.
క్రికెట్ వేగంగా మారిపోతూ ఉండవచ్చు… వన్డేలు, టీ20 లతో స్పీడ్ పెరిగి ఉండవచ్చు… రేప్పొద్దున టీ10 వచ్చినా పర్లేదు… ఎన్ని ఫార్మాట్లు మారినా సరే, 5 రోజుల టెస్టు క్రికెట్‌ను ప్రేమించే అభిమానులు ఎప్పుడూ ఉంటారు… అసలు అదే నిజమైన క్రికెట్ అంటారు వాళ్లు…
అలాంటి అభిమానులు, అందులోనూ ఇండియా అభిమానుల కడుపు నిండింది ఈరోజు… టెస్టు గెలవలేదు సరే, కానీ ఓడిపోలేదు… అదీ కారణం… రియల్ ఫైట్ చేసి డ్రా చేశారు… ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచును లాగేసుకుని డ్రా చేసింది ఇండియా జట్టు…
నాలుగు మ్యాచుల్లో ఇండియా ఇప్పటివరకూ ప్రదర్శించిన ఆటతీరు పట్ల సగటు ఇండియన్ అభిమాని హేపీ… గెలుపో ఓటమో జానేదేవ్… నిలబడ్డామా, ఫైట్ ఇచ్చామా… ఇదే ప్రధానం… అవును, డ్రా చేసినందుకే ఎందుకీ ఆనందం అంటారా..?
Ads
చివరి రోజు… ఆల్రెడీ 2 వికెట్లు డౌన్… జస్ట్ మరో రెండు వికెట్లే కోల్పోయి, చివరిదాకా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ (వీళ్లు రెగ్యులర్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు కాదు) నిలబడి, చెరో సెంచరీ చేసుకుని ఇంగ్లండ్ ఆశల మీద నీళ్లు జల్లారు… గుడ్… మంచి ఫైట్…
బెన్ స్టోక్స్… కోతి బుద్ధి
మూడో సెషన్‌కు వచ్చే సరికి భారత జట్టు ఫుల్ డామినేషన్‌లో ఉంది… అదే సమయంలో స్టోక్స్ తన కోతి బుద్దిని చూపించాడు… జడేజా 91 మీద, సుందర్ 90కి దగ్గరగా ఉన్న సమయంలో మ్యాచ్ డ్రా చేసుకుందామని ఆఫర్ ఇచ్చాడు… పదే పదే భారత బ్యాటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ, డ్రా ఆఫర్ ఇస్తూ వచ్చాడు…
ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీలు చెయ్యొద్దనే దురుద్దేశం… ఆట అయిపోయాక కూడా స్టోక్స్ జడేజాకు, సుందర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించి మరోసారి తన కుళ్లు బుద్ధి ప్రదర్శించాడు…
నిజానికి ఐపీఎల్ ఫాలో అయ్యేవాళ్లకు ఇప్పటి మన టెస్టు ప్లేయర్లు తెలిసినవాళ్లే… కానీ రెండుమూడేళ్లుగా పెద్దగా వన్డేలు, టెస్టులు ఫాలో గాని వాళ్లకు… మరీ ఇంకా కోహ్లీ, రోహిత్ శర్మల కాలంలోనే ఉన్నవాళ్లకు ఇప్పటి ప్లేయర్లు కొత్త కొత్త… బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ముగ్గురు నలుగురు తప్ప అందరూ కొత్త కొత్తే…
శుభమన్ గిల్… కొత్త కొత్త రికార్డులను తన పేరిట రాసుకుంటున్న మన కెప్టెన్… తనకు దక్కిన అవకాశాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకుంటున్నాడు… ఆల్రెడీ ఇప్పటికే నాలుగు సెంచరీలు… గుడ్… నిన్నటి మ్యాచులో తనను ఔట్ చేయడానికి ఇంగ్లండ్ కెప్టెన్ ఎన్నో ఎత్తులు వేశాడు, చివరకు బాడీలైన్ బౌలింగ్‌కూ దిగారు పలుసార్లు…
రిషబ్ పంత్… మొన్నటి ఐపీఎల్‌లో ఫ్లాప్… అత్యధిక ఖరీదైన ఆటగాడు అయి ఉండీ… కానీ ఈ టెస్టు సీరీస్‌లో బాగానే ఆడుతున్నాడు… టెంపర్‌మెంట్ ఉంది…
బుమ్రా సరేసరి.,. పాపులర్ అండ్ ఎఫిసియెంట్ బౌలర్… కన్సిస్టెన్సీ ఉంది… రవీంద్ర జడేజా గురించి తెలిసిందే… ఆల్ రౌండర్… మూడో మ్యాచులో టెరిఫిక్ ఫైట్ చేశాడు, నాలుగో మ్యాచులో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి డ్రా చేశాడు… యశస్వి జైశ్వాల్, ఐపీఎల్‌లో మంచి కన్సిస్టెన్సీతో పరుగులు చేశాడు… కానీ ఈ సీరీస్‌లో మూడు, నాలుగో మ్యాచుల్లో తొందరపడ్డాడు… నిలకడగా, కుదురుగా ఆడితే జట్టుకు అసెట్…
కేఎల్ రాహుల్ మరో సమర్థుడైన బ్యాటర్… మొన్నటి ఐపీఎల్‌లోనూ మంచి ఆట కనబరిచాడు… కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు… ధ్రువ్ జరేల్ గాయపడిన పంత్ స్థానంలో వికెట్ కీపర్ ఇప్పుడు… ఆకాశదీప్, ప్రసిద్ధ కృష్ణ, అన్షుల్ కాంభోజ్… వీరిలో ఎవరు నిలదొక్కుకుంటారో చూడాలి… నితిశ్ కుమార్, ఆర్షదీప్, శార్దూల్ ఠాకూర్ కూడా అంతే… సిరాజ్ పాత కేరక్టరే… సాయి సుదర్శన్‌కూ మంచి చాన్సే…
చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే..? వీళ్లంతా మొన్న మొన్న ఐపీఎల్‌లో ధనాధన్ ఆట ఆడినవాళ్లే కదా… అది దంచుడు ఆట… కానీ వీళ్లలో చాలామంది వెంటనే టెస్టు ఆటతీరుకు మోల్డ్ అయిపోయారు… అయిదో మ్యాచును గెలవండర్రా… కాలర్లు ఎత్తుకుని తిరిగి రండి… ఇంగ్లండ్‌కు సీరీస్ అప్పగించకపోతే… అది మన గెలుపే..!!
Share this Article