.
Prabhakar Jaini
…. చిన్న సినిమా నిర్మాతలను బహిష్కరించాలి… అవును. ఒక చిన్న సినిమా నిర్మాతగా నేనే చెబుతున్నాను.
ఎందుకంటే, అసలే కరోనా తర్వాత సినిమా నిర్మాణంలోని ప్రతీ పనికి రేట్లు విపరీతంగా పెరిగాయి. చిన్న సినిమా నిర్మాతకు సినిమారంగంలో మినిమం గౌరవం లేదు. ఏ ఆఫీసు గడప తొక్కినా, చీప్ గా చూస్తున్నారు. ఆఫీసులో ఉన్నా లేరని, ప్యూనులతో చెప్పిస్తారు. ఫోన్లు ఎత్తరు. ఎందుకంటే, చిన్న నిర్మాత, వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వ లేడు. వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చలేడు.
Ads
చిన్న సినిమా నిర్మాతలకు ప్రతీ పనీ ఖర్చుతో కూడుకున్నదే! కార్మికులను వాళ్ళ ఇంటి దగ్గర నుండి పికప్ చేసుకుని, లొకేషన్ కు చేరగానే టీ, కాఫీలు ఇవ్వాలి. ఓ గంట కాగానే టిఫిన్లు పెట్టాలి. ప్రతీ రెండు గంటలకు టీలు ఇవ్వాలి. లంచ్ అరేంజ్ చేయాలి. మళ్ళీ రెండు సార్లు టీలు ఇవ్వాలి. నాలుగ్గంటలకు స్నాక్స్ ఇవ్వాలి.
కాల్ షీట్ వ్యవధి దాటిన తర్వాత పని చేస్తే ఒకటిన్నర కాల్షీట్ల కు డబ్బులు ఇవ్వాలి. రూల్స్ ప్రకారం ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. కానీ, దబాయించి, ఇప్పించుకుంటారు. పోనీ తిండి విషయమే కదా అని మనం ఔదార్యం ప్రదర్శించినా, ఇన్ని చేసినా, నిర్మాతకు కనీస గౌరవం ఇవ్వరు. నిర్మాత నిలబడి ఉంటే, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు.
బడా నిర్మాతల సినిమాలలో పనిచేసిన నటీనటులైతే, చిన్న నిర్మాతలను పురుగుల్లా చూస్తున్నారు. వీళ్ళకు పెద్ద సినిమాల్లో దిక్కు ఉండదు. కానీ, అవకాశం ఇచ్చిన చిన్న నిర్మాతను మాత్రం అవమానిస్తారు. నేను తీయబోతున్న ఒక సినిమాలో, ప్యాడింగ్ కోసమని ఒక మాజీ హీరోను తీసుకున్నాము. బాగానే ముట్టచెప్పాము.
అతనితో పాటు వచ్చిన మేనేజర్, మేకప్ మ్యాన్లు, అసిస్టెంట్లు మాకు నరకం చూపించారు. ఆ నటుడైతే, నేను కరచాలనం చేయడానికి ప్రయత్నించినా, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఒక మాజీ హీరోకే ఇంత గీర ఉందనుకుంటే, అయితే, స్టార్ల విషయం చెప్పనక్కర లేదు, నేను వినడమే కానీ, నాకు ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ లేదు.
ఆ సినిమాకు వచ్చిన టెక్నీషియన్లు కూడా దొంగ లెక్కలు చూపించి, ఎక్కువ డబ్బులను గుంజారు. పెద్ద సినిమాలకన్నా, చిన్న సినిమాలకు, పారితోషికాల విషయంలో, తప్పక రాయితీలు ఉండాలి. పెద్ద సినిమా ఒక్క రోజు విదేశాల్లో జరిపే షూటింగు బడ్జెటుతో, మొత్తం చిన్న సినిమా పూర్తవుతుంది.
నానా చంకలు నాకి, చిన్న సినిమా తీసినా దానికి థియేటర్లు దొరకవు. ఓటీటీలోకి రానీయరు. టీవీల్లోకి తీసుకోరు. అవార్డులు రావు. సబ్సిడీలు లేవు. ప్రభుత్వం కూడా పెద్ద నిర్మాతలను ఆప్యాయంగా కౌగలించుకుంటుంది. కానీ, చిన్న నిర్మాతలను పురుగుల్లా చూస్తుంది.
