.
( రమణ కొంటికర్ల
) ……… షోలే.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ అసాధారణ విజయం.. తెర తెరమరుగయ్యేంతవరకూ చెప్పుకునే, నిల్చిపోయే పోయే బ్లాక్ బస్టర్. అలాంటి షోలే 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. రచయితలు సలీంఖాన్-జావేద్ అక్తర్ రచనా పటిమ, రమేష్ సిప్పి స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో తెరకెక్కిన షోలే 1975, ఆగస్ట్ 15న విడుదలై భారతదేశమంతా బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టింది.
ముంబై మరాఠా మందిర్ లోనైతే వరుసగా ఏడేళ్లపాటు నడిచిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. అందులోనూ గబ్బర్ సింగ్ పాత్ర చిరస్మరణీయమై, నభూతో అన్నట్టుగా నిల్చిపోయింది. మరి సినిమా అంతా బాగున్నప్పటికీ.. సినిమా మొత్తాన్నీ హైజాక్ చేసిన గబ్బర్ పాత్రకు ప్రేరణేంటి..?
Ads
గబ్బర్ పాత్ర వెనుక నిజమైన గబ్బరెవరు..?
గబ్బర్ సింగ్ పాత్రకు ఓ నిజమైన బందిపోటే ప్రేరణ. 1950ల కాలంలో గబ్రా అనే బందిపోటు పేరు చెబితేనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గజగజా వణికే రోజులవి. 1926లో భిండ్ జిల్లా డాంగ్ లో జన్మించిన గబ్రా… జస్ట్ 24 ఏళ్లకే పేరుమోసిన బందిపోటుగా నాడు మూడు రాష్ట్రాల పోలీసులకు నిద్రలేకుండా చేశాడు.
మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకూ టార్గెట్ అయ్యాడు. సినిమాలోలాగానే.. ఆనాడే అతణ్ని పట్టుకున్నవారి 50 వేల రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించాయి ప్రభుత్వాలు.
- గబ్రా బందిపోటుగా ఎంత క్రూరుడో అంతే భక్తిపరుడు. అందుకే, తన కులదైవానికి ఒళ్లు గగుర్పొడిచే మొక్కులు మొక్కుకునేవాడు. అలా 116 మంది ముక్కులు నరికిస్తానని తన కులదేవతకు మొక్కుకున్నాడట గబ్రా. ఆ క్రమంలో అనేకమంది పోలీస్ అధికారుల ముక్కులు, చెవులు కోసి ఆ దేవతకు రక్తార్పణం చేసి అన్నంత పనీ చేశాడు. అంతటి భయంకరమైన చరిత్ర నిజమైన గబ్బర్ సింగ్ గబ్రాది.
అందుకే, రియల్ నుంచి రీల్ గా గబ్రా కథనం!
1950ల కాలంలో మధ్యప్రదేశ్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) గా ఉన్న కే.ఎఫ్. రుస్తంజీ తన డైరీలో గబ్బర్ సింగ్ గురించి కొన్ని విషయాల్ని రాసుకున్నారు. ఆ డైరీ ప్రకారం గబ్రా చేస్తున్న ఆకృత్యాలతో భిండ్, గ్వాలియర్, చంబల్, ఎటావా, ధోల్ పూర్ వంటి ప్రాంతాల్లో జనం భయం భయంగా భిక్కుభిక్కుమంటూ గడిపేవారే తప్ప.. అతడి ఆచూకీ మాత్రం పోలీసులకు చెప్పేవారు కాదట.
1955 వరకూ కూడా గబ్రా కళ్యాణ్ సింగ్ గుజ్జార్ అనే మరో డెకాయిట్ గ్యాంగ్ లో సభ్యుడిగా పనిచేసేవాడు. కానీ, అప్పటికే పేరు మోసిన బందిపోటుగా తన ఉనికిని చాటుకుంటున్న గబ్రా.. ఆ తర్వాత, తానే ఓ ప్రత్యేక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
గబ్రా అరాచకాలతో నాటి చంబల్ లోయలో ఆర్తనాదాలకు నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం కూడా తలపట్టుకుంది. ఎలాగైనా అతణ్ని పట్టుకోవాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. అలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గబ్రా కోసమే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
1959లో ఓ పోలీస్ ఆఫీసర్ గబ్రాను మట్టుబెట్టడంలో చాకచక్యం ప్రదర్శించాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అప్పటికే ప్రధానమంత్రి నెహ్రూకు స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి. అలా అప్పటి డిప్యూటీ ఎస్పీ రాజేంద్రప్రసాద్ మోడీని గబ్రా కోసమే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ గా నియమించారు.
ఆ క్రమంలో రాజేంద్రప్రసాద్ అండ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ టీం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాలన్నీ జల్లెడపట్టింది. చంబల్ లోయలోని ఓ గ్రామానికి చెందిన రాంచరణ్ అనే ఓ వ్యక్తి పోలీసులకు అందించిన సమాచారంతో పోలీసుల వేట మొదలైంది.
ఆ సమయంలో డిప్యూటీ ఎస్పీ రాజేంద్రప్రసాద్, గబ్రా బృందానికీ మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆ కాల్పుల్లో, గ్రెనేడ్ దాడుల్లో గబ్రా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఎన్ కౌంటర్ లో అసువులు బాసాడు. ఇదంతా రాబోయే నెహ్రూ పుట్టినరోజు కంటే ముందే జరగడంతో… ప్రధాని నెహ్రూకు కూడా నిద్రలేని రాత్రులు మిగిల్చిన గబ్రా మరణవార్తను ఆయన పుట్టినరోజునే వినిపించాలనే గట్టి తలంపుతో నాటి డిప్యూటీ ఎస్పీ రాజేంద్రప్రసాద్ గబ్రా కోసం జల్లెడ పట్టాడు.
అలా తన ప్రియమైన ప్రధానికి అంతకుముందు సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసినందుకు గబ్రా మరణవార్తను పుట్టినరోజు బహుమతిగా అందించాడు. అదిగో ఆ గబ్రా కథనే స్ఫూర్తిగా తీసుకుని సలీంఖాన్- జావేద్ అక్తర్ చేసిన ప్రతిసృష్టే బ్లాక్ బస్టర్ షోలేలోని… లెజెండరీ గబ్బర్ సింగ్ పాత్ర!
Share this Article