.
వార్-2 ఎత్తిపోయింది సరే… అది మహావతార్ నరసింహకు మరింత ప్లస్ అవుతుంది… ఇప్పటికే కుమ్మేస్తుంది థియేటర్లలో… అందరి దృష్టీ ఇక కూలీ మీద పడింది…
ప్రత్యేకించి తెలుగు వాళ్లలో… ఎందుకు..? 74 ఏళ్ల వయస్సొచ్చినా వైవిధ్య పాత్రలు గాకుండా, నటనకు స్కోప్ ఉన్నవి గాకుండా… ఈరోజుకూ అదే మొనాటనస్ మేనరిజమ్స్‌తో, అవే ఫార్ములా కథలతో కూడా ఈరోజుకూ జనాన్ని థియేటర్లకు రప్పిస్తున్నాడు కదా… కూలీతో కూడా దాన్ని నిలబెట్టుకున్నాడా..? ఇదీ ఆసక్తి…
Ads
తెలుగు హీరో నాగార్జున 65 ఏళ్లకే హీరో పాత్రలకు తెరవేసి… మొన్న కుబేరలో, ఈరోజు కూలీలో సైడ్ హీరో లేదా విలన్ పాత్రలకు వచ్చాడేమిటి..? ఇదొక ఆసక్తి… ఎస్, నాగార్జున అచ్చు జగపతిబాబులాగే కేరక్టర్ ఆర్టిస్టు అయిపోయినట్టే..! ఎక్కడ, ఎప్పుడు, ఎలా తగ్గాలో తెలిసిపోయింది తనకు…
సరే, కూలీ సినిమా లోకేష్ కనగరాజ్‌ది… అసలే తను హైపర్ యాక్షన్ సీన్లతో సినిమాను పైకి లేపుతాడు… పైగా ఇప్పుడిక రజినీకాంత్… అందుకే ఈ సినిమా మీద అంత ఆసక్తి… పైగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు సినిమా టికెట్లు కొనిచ్చి, సెలవులు కూడా ప్రకటించాయి… బాగా హైప్ క్రియేట్ చేయబడి ఉంది… ప్రపంచవ్యాప్తంగా రజినీ అభిమానులు వేచిచూస్తున్నారుు… ఐతే సినిమా ఇన్ని విశేషాలు చెప్పుకునే రేంజులో ఉందా..?
లేదు… అంత హైఎక్స్‌పెక్టేషన్స్ రేంజులో లేదు… కానీ సినిమా నిరాశపరచదు… ప్యూర్ రజినీకాంత్ స్టయిల్ సినిమా… సైమన్ (నాగార్జున) ఒక స్మగ్లింగ్ నెట్‌వర్క్ నడుపుతాడు… ఆ గ్యాంగ్‌లోకి దేవా (రజనీకాంత్) ఎలా వస్తాడు? తన గతం ఎలా బయటపడుతుంది? ప్రీతీ (శ్రుతి హాసన్)తో సంబంధం ఏమిటి? ఈ ఫ్రెండ్‌షిప్ యాంగిల్ మొత్తం కథను ఎలా కట్టిపడేస్తుంది? అనేదే కూలీ కథ యొక్క గుండెకాయ…
సేమ్, కన్నప్పలోలాగే… పాన్ ఇండియా అంటే వివిధ భాషల నటులు ఉండాలనే ఓ భ్రమ ఈ నిర్మాతలకూ ఉన్నట్టుంది… తెలుగు నుంచి నాగార్జున, కన్నడం నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి ఆమీర్ ఖాన్, మలయాళం నుంచి సౌబీన్… వీటికితోడు పూజా హెగ్డేతో ఐటమ్ సాంగ్… అవసరమైన అన్ని కమర్షియల్ మసాలాలు గుప్పించారు…
ఎస్, 74 ఏళ్ల వయస్సులోనూ రజినీకాంత్‌లోనూ అదే ఎనర్జీ, అదే దూకుడు… అదే స్టయిల్… ఈ సినిమాకూ తనే బలం… స్టైలింగ్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు… తనకు ఈ నటన జస్ట్, అలవోకగా మంచినీళ్లు తాగినంత ఈజీ… సరదాగా చేసుకుంటూ పోయాడు…
నాగార్జున పూర్తిగా నెగటివ్ రోల్… ఫస్ట్ హాఫ్‌లో బాగానే సెట్ అయింది.., కానీ సెకండ్ హాఫ్‌లో క్యారెక్టర్ ఇంటెన్సిటీ లేక ఇంపాక్ట్ లేకుండా పోయింది… ఏదో ఓ సాదాసీదా విలన్‌గా మిగిలిపోయాడు… శ్రుతి హాసన్ తర్వాత మంచి రోల్ దక్కింది… స్ట్రాంగ్ ప్రెజెన్స్… కన్విన్సింగ్‌గా నటించింది…
ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ జస్ట్ అతిథి పాత్రలే, ప్లస్సు కాదు, మైనసూ కాదు… రజినీ స్వాగ్, నాగ్ నెగటివ్ రోల్, శ్రుతి ప్రెజెన్స్ ఇవన్నీ కథను ముందుకు నడిపిస్తాయి… ఫస్టాఫ్‌లో నాగార్జున పాత్ర బాగానే ఉన్నా, సెకండాఫ్‌లో దర్శకుడు తడబడ్డాడు… బదులుగా సౌబిన్ షాహీర్, శ్రుతి హాసన్ ట్రాక్ ఎక్కువసేపు సాగుతుంది…
సంగీత దర్శకుడు అనిరుధ్ బాగా కష్టపడ్డాడు… రజినీకాంత్ సినిమాకు ఏం కావాలో అది అందించాడు… బీజీఎం బాగుంది… కొన్ని సీన్లను ఎలివేట్ చేసింది… మొత్తానికి మరీ 400 పెట్టి చూసేంత సీన్ లేకపోయినా… కాస్త ధరలు తగ్గాక… థియేటర్ వెళ్తే వోకే… మరీ టాకీస్‌కు పడీ పడీ పరుగులు తీయాల్సినంత సీన్ ఏమీలేదు…
రజినీకాంతే కదా, ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు… 50 ఏళ్ల నుంచి చూడటం లేదా..? సేమ్… రేప్పొద్దున తనది మరో సినిమా వచ్చినా అదిలాగే ఉంటుంది… అదే రజినీ… అదే స్టయిల్… ఫ్యాన్స్ ఆతృతపడి, వెంటనే చూడాలని అనుకోవడం వల్లే ఇలా డబ్బింగ్ సినిమాలకూ తెలుగు రాష్ట్రాల్లో అడ్డగోలు రేట్లు పెట్టి దోచుకుంటున్నారు..!!
చివరగా… వార్-2లో జూనియర్, కూలీలో నాగార్జున… తమను తాము తగ్గించుకోవడమే… వాటి బదులు తెలుగులోనే మంచి కథలు, మంచి దర్శకులకు అవకాశాలు ఇస్తే బాగుండేది… అక్కడ హృతిక్, ఇక్కడ రజినీ… వాళ్లదే డామినేషన్…!
Share this Article