.
సాగరసంగమం సినిమా క్లైమాక్సులో కమలహాసన్ బతికే ఉంటే..? మరోచరిత్రలో కమలహాసన్, సరిత మరణించకుండా, పెళ్లి చేసుకుని శుభం కార్డు పడితే…? శంకరాభరణం ముగింపులో మంజుభార్గవి మరణించకుండా ఉంటే..?
ఇలా అనేక ఉదాహరణలు… అనేక సినిమా కథల్లో ముగింపు విషాదాంతంగా ఉండి, ప్రేక్షకులు భారంగా ఫీలవుతారు… కానీ అది కథ… దర్శకుడు, కథారచయిత, లీడ్ యాక్టర్స్, నిర్మాత అందరూ వోకే అనుకున్నాక తెరపైకి వచ్చే కథ… కానీ ఆ ముగింపులను మార్చేస్తే..? సుఖాంతాలు చేస్తే..?
Ads
అదెలా అంటారా..? ఇప్పుడు అదే జరుగుతోంది… రాంఝనా అనే హిందీ సినిమాలో ధనుష్ హీరో… సోనమ్ కపూర్ హీరోయిన్… అందులో కుందన్ పాత్ర చివరలో మరణిస్తుంది… 2013లో ఈరోస్ ఇంటర్నేషనల్స్ ఈ సినిమా తీసింది… దర్శకుడు ఆనంద్ రాయ్…
ఇప్పుడు పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కదా… ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ను AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో మార్చి, కొత్త ముగింపుతో అనధికారికంగా మళ్లీ విడుదల చేశారు… ఈ కొత్త ముగింపులో, అసలు సినిమాలో విషాదాంతంగా ముగిసే ధనుష్ పాత్ర కుందన్ చనిపోకుండా బతికినట్లు చూపించారు…
ఈ మార్పుపై సినిమా దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్, హీరో ధనుష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు… వారిద్దరూ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఈ మార్పు తమ అనుమతి లేకుండా జరిగిందని, ఇది సినిమా యొక్క కళాత్మక విలువలను, ఆత్మను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు…
నేను అంగీకరించిన కథ ఇది కాదు కదా, మరి అలాంటప్పుడు నా అనుమతి లేకుండా ఎలా క్లైమాక్స్ మారుస్తారు అని ధనుష్ ప్రశ్నించాడు… సరే, సహజంగానే నెటిజనం రెండుగా చీలిపోయింది… సినిమా అంటేనే క్రియేటివ్ వర్క్, ఈసారి ఇంకొత్తగా ట్రై చేశారు, తప్పేముంది అనేవాళ్లు… ఒరిజినల్ కథ ఆత్మ చెడగొట్టేసినట్టేనని అనేవాళ్లు…
అవునూ, కళాత్మక విలువలు అంటే ఏమిటి..? ఇదొక ప్రయోగం… అని సమర్థించేవాళ్లూ ఉన్నా… లీడ్ యాక్టర్, దర్శకుడు వేస్తున్న ప్రశ్నలు కూడా విలువైనవే కదా… వాళ్లు అంగీకరించి చేసిన కథ వేరు, మరి వాళ్ల అనుమతి లేకుండా ఎలా మారుస్తారు..? సినిమాను ఎలా పడితే అలా మార్చుకునే హక్కు నిర్మాతకు ఉందా..? మరి మిగతావాళ్ల క్రియేటివ్ వర్క్‌కు ఉన్న విలువేమిటి..?
ఒక సినిమాలో పాటను ఇంకెవరో వాడితే, ఏదో వేదిక మీద పాడితే, ఏవో టీవీ షోలలో పాడిస్తేనే సంగీత దర్శకుడు ఇళయరాజా ఊరుకోవడం లేదు, నా క్రియేటివ్ వర్క్, నా హక్కు అంటున్నాడు, కేసులు వేస్తున్నాడు, కోట్లల్లో రాయల్టీ అడుగుతున్నాడు… పాపం, దర్శకుడికి, కథారచయితకు, స్క్రీన్ ప్లే రచయితకు, లీడ్ యాక్టర్స్‌కు ఈ హక్కులు లేవా..?
ఈ చర్చ ఎలా ఉన్నా… జనం మనస్సుల్లో ఓ సినిమా కథ మీద, ముగింపు మీద ఓ ముద్ర పడి ఉంటుంది… పుష్కరం తరువాత మొత్తం మార్చేసి జనంలోకి వదలడం మంచిదా కాదా అనే డిబేట్ కొన్నాళ్లు సాగుతుంది… కాలం తీర్పు చెబుతుంది…
ఆమధ్య బాలు గొంతును ఎఐ సాయంతో వాడుకున్నారు, అదీ వివాదమే.,. రేప్పొద్దున ఎవరైనా సాంకేతిక నిపుణుడు అమితాబ్, రేఖ రూపాలతో… లేదా ప్రభాస్, అనుష్క రూపాలతో ఎఐ సాయంతో ఏదో ఓ కథను ఓ సినిమా తీసి రిలీజ్ చేస్తే… వోకేనా..? అవి కల్పిత పాత్రలు అని డిస్‌క్లెయిమర్ వేస్తాడు… పోనీ, బాహుబలి ఫస్ట్ పార్టులో కట్టప్పనే ప్రభాస్ చంపేసినట్టు క్లైమాక్స్ మారిస్తే..? అప్పుడెలా..? ముగింపు మారిన ఈ ఎఐ రాంఝనా పెద్ద ప్రశ్ననే లేవనెత్తింది..!!
Share this Article