.
వార్-2 … ఈ సినిమాకు సంబంధించిన చాలా విశేషాలు చాన్నాళ్లుగా చదువుతూనే ఉన్నాం… జూనియర్ ఎన్టీయార్ బాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ… హృతిక్ రోషన్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్… నార్త్ సౌత్ కాంబినేషన్… భారీ నిర్మాణ వ్యయం…
హృతిక్ మంచి అందగాడు, మంచి డాన్సర్… తను పక్కా టాప్ కమర్షియల్ బాలీవుడ్ హీరో… సేమ్, తెలుగులో జూనియర్ కూడా మంచి డాన్సర్… నిజానికి తను మనకున్న మంచి నటుల్లో ఒకడు… అన్నిరకాల ఉద్వేగాలను గొప్పగా నటించగలడు…
Ads
కానీ నటనకు స్కోప్ ఉన్న పాత్రలతో ఏమొస్తుంది అనుకుని పక్కా రొటీన్ ఫార్ములా కమర్షియల్ కథల్నే ఎంచుకుంటున్నాడు… తనకు మాస్ అప్పీల్ కావాలి… తనకు పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి కాబట్టి…
చివరకు బాలీవుడ్‌కు వెళ్లినా అదే ధోరణి..? పైగా తన లుక్కు మారింది, వీక్‌గా కనిపిస్తున్నాడు… వార్-2లో తనను సమర్థంగా వాడుకోలేదు దర్శకుడు… నిజానికి జూనియర్‌కు ఈ పాత్ర మంచినీళ్లు తాగినంత ఈజీ… అలవోకగా చేస్తూ వెళ్లిపోయాడు… హృతిక్ కూడా సేమ్…
అసలే ఎటెటో వెళ్లిపోయిన కథ… పైగా పూర్ గ్రాఫిక్స్ వర్క్… పలుచోట్ల తేలిపోయింది సినిమా ఈ గ్రాఫిక్స్ వల్లే… (ఇటీవల నాసిరకం వీఎఫ్ఎక్స్‌తో దెబ్బతిన్న మరో సినిమా హరిహరవీరమల్లు… చివరకు ప్రేక్షకులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా గగ్గోలు పెట్టేసరికి కొన్ని సీన్లను తీసేయాల్సి వచ్చింది నిర్మాతలు…)
అందుకే, ఉంటే గ్రాఫిక్స్ వర్క్ బాగా ఉండాలి, లేదంటే అసలు ఉండకూడదు సినిమాలో… (అవతార్ నరసింహ యానిమేటెడ్ సినిమా అయినా సరే, బాక్సాఫీసును దున్నేస్తోంది చూశాం కదా… దర్శకత్వ ప్రతిభ…)
వార్-2 డబ్బింగ్ సినిమా అయినా, ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో తెలుగు సినిమాయే అని పదే పదే చెప్పుకున్నారు, డబ్బింగ్ సినిమాకు మరీ 400 రూపాయల దాకా టికెట్ రేట్లను పెంచుకోవడం కోసం… ఈ రేంజ్ ధరలు ప్రేక్షకులను దోపిడీ చేయడమే… ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో ఎవరికీ థాంక్స్ చెప్పకపోవడం, తరువాత మరో వీడియోలో జూనియర్ క్షమాపణలు, థాంక్స్ చెప్పడం మరో వివాదం… (తనేమైనా దీనికి నిర్మాతా..? నిర్వాహకుడా..?)
