.
Mohammed Rafee …….. తెలుగు సినీ పరిశ్రమ సరైన నాయకుడు లేక కొట్టుమిట్టాడుతోంది! ఎవరికి వారు “నేను లేనా? నేనే లీడర్” అని ప్రకటించుకున్నా ఇండస్ట్రీ గుర్తించడం లేదు! పైగా “మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకుని ఆ తరువాత ఇండస్ట్రీ సమస్యలు చూద్దురులెండి” అని లైట్ తీసుకుంటున్నారు! అందుకే ఇప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి వ్యక్తి కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తోంది!
మరో దాసరి అసంభవం! ఎన్టీఆర్, దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు! అలాంటి వ్యక్తులను మళ్ళీ చూడలేం! అలాంటి లీడర్లు రారు మళ్ళీ రాలేరు, అసలు పుట్టలేరు అని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు!
Ads
పరిస్థితులు చూస్తే నిజమేననిపిస్తోంది! తెలుగు సినీ పరిశ్రమలో లీడర్ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది! ఎవరికి ఎవ్వరూ, చివరికి ఎవ్వరూ అన్నట్లుగా ఇండస్ట్రీలో వాతావరణం కనిపిస్తోంది! గత 14 రోజులుగా సినీ ఫెడరేషన్ చేస్తున్న కార్మికుల సమ్మె సమస్యను పరిష్కరించే నాథుడు లేడు!
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పించుకుని, సమస్యను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు అప్పగించారు! ఆయన ఛాంబర్ కే వదిలేసారు! ఛాంబర్ మెగాస్టార్ చిరంజీవి వైపు చూస్తోంది!
ఆయనదొక స్టయిల్! పాము చావకూడదు కర్ర విరగకూడదు అనే సామెత అన్నమాట! “మూడు రోజుల్లో పరిష్కరించండి లేదంటే నేను చూస్తా” అని ఛాంబర్ కోర్టులోకే బంతి విసిరారు! వారం దాటినా సమస్య కొలిక్కి రాలేదు!
మళ్ళీ ఇవాళ ఆయన కోర్టులోనే బంతిని వేసేందుకు నిర్మాతలు సిద్ధం అవుతున్నారు! ఈ తమాషా గేమ్ బావుందని, చిరంజీవి ఎలా పరిష్కరిస్తారో చూద్దాం అంటూ సినీ పెద్దలు చాలామంది ఆసక్తిగా కొండొకచో కాస్త ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు!
నిజానికి దాసరి నారాయణరావు లేని లోటును ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు! ఆయన ఉన్నప్పుడు “ఈయన పెత్తనం ఏమిటి” అని లోలోపల విసుక్కున్న వాళ్ళు సైతం “దాసరి ఉండి ఉంటే బావుండు” అనుకుంటున్నారు! నాయకుడు అనిపించుకోవడం వేరు! నిజమైన నాయకుడు వేరు! దాసరి అసలు సిసలు లీడర్!
ఆయన అంతగా కష్టపడే వారు! సినిమా పెద్ద అనిపించుకోవడం ఆయనకు ప్యాషన్! దాసరి ఇల్లు సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లలో పని చేసే వారి కోసమే కాదు, అందరికి స్వాగతం పలుకుతూ ఉండేది! రోజుకు 300- 400 టీలు, కాఫీలు, 40- 50 మందికి బ్రేక్ ఫాస్ట్, ఓ వంద మందికి లంచ్, ఈవెనింగ్ స్నాక్స్ 50- 60 మంది, రాత్రికి డిన్నర్ ఎంత లేదన్నా పాతిక మంది వాళ్ళింట్లో ఉండేవాళ్లు!
ఇంటికి వచ్చిన వారిని వూరికే మాట్లాడి పంపించడం ఆయనకు ఇష్టం ఉండదు! చేతులు కడగాల్సిందే ఏదొకటి తినాల్సిందే! ఎదుటి వాడి సమస్యలు వినడం కూడా ఒక కళ! ఎంతో ఓర్పు ఉండాలి! దాసరి విని వదిలేసే రకం కాదు! ఏదొక పరిష్కారం చూపించే తత్వం! అవసరమైతే జేబులోంచి కొంత సొమ్ము ఇచ్చి భరోసాతో పంపించే వారు!
దాసరి ఏదో మామూలు వ్యక్తి కాదు! అతనొక అసామాన్యుడు! అతనే కథ, అతనే సంభాషణలు, అతనే స్క్రీన్ ప్లే, అతనే లిరిసిస్ట్, అతనే దర్శకత్వం! ఇంత బిజీలోనూ పత్రికా రంగం, మరోవైపు రాజకీయ రంగం, ఇంకో వైపు తన కాపు కుల సంఘం! ఇవి కాక సినిమా రంగంలో అన్ని పంచాయితీలు! అటు క్రియేటివిటీ పనులు చూసుకుంటూ ఇటు తలనొప్పి పంచాయితీలు చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు! అది ఒక్క దాసరికే సొంతం! అందుకే ఒకవైపు బ్లాక్ బస్టర్లు తీశారు! మరో వైపు కేంద్ర మంత్రి కాగలిగారు! లీడర్ అంటే దాసరి! దాసరి అంటే లీడర్!
అందుకే ఇప్పుడు దాసరి నారాయణరావును ఇండస్ట్రీ గుర్తు చేసుకుంటోంది! మోహన్ బాబు, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ ఇలాంటి చాలామంది పెద్దలు వున్నా ఇండస్ట్రీ వారిని దాటి ముందుకు పోయింది! ఇప్పుడు వారి మాటలు వినేందుకు ఇండస్ట్రీ సిద్ధంగా లేదు!
ఒక్క ఆశా కిరణంగా చిరంజీవి మాత్రమే కనిపిస్తున్నారు! కానీ, ఆయన ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు! అందరినీ కలుపుకు పోవాలనే మనస్తత్వం వున్నా ఆయనకు సమయం సహకరించదు! ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కావాలి! పెద్ద దిక్కు లేని లోటు కనిపిస్తోంది! - డా. మహ్మద్ రఫీ
Share this Article