.
Director Devi Prasad.C...
ఓ మిడిల్‌క్లాస్ ఇంటి సెట్‌లో “క్రాక్” సినిమా షూటింగ్ జరుగుతోంది.
నేను నటించిన C.I తిలక్ పాత్ర మోసకారి అని రివీల్ అయ్యాక హీరో రవితేజ గారు నా మెడ మీద చేయివేసి తోస్తే నేను ఎగిరి ఇంట్లో పడే సన్నివేశం.
కెమేరా ముందునుండి ఫోర్స్‌గా వెళ్ళి పడమన్నారు దర్శకులు గోపీ గారు.
యాక్షన్ చెప్పగానే రెచ్చిపోయి ఎగిరివెళ్ళి పడ్డాను.
షాట్ కట్ చెప్పగానే రవితేజ గారు “అయ్యో… ఏంటి దేవీగారు అంతలా పడ్డారు ఏమీ కాలేదు కదా మీకు అన్నారు కంగారుగా. “అబ్బే ఏమీ కాలేదండీ” అని చెప్పి సెట్ బైటికొచ్చిన అయిదు నిమిషాల తర్వాత మా అసిస్టెంట్ “సార్ ఆ చెయ్యేంటి సార్ అలా అయిపోయింది”అంటూ గావుకేక పెట్టాడు.
అప్పుడు చూస్తే నా ఎడమ అరచేయి నూనెలో వేయించి తీసిన బూరెలా లావుగా ఉబ్బిపోయివుంది.
Ads
ఓ పది నిమిషాలు ఐస్ క్యూబ్స్ పెడితే కొంచెం పరవాలేదనుకున్నాక ఆ సీన్ పూర్తి చేసి అదేరోజు రాత్రి “నాంది” సినిమా షూటింగ్ కి వెళ్ళి ఓపక్క చేయి చురుక్కుమంటూనేవున్నా డైలాగులు చెప్పాను.
“జయమ్మ పంచాయితీ”అనే సినిమా ఓ పల్లెటూరిలో జరుగుతోన్నప్పుడు రైతు పాత్రలోఉన్న నేను పక్కపొలం రైతుతో గొడవపడి కలబడే సన్నివేశం.
యాక్షన్ అనగానే నా తోటి నటుడు ఒక్క శాతం కూడా నటించలేదు ఏకంగా వంద శాతం జీవించేశాడు.
నా చేతి వేళ్ళు బలంగా తిప్పేశాడు.
ఆ అరుపుల్లో కూడా నా చిటికెన వ్రేలు చిన్నగా చిటుక్కుమన్న శబ్ధం వినిపించింది.
స్థానికుడైన ఆయన “డైరెక్టర్ గారు చెప్పినదాన్నిబట్టి నిజంగానే గొడవపడాలేమోనని బలమంతా ఉపయోగించానండీ” అన్నాడు అమాయకంగా.
అది జరిగిన ఆరు నెలల తర్వాత నా ఎడమచేయి చిటికెన వ్రేలు చివర కొద్దిగా వొంగిపోయి ఉండటం గమనించి డాక్టర్ దగ్గరకి వెళితే “ప్రస్తుతం నొప్పి ఏమీ లేదుగనుక ఆపరేషనూ గట్రాలెందుకుగానీ ఆ వేలు వంకరేదో మీకు పుట్టుకతోనే ఉందనుకొని పట్టించుకోకుండా వొదిలేయండి”అన్నారు.
అదే సినిమాలో కాళ్ళకి చెప్పులు లేకుండా పొలం దున్నే సన్నివేశం.
షూటింగ్ పూర్తయ్యి రూముకెళ్ళాక అరికాళ్ళు ఒకటే మంటలు. మా అసిస్టెంట్ చాకచక్యంగా చేసిన ఆపరేషన్‌లో నా కాళ్ళ నుండి 11 ముల్లులు బైటపడ్డాయి.
అదే సినిమాలో ఓ హాస్పిటల్ సన్నివేశంలో నా చెస్ట్‌కి హార్ట్ఎట్టాక్‌ని పరిశీలించే క్లిప్స్ (ఎలక్ట్రోడ్స్ అంటారనుకుంటా) పెట్టారు. వాటిని పెట్టింది ఒరిజినల్ డాక్టర్సో నర్స్‌లో కాదు. మా షూటింగ్ డాక్టర్స్ (అసిస్టెంట్ డైరెక్టర్స్).
ఆ సన్నివేశం షూట్ చేస్తున్నంతసేపూ నా ఛాతీ చర్మంలో ఏవో తేళ్ళు జర్రులు దూరి కొట్లాడుకొంటున్న ఫీలింగ్ కలుగుతూనే వుంది. కానీ ఒక్కసారి క్లిప్స్ తీస్తే మళ్ళీ పెట్టే పరిస్తితి ఉండదని నాకే తెలిసిపోతోంది గనుక పని డిస్ట్రబ్ కాకూడదని భరించాను.
షూట్ పూర్తయ్యాక క్లిప్స్ తీస్తే ఛాతీ మీద ఓ ఆరేడు పెద్దపెద్ద నీటిబుడగలు మెరుస్తున్నాయి ఎర్రగా.
ఆ బొబ్బలు పదిరోజుల్లో చితికిపోయినా మిగిలిపోయిన మచ్చలు మాత్రం దాదాపు ఓ సంవత్సరం పాటు నేను అద్దంలో చూసుకున్నప్పుడల్లా కనిపిస్తూ వెక్కిరించాకగానీ మాయమవ్వలేదు.
“విరాటపర్వం” అనే సినిమాలో నాది హీరో రానా నక్సలైట్ కావటానికి ప్రేరణనిచ్చే ప్రొఫెసర్ పాత్ర కావటంతో ప్రత్యర్ధులు గన్స్‌తో కాల్చి చంపేస్తారు.
బ్లడ్ చిమ్మటం కోసం చొక్కా లోపల బ్లడ్ బుల్లెట్స్ పెట్టారు.
టేక్ లో షూట్ చేయగానే ఎగిరెగిరిపడ్డాను వెనక్కి.
తర్వాత గెంతులేసుకొంటూ ఇంటికొచ్చి ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కుతుంటే మోకాలులో కలుక్కుమన్నది.
డాక్టర్‌కీ ఎక్సరేలకీ ధనం సమర్పయామి.
- అప్పుడప్పుడూ పలకరించిపోయే ఆ నొప్పి పూర్తిగా మాయం కావటానికి దాదాపు సంవత్సరం పట్టింది.
ఇందులో కొసమెరుపు ఏమిటంటే ఇంతా జరిగి ఆ సినిమా విడుదలయ్యాక ఆ సినిమాలో అసలు నా పాత్రే లేదు. ఫైనల్ ఎడిటింగ్ లో హుష్‌కాకి.
సినిమా నటులకు కనిపించే క్యారెవాన్‌లతోపాటు కనిపించని కొన్నికష్టాలు కూడా కలిసే ఉంటాయి.
హీరోలైతే డ్యాన్స్‌లు ఫైట్స్ కోసం మరింత ఒళ్ళు హూనం చేసుకోకతప్పదు.
అనుకుంటాం గానీ వృత్తిలో అయినా, జీవితంలో అయినా అంతా సాఫీగానే సాగిపోతే తరువాత కొన్నాళ్ళకు ఇలా సరదాగా సోదిలా చెప్పుకోవటానికి కబుర్లేం మిగుల్తాయి? _______ దేవీప్రసాద్.
Share this Article