.
ఈరోజు మీడియాలో వచ్చిన వార్తల్లో నచ్చిన వార్త ఏమిటంటే… భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు లభించిన ఘనస్వాగం… రాత్రి 2 గంటల వేళ, ఢిల్లీ విమానాశ్రయం వద్ద తనకు శుభస్వాగతం లభించింది… ప్రైడ్ ఆఫ్ నేషన్… ఆమాత్రం సాదర, ఆత్మీయ స్వాగతం లేకపోతే ఎలా మరి..?
అప్పుడెప్పుడో రాకేశ్ శర్మ… రష్యా సహకారంతో అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత… 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తిరిగి భారతదేశానికి చేరుకున్నాడు…
Ads
జూన్ 25, 2025న నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లో మొత్తం 18 రోజులు గడిపాడు… ఈ చారిత్రక ఘట్టంతో భారత అంతరిక్ష పరిశోధనలో సరికొత్త అధ్యాయం మొదలైంది… ఆయన రాకతో దేశం మొత్తం ఉప్పొంగిపోయింది…
ఒక వీరుడికి ఘన స్వాగతం
ఆగస్టు 17న ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శుక్లాకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు… కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్‌తో పాటు అనేక మంది ప్రముఖులు ఆయనను పలకరించారు… అంత రాత్రి వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అక్కడికి వెళ్లడం విశేషమే… అభినందనలు…
ఎయర్‌పోర్టు స్టాఫ్ తనతో సెల్ఫీలు దిగడానికి ఒకటే హడావుడి… చప్పట్లు, అభినందనలు సరేసరి… డప్పుల శబ్దాలతో, జాతీయ జెండాలను ఊపుతూ ప్రజలు కూడా ఆయనకు అద్భుతమైన స్వాగతం పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త మాట్లాడుతూ, “ఇది ఢిల్లీకే కాదు, దేశం మొత్తానికి గర్వకారణం… భారతీయ ప్రతిభకు, పట్టుదలకు శుక్లా ప్రతీక’’ అని ఆమె అభివర్ణించింది….
మిషన్ వివరాలు, శాస్త్రీయ ప్రయోగాలు
యాక్సియమ్-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు శుక్లా, అక్కడ అనేక ముఖ్యమైన శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశాడు… మొత్తం 60కి పైగా ప్రయోగాలు, బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, భూ పరిశీలన వంటి రంగాల్లో ఆయన పరిశోధనలు చేశాడు…
యువతకు స్ఫూర్తినిచ్చేలా 20కి పైగా ఔట్రీచ్ సెషన్లలో పాల్గొని, విద్యార్థులతో మాట్లాడాడు… అంతరిక్ష ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విద్య వైపు యువతను ప్రోత్సహించాడు…
ముందున్న లక్ష్యాలు: గగన్‌యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్
శుక్లా మిషన్ భారత అంతరిక్ష కార్యక్రమాలకు ఒక మైలురాయిగా నిలిచింది… ఈ ప్రయాణం ద్వారా భారతదేశం తన అంతరిక్ష శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది… శుక్లా మిషన్ సాధించిన విజయాలు, అక్టోబర్ 2025లో ఇస్రో చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌కు మార్గం సుగమం చేశాయి… భావి ప్రయాణాలకు శుక్లా ఓ ప్రేరణ, ఓ ఉత్సాహం…
ఈ మిషన్‌లో భాగంగా ముగ్గురు భారతీయ వ్యోమగాములను స్వదేశీ వ్యోమనౌకలో భూమికి సమీప కక్ష్యలోకి పంపనున్నారు… అంతేకాకుండా, భారతదేశం సొంతంగా ఒక అంతరిక్ష స్టేషన్ అయిన భారతీయ అంతరిక్ష స్టేషన్ను కూడా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది… ఈ లక్ష్యాలు రాబోయే కాలంలో భారతదేశాన్ని అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా నిలబెట్టనున్నాయి…
జాతీయ స్పేస్ డే వేడుకలు
తన అంతరిక్ష ప్రయాణం గురించి మాట్లాడిన శుక్లా, తన సహచరులతో ఏర్పడిన బంధాన్ని, ఇంటికి తిరిగి వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉన్నారో షేర్ చేసుకున్నాడు… త్వరలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నాడు… ఆ తర్వాత తన సొంత పట్టణమైన లక్నోను సందర్శించి, ఢిల్లీలో జరగబోయే జాతీయ స్పేస్ డే (National Space Day) వేడుకల్లో పాల్గొంటాడు…
కాలం మారుతోంది… కొత్త తరం టెక్నాలజీ, సైన్స్, శాస్త్రీయ పురోగతి, ఎఐ, రీసెర్చ్ మీద బాగా ఆసక్తి చూపిస్తోంది… ఒక భారతీయుడు ఈ రంగాల్లో ఏం సాధించినా సంబురపడుతోంది… శుభాంశు శుక్లా వార్తలకు బాగా ఆదరణ లభించడానికి అదే కారణం…!!
Share this Article