Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం… నడుమ పుణ్యస్త్రీ స్లో సక్సెస్…

August 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. 1950s, 1960s లలో రావలసిన ఈ పుణ్యస్త్రీ సినిమా 1986 మార్చి 28 వ తేదీన వచ్చింది… అందులోనూ సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సుల మధ్య గూడ్స్ బండి లాగా సాగుతూ వంద రోజులు ఆడిందంటే ఆ ఘనతంతా కుటుంబ కధా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులదే .

ఈ సినిమా వంద రోజులు ఆడిందా అనే అనుమానం కొందరికి రావచ్చు . మరి కొందరికి అసలీ సినిమా ఉందా అనే ధర్మ సందేహం కూడా కలగవచ్చు . కానీ వంద రోజుల పోస్టర్లు అప్పట్లో వెలువడ్డాయి…

Ads

తమిళంలో విసు వ్రాసిన ఒక నాటకం , తర్వాత కధగా వ్రాయబడిన కధాంశంతో అవల్ సుమంగళితన్ టైటిలుతో తమిళంలో నిర్మించబడింది . వ్యాపారపరంగా కూడా విజయం సాధించింది . దీనికి రీమేకే మన పుణ్యస్త్రీ సినిమా .

తెలుగులో కార్తీక్ , కన్నడ నటి భవ్య , రాజేంద్రప్రసాద్ , సంయుక్త , గొల్లపూడి మారుతీరావు , అన్నపూర్ణ , ఆలీ , పి జె శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు . కార్తీక్ తమిళంలో కూడా నటించారు . గొల్లపూడి పాత్రను విసు , అన్నపూర్ణ పాత్రను కె ఆర్ విజయ , భవ్య పాత్రను ఇళవరసి నటించారు .

punya stree

గంగవరం అనే గ్రామంలో పేద కుటుంబంలో ఉండే కధానాయకి విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో పనిచేసే హీరోతో పెళ్ళవుతుంది . హీరో చాలా మంచివాడు . అనాధ అయిన అతనికి ప్రాణస్నేహితుడు రాజేంద్రప్రసాద్ . అతనికి చెల్లెలు సంయుక్త . అంతా ఆనందంగా సాగుతున్న సమయంలో హీరోకి బ్రైన్ కేన్సరని తెలుస్తుంది .

పుట్టింటికి వెళ్ళిన కధానాయికకు ఈ విషయం తెలిసి ఆత్మహత్య చేసుకుంటుంది . అక్కడకు చేరిన హీరో కూడా ఆమెతో పాటే మరణిస్తాడు . అయిదో తనం అనే అబ్సెషన్ని స్త్రీలకు పెద్దలు బాగా ఎక్కించే రోజుల్లో సుమంగళిగా చనిపోవటం భాగ్యంగా తలిచేవారు స్త్రీలు . ఆరోజుల్లో రావలసిన సినిమా రెండు దశాబ్దాలు ఆలస్యంగా వచ్చినా అయిదో తనం సెంటిమెంట్ మహిళల్లో గాఢంగా ఉండటం వలన సక్సెస్ అయింది .

రీమేకుల్లో వి మధుసూదనరావులాగా రవిరాజా పినిశెట్టి కూడా నిపుణుడు . రవిరాజా దర్శకత్వం బాగుంది . మరీ నిదానంగా వెళుతున్నట్లు పెద్దగా ప్రేక్షకులకు తెలియకుండా భద్రంగా సినిమాను తోలాడు . కన్నడంలో పేరున్న భవ్యకు తెలుగులో మొదటి సినిమా ఇది . ముత్యాలముగ్గు సినిమాలో సంగీత లాగా ముగ్ధంగా , అందంగా , ఒద్దికగా నటించింది .

punyastree

తల్లిగా , పేద కుటుంబాన్ని లాక్కొచ్చే సగటు ఆదర్శ మహిళగా అన్నపూర్ణ చక్కగా నటించింది . ఆమెకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . గొల్లపూడిది ప్రధాన పాత్ర . అక్కడక్కడ కాస్త విసిగిస్తుందీ పాత్ర . అయినా ఓకే . ఇంక కార్తీక్ , రాజేంద్రప్రసాద్ , సంయుక్తలు బాగా నటించారు .

