.
కాళేశ్వరంపై కేటీయార్ మరోసారి అర్థరహిత ప్రకటనలకు దిగాడు… తనేమంటున్నాడు అంటే… ‘‘ఎన్డీయే ప్రభుత్వం కడుతున్న పోలవరం కాఫర్ డ్యామ్ మరోసారి కొట్టుకుపోయింది… కాళేశ్వరంలో రెండు పిల్లర్లకు కాస్త పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కూస్తున్నారు కదా…
మరి పోలవరం ప్రాజెక్టును కూలవరం అనే దమ్మూధైర్యం ఉన్నాయా ఈ కాంగ్రెస్‌కు, ఈ బీజేపీకి..? రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ఎన్‌డీఎస్ఏను దింపి, బురద జల్లారు, కేసీయార్ మీద కక్షతో కాళేశ్వరం మీద కుట్రలు చేస్తున్నారు…’’
Ads
ఇదీ ఆయన ప్రకటన… పైగా అనుమానాస్పద స్థితిలో కుంగిన పిల్లర్లు అంటున్నాడు… అంటే మాజీ బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణల్లాగే… బాంబులు పెట్టి పేల్చారు అంటున్నాడు కదా తను… ఆ కేసు దర్యాప్తు ఏమైంది అనడుగుతున్నాడు..? కేటీయార్ కూడా ఆరోపిస్తున్నది అదే కదా…
ఇక్కడ కొన్ని అంశాలు చెప్పుకోవాలి…
– పోలవరం ప్రాజెక్టు నాణ్యత, వేగం గురించి ‘ముచ్చట’ సర్టిఫికెట్ ఏమీ ఇవ్వడం లేదు… కానీ నిన్న కాఫర్ డ్యామ్ కొట్టుకుపోలేదు… ఆ మాట వాడటమే కరెక్టు కాదు… 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో మట్టి కుంగిపోయింది, తెలంగాణ భాషలో తస్కింది… (ఈనాడు భాషలో జారింది అన్నా తప్పే…)
– ఆ మట్టి కింద కట్టిన బట్రస్ డ్యామ్ సేఫ్…. ఎస్, గతంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న మాట, కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం… ఐతే పోలవరం ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణంలోనే ఉంది… కాఫర్ డ్యామ్ ప్యూర్‌లీ టెంపరరీ డ్యామ్… నీటిని మళ్లించడానికి మాత్రమే దాని ప్రయోజనం… పైగా మట్టి… ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, సరిచేస్తూనే ఉంటారు…
– కానీ కాళేశ్వరం వేరు… ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టు… ఆ డ్యామ్‌లు పర్మినెంట్ స్ట్రక్చర్స్… చిరకాలం ఉండాలి… కానీ స్థలం ఎంపికలు, నిల్వ, పిల్లర్ల కింద ప్లేట్లు, నిర్మాణ నాణ్యత అన్నీ సందేహాస్పదాలే… అక్రమాలు, అవినీతి వేరే విషయాలు…
– రెండు పిల్లర్లకు పగుళ్లు కాదు అసలు ప్రమాదం… ఎన్ని బ్లాకులు ఆ స్థితిలో వాడటానికి పనికిరాకుండా ఉన్నాయనేది, రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థ భరిస్తుందా లేదా వంటి అనేక ప్రశ్నలు… ఇంతకుముందులా నిర్లక్ష్యంగా కట్టినట్టు గాకుండా… రిపేర్లకూ కాస్త పద్ధతి, సరైన డిజైన్ అవసరం ఇప్పుడు… నాలుగు తట్టల కాంక్రీట్ పోస్తే పూడిపోయే పగుళ్లు కావు అవి…
– నిజంగానే బాంబులు పెట్టి పేలిస్తే… ఎవరో ఏఈ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే … మరి అప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే కదా… ఎందుకు దర్యాప్తు చేయలేదు… ఎన్నికల ముందే ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే ఇదుగో వీరు బాధ్యులు అని ప్రకటిస్తే, తెలంగాణ సమాజానికి కూడా ఓ క్లారిటీ వచ్చేది కదా…
– ఇప్పుడు కాళేశ్వరంపై ఘోష్ రిపోర్ట్ మెడమీద కత్తిలా వేలాడుతుంటే… ఈ బాంబుల కథలు కొత్తగా కావల్సి వచ్చాయా..? పోనీ, ఏమైనా కుట్ర ఛాయలు కనిపించాయేమో ఘోష్ కమిటీ ఏం చెబుతుందో చూద్దాం… అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారు కదా..! సిట్ కూడా వేస్తారు కదా… అదైనా తేలుస్తుంది కదా…!
మరో విషయం… పోలవరం పొరుగు రాష్ట్ర ప్రాజెక్టు… దానిపై తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఎందుకు స్పందించాలి..? ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు పట్టించుకుంటాయి… మన జీవనాడి అని పదే పదే ప్రచారం చేసి, అడ్డదిడ్డంగా కట్టేసిన కాళేశ్వరం మీదే ఈ రాష్ట్ర పార్టీలకు పట్టింపు… నిజానికి పోలవరం కాఫర్ కట్ట తస్కిన సంఘటనను మేడిగడ్డ పగుళ్లకు లింక్ పెట్టడమే అబ్సర్డ్..!!
Share this Article