.
కాళేశ్వరం వైఫల్యం, అక్రమాలు బయటపడిపోతూ రోజురోజుకూ దెబ్బ తింటున్న తన ప్రతిష్టను కాపాడుకోవడానికి కేసీయార్ పార్టీ ఓ విఫల ప్రయత్నం చేస్తోంది… అది అవలంబిస్తున్న వ్యూహం ఫలించకపోగా రివర్స్ ఫలితాలను ఇస్తూ మరింతగా పరువు పోగొట్టుకుంటోంది ప్రజల్లో…
1) కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్‌ను, కేసీయార్‌ను ఫిక్స్ చేయడానికి రేవంత్‌రెడ్డి తెలివైన వ్యూహంతో వెళ్తున్నాడు… పొలిటికల్ విమర్శలు, కమిషన్ వేయడం, రిపోర్ట్, కేబినెట్ ఆమోదం, రేప్పొద్దున అసెంబ్లీలో చర్చ, తరువాత సిట్, క్రిమినల్ దర్యాప్తులు…
Ads
ఎప్పుడూ కాళేశ్వరంపై కేసీయార్ వైఫల్యాలు, అక్రమాల్ని జనంలో చర్చ జరిగేలా చూస్తున్నాడు సీఎం… అది ఒక స్ట్రాటజీ…
2) దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ ఏం చేస్తోంది..? కాళేశ్వరం ఆహా ఓహో, సూపర్, బంపర్, డూపర్ అని ఇంకా కీర్తి ప్రచారాలు చేస్తోంది… అది వర్కవుట్ కాదు, ఒకవైపు ప్రాజెక్టు ప్రస్తుతానికి నిరర్థకంగా మారిన నేపథ్యంలో దాన్ని ఇంకా ఇంకా కీర్తిస్తే జనంలో పలుచన కావడం తప్ప, ఉల్టా ‘కౌంటర్ ప్రొడక్ట్’ కావడం తప్ప వేరే ఫాయిదా లేదు… అదే జరుగుతోంది…
3) కాళేశ్వరం నుంచి జనం దృష్టిని రేవంత్‌రెడ్డిపైకి మళ్లించడానికి మరో విఫల ప్రయత్నం… అది బనకచర్ల… ఆల్రెడీ బనకచర్లపై రేవంత్‌రెడ్డి పలు సాంకేతిక, రాజకీయ, చట్టపరమైన ముళ్లు వేసి బిగించాడు… అది ఇప్పట్లో కదలదు… కేంద్ర సంస్థలే చంద్రబాబు ప్రతిపాదనల్ని రిజెక్ట్ చేశాయి… దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి…
ఐనా సరే, రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం బనకచర్లను అంగీకరించాడనే ఓ తప్పుడు ప్రచారం ఎత్తుకుంది బీఆర్ఎస్… ఓ మాజీ మంత్రి అయితే ఏకంగా బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని పండబెట్టారనే వ్యాఖ్యలు చేశాడు…
4) అసలు కాళేశ్వరం కమిషన్ చట్టబద్ధతను ప్రశ్నించడం మరో ఎత్తుగడ… అదీ తప్పే… మరో మాజీ మంత్రి ఏమంటాడంటే..? ‘‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం, 1952 (The Commissions of Inquiry Act, 1952) ప్రకారం, ఒక న్యాయమూర్తి (సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి) నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించినప్పుడు, ఆ కమిషన్ న్యాయవ్యవస్థ (judiciary)లో భాగం కాదు…
ఈ కమిషన్లు తాత్కాలిక విచారణ సంస్థలు… ఇవి నివేదికలు ఇచ్చి, కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలవు… కమీషన్ కోర్టుల మాదిరిగా తీర్పులు ఇవ్వలేదు, మరియు న్యాయస్థానాలకు ఉన్న అధికారాలు దీనికి ఉండవు…’’
