.
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది… మాట ఎటో ఎటో వెళ్తోంది… రేవంత్ రెడ్డి మీదకు మాటలు ఎక్కుపెడుతున్నాడు… అసహనం కనిపిస్తోంది తనలో…
సాక్షాత్తూ తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఈవిషయంలో అసంతృప్తి ఉంది… తను రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని కనబరుస్తున్నాడు… మరి రాజగోపాలరెడ్డికి ఈ తీవ్ర అసంతృప్తి దేనికి..?
Ads
తనకు మంత్రి పదవి రాలేదని..! అవును, ఎలా వస్తుంది..? ఎందుకు రావాలి అనడుగుతుంది పార్టీ కేడర్… ఎందుకంటే… ఆల్రెడీ కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఉంది, మరొకటి ఇస్తారా..? అసలు కుటుంబంలో ఇద్దరికి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం మీదే చర్చ జరగాలి పార్టీలో నిజానికి… ఎఐసీసీ పెట్టుకున్న రూలే కదా…
అసలే కాంగ్రెస్ బీసీ వాయిస్ వినిపిస్తోంది ఇప్పుడు… 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకే ప్రాధాన్యం అనే పాట పాడుతోంది… ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడుతోంది… ఈ స్థితిలో మరో రెడ్డికి, అంటే మరో ఓసీకి కేబినెట్‌లో ఎలా స్థానం కల్పిస్తుంది..? ఇది రియాలిటీ… రాజగోపాలరెడ్డికి నచ్చకపోయినా సరే…
నాకు ఎఐసీసీ హామీ ఇచ్చింది అంటాడు… మరి, ఢిల్లీని కదా అడగాల్సింది… రేవంత్ రెడ్డి మీద ఈ కోప ప్రదర్శన దేనికి..? నాకు మంత్రి పదవి కావాలంటే కేసీయార్ అప్పుడే ఇచ్చేవాడట… అవునా..? మరి కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చినట్టు..? అదీ బీజేపీని వదిలేసి మరీ..!
పైగా ప్రజలు కోరితే మరోసారి త్యాగం చేయడానికి సిద్ధమట… అంటే రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు రెడీ అంటాడా..? అమ్మా, మీనాక్షి నటరాజన్, వింటున్నావా..? సిఫారసు చేయొచ్చు కదా… అలా చేయడానికి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఓసారి చాన్స్ ఇస్తే బాగుండు..! ‘త్యాగం’ అనేది పెద్ద పదం…
‘‘పైరవీలు చేసి, రాజకీయాలను ఉపయోగించుకుని కోట్లకుకోట్లు సంపాదించుకునేవారికి పదవులు కావాలి…’’ అంటాడు… పైగా మంత్రి పదవి మీదే పదే పదే మాట్లాడతాడు… పైగా రేవంత్ రెడ్డి ఎడ్డెమంటే తెడ్డెం అంటున్నాడు… ఇదేం నిరసన..? జనంలో పార్టీని పలుచన చేయడం కాదా..?
రేవంత్ రెడ్డి ఫేక్ జర్నలిస్టులను నిరసిస్తే ఈయన సమర్థిస్తాడు… పదేళ్లూ నేనే సీఎం అని రేవంత్ అంటే అది సరికాదు అంటాడు ఈయన… 20 మంది ఆంధ్రా కంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు అంటాడు… సీఎం తన భాష మార్చుకోవాలి.. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి… ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి అంటాడు… ఏం మాట్లాడాలో, తను జనానికి ఏం చెప్పుకోవాలో సీఎం చాయిస్ కదా…
రాజగోపాలరెడ్డి సంయమనం పాటించాలి, భాష మార్చుకోవాలని అని సీఎం అనడం లేదు కదా… సీఎంను విమర్శించకూడదని కాదు, అది సరైన వేదిక మీద జరగాలి, సరైన పద్దతిలో జరగాలి… సరైన వ్యక్తులకు చెప్పాలి… మంత్రి పదవి కోసం ఎవరినీ దేబిరించను అంటున్నప్పుడు, అలాగే ఉండాలి కదా…
మంత్రి పదవికీ లెక్కలుంటాయి, చిక్కులుంటాయి… నిజానికి అవి రేవంత్ రెడ్డి చేతుల్లోనే లేవు, అసలు తనను కొందరు మంత్రుల పోర్ట్‌ఫోలియోల్లోనే వేలు పెట్టనివ్వడం లేదు… చివరకు మంత్రుల పోర్ట్‌ఫోలియోలూ తను ఫైనల్ చేయడం లేదు… మరి ఎఐసీసీ హామీ ఇస్తే రేవంత్ రెడ్డి రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి తనెలా ఇవ్వగలడు..? ఎఐసీసీ ఇవ్వాలనుకుంటే కనీసం అడ్డుపడలేడు కూడా..!!
Share this Article