వార్-2 సినిమా ఎలా ఉంది..? అంచనాల మేరకు లేదు… తేలిపోయింది… యశ్‌రాజ్ ఫిలిమ్స్ వంటి పెద్ద బ్యానర్‌తో చేతులు కలపడం వరకూ వోకే గానీ… జూనియర్ ఈ సినిమా బదులు మరో పాన్ ఇండియా మూవీ చేసి ఉంటే బాగుండేది… హృతిక్ రోషన్ డామినేట్ చేసేశాడు…
ఇద్దరు స్నేహితుల (హృతిక్ రోషన్, ఎన్టీఆర్) గురించిన కథ… వారు ఎంచుకున్న దారులు వారిని ఎలా విడదీశాయి, వారి ప్రయాణాలు దేశంతో ఎలా ముడిపడి ఉన్నాయనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం… వారి ఉద్దేశాలు, చివరికి వారి మధ్య జరిగే ఘర్షణ చుట్టూ కథ నడుస్తుంది…
హృతిక్ రోషన్ తనదైన చరిష్మా, ఆకర్షణతో ఆకట్టుకుంటాడు… అతని స్టైలింగ్ War మొదటి భాగంలో ఉన్నట్టుగానే ఉంది… తెరపై అతను చూపించే ఆత్మవిశ్వాసం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్… అతని పాత్రకు పెద్దగా డెప్త్ లేకపోయినా, కొన్ని సన్నివేశాల్లో నటుడిగా తన ప్రతిభను కనబరిచాడు…
అత్యంత ప్రజాదరణ పొందిన YRF స్పై సిరీస్‌లో చేరాలన్న ఎన్టీఆర్ నిర్ణయం ప్రశంసనీయం… అయితే, అతని స్టైలింగ్, పాత్ర రూపకల్పన, అలాగే స్క్రీన్‌ప్లేలో అతని పాత్రను మలిచిన తీరు అభిమానులనే కాకుండా విమర్శకులను కూడా నిరాశపరుస్తుంది… ఈ పాత్రకు కొత్తదనం ఏమీ లేదు… నటుడిగా ఎన్టీఆర్‌కు తన ప్రతిభను చూపించే అవకాశం చాలా తక్కువ…
విశ్లేషణ: అయాన్ ముఖర్జీ దర్శకుడు… సేమ్ వార్-1 లాగే… కాకపోతే ఈసారి టైగర్ ష్రాఫ్ బదులు జూనియర్… ఇంటర్వెల్ వరకు వచ్చే కథనం ఫక్తు టెంప్లేట్… నిజానికి ఇలాంటి జానర్ సినిమాల్లో పెద్దగా కథా కాకరకాయ లేమీ లేకపోయినా యాక్షన్ కోరుకుంటారు జనం… ఇందులో అదీ పెద్దగా ఆకట్టుకోదు… ఇద్దరు హీరోలు తెరపై కలిసి కనిపించినప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ కూడా అంతంత మాత్రమే…
కియారా అద్వానీ ఉందంటే ఉంది… ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు… ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపించినా, అది బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తుంది…
పోనీ, రెండో సగం ఏమైనా కథను మలుపు తిప్పిందా..? రక్తికట్టిందా..? అంటే అదీ లేదు… కొన్ని సన్నివేశాలు వోకే గానీ, కథనంలో లోపాలు కొనసాగాయి… కథలో ఉత్కంఠ లేదు… సినిమా చివర్లో ఇద్దరు కథానాయకుల మధ్య ఒక ఎమోషనల్ బ్లాక్ కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది, కానీ ముగింపు మళ్లీ నిరాశపరిచింది…
ఏవేవో దేశాల్లో భారీ యాక్షన్ సీన్లు… మరీ విమానం మీద ఫైట్ అత్యంత అతి… War 2 ఒక మంచి అవకాశం వృథా చేసిన సినిమాగా మిగిలిపోతుంది… ఉత్తరాది, దక్షిణాది స్టార్స్ అయిన హృతిక్, ఎన్టీఆర్‌ల కలయిక నుంచి గొప్పగా ఏదైనా ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది… ఇద్దరు హీరోల డ్యాన్స్ బాగుంది… అంతే తప్ప సేమ్ పాత కథనం, రెండు లీడ్ రోల్స్ నడుమ ఆకట్టుకునే సీన్స్ లేవు…
చివరగా…. జూనియర్, నీ సినిమాలోకి హిందీ హీరోలను పట్టుకురా… సినిమా నీ సినిమాగా ఉండేలా చూసుకో, అంతే తప్ప ఎవరి సినిమాలోనికో నువ్వు దూరకు, వెళ్లకు… ఇంకెవరో డామినేట్ చేస్తే నీ ఫ్యాన్స్‌కే కాదు, తెలుగు ప్రేక్షకులకు నచ్చదు, నీ రేంజ్ వేరు… అప్పుడది నీ సినిమా ఎలా అవుతుంది..!! (యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్, ఆ ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా ఈ కథనం)
Share this Article