేకపోయినా సరే…)
నరసింహ స్వామి మీద సినిమాలు రాలేదా..? బోలెడు వచ్చాయి… కానీ ఇది వేరు… అవి నటులు నటించిన సినిమాలు… నటులు కనిపిస్తారు, ఇందులో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి… అదీ తేడా… మిగతా అవతారాలకన్నా నరసింహావతారం కథలో ఎమోషన్ ఉంది… సొంత కొడుకు తిరుగుబాటు వంటివి పిల్లలను కూడా ఆకట్టుకుంటాయి…
ఓ పిల్లవాడి అచంచలమైన దృఢత్వం, ఎంత హింసకు గురైనా కోల్పోని ఆశావాదం, దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపోవడం… ప్రహ్లాదుడి పాత్రను చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు… దైవభక్తి కలిగినవాళ్లకు సినిమా చివరి అరగంట గూస్‌బంప్స్…
పది భాగాల సీరీస్‌లో మొదటి సినిమా ఇది… చిన్నచిన్నలోపాలు ఉన్నా అవన్నీ క్లైమాక్స్ హోరులో కొట్టుకుపోయాయి… పిల్లలతో వెళ్లి త్రీడీలో చూడండి… ఇది థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ సినిమాయే..! టీవీలో, ట్యాబ్‌లో, ఫోన్‌లో చూస్తే ఆ ఫీల్ రాదు..!!
Share this Article