.
మనం ఈమధ్య ఓసారి చెప్పుకున్నాం… ‘‘తెలుగు రాష్ట్రాల మీద కొన్ని సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి, కానీ జనం దగ్గర అంత డబ్బుందా వీటిని చూడటానికి’’…
అన్నీ పాన్ ఇండియా సినిమాలే… అంత ఖర్చు, ఇంత ఖర్చు అని చెబుతున్నారు… వందల కోట్లు… మరీ దారుణం ఏమిటంటే..? ఆ ఖర్చు చెప్పి, డబ్బింగ్ సినిమాలకు కూడా (వార్2, కూలీ) తెలుగు రాష్ట్రాల్లో మరీ 400 రూపాయల దాకా టికెట్ రేట్లు పెంచడం… మరి తెలుగు ప్రభుత్వాలా మజాకానా..?
Ads
అంతా హంబగ్… వందల కోట్ల ఖర్చుల్లో హీరోల పాదాల మీద పరిచే పుష్పాలే కోట్లకుకోట్లు… తీరా చూస్తే నాసిరకం గ్రాఫిక్స్, సూపర్ హీరోయిజం, తేలిపోయిన కథ, లాజిక్ ఏమాత్రం లేని కథనాలు… తీసేవాడికి చూసేవాడు లోకువ…
ఫస్ట్… హరిహర వీరమల్లు… ఢమాల్… అంతిమంగా ఎన్ని నష్టాలు తేలతాయో లెక్కలు వేసుకుంటున్నారు బయ్యర్లు తలల మీద ఎర్ర తువ్వాళ్లు కప్పుకుని..! మరీ నవ్వుపుట్టించేంత నాసిరకంగా ఉన్న గ్రాఫిక్స్ మార్చి, ఇంకేవేవో మార్పులు చేసినా జనం చాలుపొమ్మన్నారు… చివరకు ఫ్యాన్స్‌కు కూడా నీరసం తెప్పించింది సినిమా…
చాన్నాళ్ల తరువాత విజయ్ దేవరకొండ వచ్చాడు… హిట్టు కొట్టినం అని సంబురాలు చేసుకున్నారు… కాస్త పాజిటివ్ టాకే వచ్చింది… పేరు కింగ్డమ్ – కానీ ఏం జరిగింది..? 80 కోట్ల దగ్గర ఆగిపోయి, అంతిమంగా నష్టాలే…
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీయార్ మల్టీ స్టారర్ మీద బోలెడు పాన్ ఇండియా ఆశలు పెట్టుకున్నారు… నీతోడు నాతోడు ఇది తెలుగు సినిమాయే అని చెప్పుకున్నారు… ఒకడైతే మరీ 1000 కోట్లు పక్కా వసూల్ అన్నాడు… పేరు వార్- 2 – ఢమాల్… పెట్టిన ఖర్చుకూ వస్తున్న రాబడికీ పొంతన లేదు…
ఇక రజినీకాంత్ కూలీ గురించి చెప్పక్కర్లేదు… భారీ రేట్లకు అమ్మారు బయ్యర్లకు… 400 కోట్లు ఏం ఖర్చు పెట్టారో ఎవరికీ అర్థం కాదు… ఉత్తదే… పిచ్చి కథ, అదే 70 వయస్సు దాటినా సరే అదే రజినీకాంత్ మ్యానరిజం, సూపర్ హీరోయిజం… దానికి కాస్త నాగార్జున లాజిక్‌లెస్ విలనీ… దీనికీ ఇప్పుడు మిక్స్‌డ్ టాక్…
విపరీతమైన మాస్ పాపులారిటీ ఉన్నా సరే… ఒక పవన్ కల్యాణ్, ఒక రజినీకాంత్, ఒక జూనియర్ అందరినీ ప్రేక్షకుడు తిరస్కరిస్తున్నాడు… ఇది రియాలిటీ… మరీ న్యూట్రల్ ప్రేక్షకులైతే థియేటర్ల మొహాలు కూడా చూడటం లేదు…
ఎంతసేపూ గ్యాంగ్‌స్టర్లు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, వాటి నడుమ ఫైట్లు… తలాతోకా లేని కథనాలు… కన్నప్ప కథ చూశాం కదా… మొదట్లో కాస్త పాజిటివ్ టాకే వచ్చింది… తీరా చూస్తే మధ్యలోనే చేతులెత్తేసి కుదేలైంది… ఎంత భారీ తారాగణం ఉంటేనేం..? ఎవరూ పట్టించుకోలేదు… ఆయా భాషల స్టార్లు ఉన్న ప్రాంతాల్లోనూ ఫెయిల్…
ఇక తమ్ముడు సినిమా సంగతి చూశాం కదా… మరోసారి చెప్పుకుందాం… తీసేవాడికి చూసేవాడు అగ్గువ, లోకువ… ఏమైంది, జనం అడ్డంగా ఛీకొట్టారు… నాణేనికి మరోకోణం… ఒక మహావతార్ నరసింహ… జస్ట్, ఒక యానిమేటెడ్ సినిమా… స్టార్లు లేరు, కథ మాత్రమే స్టార్… ప్రజెంటేషన్ తీరు స్టార్… 40 కోట్లు పెట్టారట…
ఇప్పటికే 250 కోట్ల వసూళ్లు… 300 కోట్లు దాటిపోనుంది… హిందీ మార్కెట్‌ను దున్నేస్తోంది… సేమ్, సయారా… ఊరూపేరూ లేని తారలతో అనామకంగా విడుదలై ఇప్పుడు ఏకంగా 550 కోట్లను కుమ్మేసింది… అంతెందుకు..? తలైవి తలైవాన్ సినిమా (కంపేరటివ్‌గా చిన్న సినిమాయే) కూడా 100 కోట్లు కొట్టింది తమిళంలో…
ఏతావాతా తేలిందేమిటి..? జనం ఆచితూచి… చాలా సెలెక్టెడ్‌గా సినిమాలకు వస్తున్నారు… హీరోల మొహాలు చూసి, వాళ్ల భజనలు చూసి, అత్యంతాతి సుప్రీమ్ హీరోయిజాలను చూడటానికి మొహం చాటేస్తున్నారు… ఐనా వీళ్లు మారతారా..? ఏమో…!
Share this Article