ఇదీ తప్పే… ఎందుకంటే, కేసీయార్, హరీష్‌రావు, ఈటలతో పాటు అనేకమందిని, ఇంజినీర్లను ప్రశ్నించి, పక్కాగా నివేదిక రూపొందించింది ఘోష్ కమిషన్… అది తీర్పులు ఇవ్వకపోవచ్చు గానీ, అక్రమాలు జరిగిన తీరును నిర్ధారిస్తుంది… అది అఫీషియల్ డాక్యుమెంట్… ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ఆమోదించి చర్యలకు పూనుకుంటుందో దాని విలువ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది… గత ప్రభుత్వపు అనైతిక, అక్రమ చర్యలు బహిర్గతం కావడం, ప్రజలకు తెలియడం, చర్చ జరగడం అదనపు ప్రయోజనాలు…
కాళేశ్వరంపై జనంలో ఎంత చర్చ జరిగితే అంత మంచిదనేది రేవంత్ రెడ్డి వ్యూహం… ఆ ట్రాపులో బీఆర్ఎస్ పడిపోయి రకరకాలుగా కౌంటర్లు చేయబోతూ మరింతగా ఇరుక్కుంటోంది… రాజకీయంగా రేవంత్ రెడ్డి కోరుకున్నదే జరుగుతోంది…
ఇది నమస్తే తెలంగాణలో నిన్నటి బ్యానర్… ఓ మిత్రుడు వెటకారంగా అన్నాడు… నాడు కాటన్, నేడు పాలిస్టర్ అని..! సరే, కాటన్ కథ వేరు, ఆయన కృష్ణా, గోదావరిల మీద బరాజులు కట్టాడు… ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ దేవుడిగా కొలుస్తున్నారు ఆయన్ని… ఆ బరాజులు ఏళ్లకేళ్లు మన్నాయి… ఆ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి అది… మరి ఇప్పుడు..?
కట్టిన నాలుగు రోజులకే మేడిగడ్డ బరాజ్ తస్కింది… అంటే, కుంగింది… దానిపై ఉన్న అక్రమాల బరువు అది… ఆఫ్టరాల్ పగులు అని బీఆర్ఎస్ ఎంత లైట్‌గా కొట్టిపడేస్తున్నా… మూడు బరాజులూ ప్రమాదకరమే అని కేంద్ర డ్యామ్ సేఫ్టీ సంస్థలే ఖండితంగా చెబుతున్నాయి… వెన్నెముకలోని ఓ వెన్నుపూసకు దెబ్బ, ఇక దేహమే కదల్లేని దుస్థితి…
సో, యుగానికొక్కడు, అద్భుతః పరమాద్భుతః మహాద్భుతః అని గానాబజానాలు హైపిచ్‌లో చేసినా సరే, ప్రజలు విశ్వసించలేని దురవస్థ… బనకచర్లపై పేజీల కొద్దీ, కాళేశ్వరం ఘనభజన టన్నుల కొద్దీ చేసినా వ్యర్థమే అది…
ఇదీ ప్రస్తుతం కాళేశ్వరం అవస్థ… పోరాడి తెచ్చుకున్న తెలంగాణపై మోయలేని భారం… ఎవరో అంటున్నారు, ప్రభుత్వం ఇంజనీర్లను అవమానిస్తోంది అని… ముఖ్య ఇంజినీర్లపై ఏసీబీ జస్ట్, అలా టచ్ చేస్తేనే వందలు వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడుతోంది…
ప్రాజెక్టులో అడుగడుగునా ఇంజనీరింగ్ వైఫల్యాలు, విధాన వైఫల్యాలు, అక్రమాలు… అఫ్‌కోర్స్, కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలకేయుడు కేసీయారే కావచ్చుగాక… కానీ మిగతా అక్రమార్కులనూ వదిలేయలేదు కదా ప్రభుత్వం..!! ఇవన్నీ తవ్వి, సరైన శిక్షలు వేయాలనే కదా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది..!!
Share this Article