.
సినిమాలకు సంబంధించి బోలెడు గాసిప్స్, హీరోల భజనలు, సినిమాల ప్రమోషన్లు, అఫయిర్స్, బ్రేకప్పులు గట్రా బోలెడు చదువుతుంటాం కదా… అతిశయోక్తులు, అబద్ధాలు కూడా…
కానీ మలయాళ ఇండస్ట్రీలో ఓ విశేషానికి మన సినిమా మీడియా పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు ఎందుకో మరి..! నిజానికి అది చెప్పుకోదగిన విశేషం… అమ్మ… అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్… దీనికి కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికైంది… అదీ బలమైన పోటీ నడుమ… ఆమె పేరు శ్వేతా మేనన్…
Ads
హీరోల పాదాక్రాంతాల వద్ద పాకులాడే సినిమా ఇండస్ట్రీలో… ఆర్టిస్టుల అసోసియేషన్‌కు ఒక నటుడితో పోటీపడి మరీ గెలవడం ఖచ్చితంగా చెప్పుకోదగిన విశేషమే… అంతకుముందు దీనికి మోహన్‌లాల్ అధ్యక్షుడు… కానీ కొందరు నటులు, దర్శకులపై కొందరు తారలు లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో తను రాజీనామా చేశాడు…
మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టుల్లో చైతన్యం కాస్త ఎక్కువే… నోరు విప్పి బజారుకు లాగి నిలదీస్తారు… అఫ్‌కోర్స్, అదే సమయంలో వివక్ష, మగపెత్తనాలు, దాష్టికాలూ ఎక్కువే… బోలెడు కేసులు నడుస్తున్నాయి కూడా కోర్టుల్లో…
మొన్నటి ఎన్నికకు ముందు కూడా ఆమె మీద ఓ కేసు పెట్టారు… తన పాత సినిమాలు, యాడ్స్‌కు సంబంధించిన అశ్లీల బిట్స్‌ను ప్రచారంలోకి తీసుకువచ్చిందని..! ఆమెను డీమోరల్ చేసి, ఆమె ఎన్నిక గాకుండా నిలువరించేందుకు అన్నమాట… కానీ ఆమె సహజంగానే ఫైర్… తిప్పికొట్టింది, నిలిచింది, అమ్మకు తొలి లేడీ ప్రెసిడెంటుగా గెలిచింది…
ఆమె ఒకటీ అరా తెలుగు సినిమాల్లో కూడా అతిథి పాత్రల్లోనో, చిన్నాచితకా పాత్రల్లోనో కనిపించినట్టు గుర్తు… ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సు… మలయాళం సినిమాలే అధికం… కొన్ని హిందీ…
చండీగఢ్‌లో పుట్టిన మలయాళీ… తండ్రి ఎయిర్‌ఫోర్స్ ఎంప్లాయీ… తను మొదట్లో మోడల్… 1994 మిస్ ఇండియా పోటీల్లో ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్‌లతో పోటీపడింది… పలు హిందీ చిత్రాల్లో నటించి, ఇక మాలీవుడ్‌కు మళ్లింది… మంచి పాత్రలూ చేసింది, కొన్ని బోల్డ్ సినిమాలు కూడా…
వెబ్ సీరీస్, టీవీ షోలు, ప్రజెంటర్, హోస్ట్… వివాదాలు కూడా ఎక్కువే… భయపడదు, ఏదైనా ఇష్యూ వస్తే ముందుకొచ్చి నిలబడుతుంది… ఎవరికీ భయపడకుండా ఆమె పెట్టిన కేసులూ ఉన్నయ్, ఆమెపై పెట్టిన కేసులూ ఉన్నయ్…
అందుకే ఆ ఇండస్ట్రీలోని మగపెద్దలకు ఆమె అంటే మంట, కంటగింపు… సో, మోహన్‌లాల్ ఖాళీ చేసిన ఆ అమ్మ ప్రెసిడెంట్ కుర్చీలో ఆమె కూర్చోవడం ఇంట్రస్టింగే… అవునూ, తెలుగులో గనుక ‘మా’ అసోసియేషన్‌కు పోటీకి పెట్టాలంటే ఇలాంటి ఫైర్ బ్రాండ్ కేరక్టర్ ఎవరున్నారబ్బా..?!
Share this Article