స్నేహానికి , ఆప్యాయతలకు మతం అడ్డు రాదని ఈ ముగ్గురి పాత్రలు మరోసారి చెపుతాయి . ఆనాటి సినిమాలు మతాల మధ్య , కులాల మధ్య అంతరాలను తొలగించేందుకు , అవగాహన పెంచేందుకు చాలా కృషి చేసేవి .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . మౌనమా కోపమా అంటూ సాగే పాట రెండు సార్లు , ఒకసారి ఆనందంలో మరోసారి విషాదంలో , వస్తుంది . శ్రావ్యంగా అలరిస్తుంది . రెండు డ్యూయెట్లు . పువ్వులలో నవ్వులలో సాగెనులే తొలి కాపురమే , గాఢపు చలి కాలపు మమకారపు కౌగిట్లో డ్యూయెట్లు శ్రావ్యంగా ఉంటాయి .

సినిమా మొదట్లోనే వచ్చే భవ్య పాట ముంజేతి నీలి సిరిగాజులు చిత్రీకరణ తొలి సంధ్య లాగా అందంగా ఉంటుంది . ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ సెలయేరులా అందంగా సాగుతుంది . ఈనాటి ఢాం ఢాం సంగీత దర్శకులు ఇలాంటి సినిమాలను చూసి నేర్చుకోవాలి . నాలాంటి ముసలి ప్రేక్షకులను శబ్ద కాలుష్యం నుంచి కాపాడాలి .

సాయినాథ్ సంభాషణలు బాగుంటాయి . వేటూరి వారి పాటల సాహిత్యం , బాలసుబ్రమణ్యం జానకమ్మల గాత్రం , పాటల చిత్రీకరణ చాలా బాగుంటాయి . ప్రమోద ఆర్ట్ ఫిలింస్ బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు నిర్మాత కె బెనర్జీ . గూడ్స్ బండి లాంటి కధను సినిమాగా తీయటానికి సాహసించినందుకు అభినందనీయుడు . అదృష్టవంతుడు . వంద రోజులు ఆడి , డబ్బులు వచ్చాయి .

సినిమా యూట్యూబులో ఉంది . ఫుల్ ఫేమిలీ సెంటిమెంట్ , ఎమోషన్ ఉన్న సినిమా . అలాంటి సినిమాలంటే ఇష్టపడే వారు వాయిదాల్లో చూడవచ్చు . చూడబులే . #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలుగు అభ్యర్థి..! ఇండియా కూటమిలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు..!!
  • మార్వాడీ గో బ్యాక్…! అశాంతి రేపే అసాంఘిక శక్తులకు చుక్కెదురు…!!
  • ఎక్కడో న్యూజిలాండ్‌లో కనిపించేవి… ఇప్పుడివి ఖమ్మం అడవుల్లో ప్రత్యక్షం…
  • సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం… నడుమ పుణ్యస్త్రీ స్లో సక్సెస్…
  • ధర్మస్థల వందల శవాల కంట్రవర్సీ..! బయటపడుతున్న ఓ భారీ కుట్ర…!?
  • అమెజాన్ అంటేనే అమేజింగ్..! వర్షాన్ని తనే రప్పించుకుంటుంది..!
  • కమర్షియల్ యాడ్స్‌పై రజినీకాంత్ ధోరణి ప్రశంసనీయమే..! కానీ..?
  • ఆధ్యాత్మికత + నృత్యాలు = కామాఖ్యలో దియోధని ఉత్సవాలు…
  • కాళేశ్వరం గంతలు… హరీష్‌రావు వృథా ప్రయాస..! ఇవీ నిజాలు..!!
  • …. కోటి రూపాయలకు ఓ కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions