.
Subramanyam Dogiparthi ……… 1986 లోకి వచ్చేసాం . చిరంజీవి , కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో వచ్చినా సరే ఈ కిరాతకుడు వాళ్ళిద్దరి లెవెల్లో ఆడలేకపోయాడు . చిరంజీవి క్రేజులో ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా తర్వాత తర్వాత ప్రేక్షకుల ఆదరణ పొందలేదు . ఏవరేజ్ సినిమాగా మిగిలిపోయింది .
కధ రొటీనే . దేశ రక్షణకు సంబంధించిన రహస్య పత్రాలను ఇతర దేశస్తులకు అమ్మటం , గంజాయి స్మగ్లింగ్ , దోపిడీలు , వగైరా చేసే నేర చక్రవర్తుల ఆట కట్టించాలని ప్రభుత్వం తిప్పలు పడుతుంటుంది . (ఈ కథతో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కేలేదు)…
Ads
హీరో తండ్రి జగ్గయ్య ఇంటర్పోల్ ఆఫీసర్ . హీరో గారికి తండ్రి గారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది . తల్లి లేని హీరో తండ్రి ప్రేమకు కూడా నోచుకోకపోవటంతో జులాయి అయిపోతాడు . అసహనంతో , కోపంతో అందరినీ కొట్టేస్తుంటాడు . నేర ప్రవృత్తి కలవాడు అవుతాడు .
విలన్లు హీరోకి సిల్క్ స్మిత ద్వారా గాలం వేసి తమ నేరాలను చేయించుకుంటూ ఉంటారు . ఇంతలో క్రిమినాలజీలో రీసెర్చ్ చేసే హీరోయిన్ సుహాసిని పరిచయం కావటం , ఆమె ప్రేమలో పడిపోవటం జరుగుతుంది . పోలీసులకు లొంగిపోయేలా హీరోని ఒప్పిస్తుంది .
ఇంతలో ఇంటర్పోల్ ఆఫీసర్ అయిన తండ్రిని విలన్లు కిడ్నాప్ చేస్తారు . వాళ్ళ ఆనవాళ్లు తెలిసిన హీరోని తండ్రిని రక్షించేందుకు ఒప్పిస్తారు హీరోయిన్ తండ్రి, పోలీసు ఆఫీసర్ కూడా అయిన గుమ్మడి . మిగిలిందంతా మనం ఊహించవచ్చు . విలన్లను తుదముట్టించి తండ్రిని కాపాడుకోవటంతో సినిమా ముగుస్తుంది .
మంచి ప్లాటే . చిరంజీవికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . సుహాసినిది మంచి పాత్ర . రీసెర్చెరుగా , ప్రేయసిగా , ఇండిపిండెంట్ భావాలు కల మహిళగా బాగా నటించింది . మూడో ప్రధాన పాత్ర సిల్క్ స్మితదే . బాగా నటించింది .
- ఈ సినిమాకు ఒక విశేషం ఉంది . ప్రముఖ దర్శకుడు యస్ వి కృష్ణారెడ్డి నపుంసకుడి పాత్రలో నటించాడు . ఇదే ఆయన నటించిన మొదటి సినిమా . కోదండరామిరెడ్డి వెంటపడి ఆ పాత్రను సాధించానని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు . విలన్లుగా కన్నడ ప్రభాకర్ , చలపతిరావు ప్రభృతులు నటించారు . నూతన్ ప్రసాద్ టాక్సీ డ్రైవర్ పాత్ర బాగుంటుంది .
ఇళయరాజా సంగీతం కూడా సినిమాను గట్టెక్కించలేకపోయింది . ఆత్రేయ , వేటూరి , రాజశ్రీలు పాటల్ని వ్రాసారు . నీ మూగ వీణై మోగేనా నీ రాగ మాలై పాడేనా అనే యస్ జానకి పాడే పాట ఒక్కటే ఇళయరాజా సంగీత మాధుర్యాన్ని అందిస్తుంది .
నన్నీ లోకం రమ్మనలేదు నేనీ జన్మను ఇమ్మనలేదు అంటూ సాగే చిరంజీవి , అతని మిత్ర బృందం పాడే పాట హుషారుగా ఉంటుంది . సిల్క్ స్మిత విలన్ల డెన్లో డాన్సించే డాన్స్ , పాట కోదండరామిరెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు . సిల్క్ స్మిత లెవెల్లోనే ఉంటుంది . సంపెంగ ముద్దు , ఒక ముద్దు చాలు పాటల డ్యూయెట్లు చిరంజీవి , సుహాసినిల మీద బాగానే ఉంటాయి .
ఈ సినిమాలో గుమ్మడి , అన్నపూర్ణ భార్యాభర్తలుగా నటించారు . ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పారు . గుమ్మడి
- మరి ఏ ఇతర నటులతోనూ భార్యగా నటించవద్దని ఆమెను విసిగిస్తుండేవారట . ఆయనకు ఆమె మీద ఆ possessiveness ఎందుకు కలిగిందో ఏమో !! ఎవరికయినా పుట్టు రిమ్మ తెగులు .
ఈ సినిమాకు రచయిత సత్యమూర్తి సంభాషణలను వ్రాసారు . ఆయన కలం కూడా ఎందుకనో పదునుగా ఉండదు ఈ సినిమాలో . బహుశా ఆయన , కోదండరామిరెడ్డి కలిసి స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని ఉండాలి . ఆ తయారీలో ఎక్కడో దెబ్బకొట్టిందని చెప్పొచ్చు .
- ఈ సినిమా కథకు యండమూరి నవల ఆధారమని వికీ చెబుతోంది… ఆయన నవలల్లో మరీ ఈ రేంజువి కూడా ఉన్నాయా..? బహుశా చిరంజీవి డేట్స్ దొరకగానే అప్పటికప్పుడు ఈ సినిమాను ఏదో చుట్టేసి ఉంటారు… యండమూరి, కోదండరాం రెడ్డి, చిరంజీవి మంచి క్రేజీ కాంబో కదా అప్పట్లో…
సినిమా యూట్యూబులో ఉంది . సుహాసిని , సిల్క్ స్మిత అభిమానులు చూడతగ్గ సినిమాయే . చిరంజీవి అభిమానులు ఎలాగూ చూస్తారు ఇంతకుముందు చూసి ఉండకపోతే . It’s an action & crime movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article