ఇవన్నీ గమనించి, చిన్న సినిమా నిర్మాతలకు పని చేసే కార్మికులకు పారితోషికాలు ఇప్పుడున్న వాటికన్నా తగ్గించుకోవాలి. చిన్న నిర్మాతలు, ఏదో ప్యాషన్ తో సినిమా తీయడానికి వస్తారు తప్ప, కోట్లు కోట్లు గడించాలని కాదు. వారికి సినిమా బిజినెస్, వ్యాపారం కాదు. వారికి అది ఒక ప్రవృత్తి.
టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సంవత్సరానికి మాగ్జిమమ్ పది వరకు ఉంటాయి. మిగిలినవన్నీ చిన్న సినిమాలే. ఈ చిన్న సినిమాలే, టెక్నీషియన్స్ కు తిండి పెడుతున్నాయి. కానీ, వారికి చిన్న సినిమాలంటేనే చూపు.
టాలీవుడ్ లోని అన్ని విభాగాల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అని రేట్లలో తేడా లేదు. సేమ్ సెన్సార్ ఫీజ్, సేమ్ క్యూబ్ రేట్లు, సేమ్ పబ్లిసిటీ రేట్లు. ప్రభుత్వం కూడా పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు, షో సంఖ్యల పెంపు, ఏదడిగినా ఇస్తుంది. చిన్న సినిమా నిర్మాతలను గడప కూడా తొక్కనీయదు.
వేదికల మీద మహా మానవతావాదులుగా మాట్లాడే నటీనటులు, రచయితల, నిర్మాతలు, డైరెక్టర్ల నిజ స్వరూపం వికృతంగా ఉంటుంది. అన్ని అవార్డులు వారికే కావాలి. అన్నింటా వారిదే పై చేయిగా ఉండాలి.
సినీ కార్మికులు కూడా రెండు రకాలు. బాగా సంపాదించి బలిసిన వాళ్ళు కొంత మందైతే, తినడానికి తిండి లేక, సినిమా రంగాన్ని వదిలి బయటకు వెళ్ళ లేక, అన్నమో రామచంద్రా! అని అలమటిస్తున్న వారు కొందరు. వారికి కొంత తక్కువ పారితోషికం ఇచ్చి, చిన్న నిర్మాత పని చేయించుకుంటానంటే ఒప్పుకోరు.
పెద్ద నిర్మాతలు, సినీ కార్మికులకు 30% పెంచితే, వారికేం కష్టం కాదు. పెంచాల్సిందే.
వంగి, వంగి దండం పెట్టి వందల కోట్లు హీరోలకు సమర్పించుకున్న వాళ్ళు కార్మికులకు పెంచడంలో తప్పు లేదు. ఇదే నిర్మాతలు, బొంబాయి, చెన్నై డాన్సర్లకు, స్టంట్ మ్యాన్లకు, నటులకు బా… గా.. నే సమర్పించుకుంటున్నారు. తెలుగు సినీ కార్మికులకు ఇవ్వాలంటేనే ఏడుపొస్తుంది.
ఇప్పుడు, 30% రేట్లు పెంచితే చిన్న నిర్మాతలు ఇబ్బందులు పడతారని కపట ఏడుపులు ఏడుస్తున్నారు పెద్ద నిర్మాతలు. అందుకే, చిన్న నిర్మాతలకు, వేరే రేట్లు ఉండాలి. అలాగే, వారి సినిమాలకు థియేటర్లు ఇప్పించ వలసిన బాధ్యతను కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకోవాలి.
క్యూబ్ రేట్లు, సెన్సార్ ఫీజులను తగ్గించే బాధ్యతను తీసుకోవాలి. పబ్లిసిటీ ఖర్చులను తగ్గించాలి. చిన్న సినిమాలకు సబ్సిడీ ఇప్పించాలి. కథను బట్టి, వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇప్పించాలి. మంచి సినిమాలకు తప్పనిసరిగా అవార్డులు ఇవ్వాలి, ఇప్పించాలి. లేకపోతే, చిన్న సినిమా నిర్మాతలపై నిషేధం విధించి, వారిని బహిష్కరించండి. ఇక మీ డ్రామాలు చాలు.
Share this Article