.
కేటీయార్‌కు ఏమైంది..? బీఆర్ఎస్ కేడర్‌లోనూ ఓ అయోమయం… ప్రత్యేకించి ఉపరాష్ట్రపతి పోటీకి సంబంధించి నిన్న తను చేసిన వ్యాఖ్యలు ఒకవైపు నవ్వు పుట్టించడమే కాదు, పార్టీ తీసుకుంటున్న పొలిటికల్ లైన్ మీద కేడర్‌లోనే బోలెడు సందేహాలను కలిగిస్తున్నాయి…
2 లక్షల టన్నుల యూరియా ఎవరి ఇస్తే వాళ్లకు మద్దతు అట… కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే, అన్నదాత అవసరాలకు తగినంత యూరియా సప్లయ్స్ దాని బాధ్యత… కాంగ్రెస్ గానీ, ఇండియా కూటమి గానీ వెంటనే ఓ 5 లక్షల టన్నులు ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేదు కదా… ఐనా ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుకూ యూరియాకూ లింకేమిటి అసలు..?
Ads
వోకే, యూరియా ఇష్యూ ఫోకస్ కావడానికి ఓ పొలిటికల్ ఎత్తుగడగా ఈ డిమాండ్ పెట్టారనే అనుకుందాం… దానికి పరిమితమైతే సరిపోయేది… మళ్లీ బీసీలు ఎవరూ లేరా..? కంచె ఐలయ్య లేడా అంటున్నాడు… తెలంగాణ సమాజంలో, ప్రత్యేకించి హిందూ సమాజంలో, మరీ ప్రత్యేకించి కంచె ఐలయ్య పట్ల ఉన్న భావన ఏమిటో కేటీయార్‌కు తెలుసా అసలు..? కంచె ఐలయ్య బాటను, మాటను కేటీయార్ పార్టీ సమర్థిస్తోందా..? తెలంగాణ సమాజం అదే అర్థం చేసుకోవాలా..?
సమాజంలో అశాంతిని రేపే విద్వేషి తను… తనకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యేంత అర్హత ఉందని కేటీయార్ ఎలా అనుకున్నాడు..? పార్టీ యాంటీ- హిందూ ధోరణి తీసుకుంటోందా..? పోనీ, కంచె ఐలయ్య కంట్రిబ్యూషన్ ఏమిటి తెలంగాణ సమాజానికి..? అసలు బీఆర్ఎస్ పోకడలకే భిన్నమైన ధోరణి కదా తనది… పైగా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ మద్దతుదారు, న్యాయ- చట్టపరమైన అంశాల్లో నిపుణుడు, తటస్థుడు, ఏ పార్టీ అఫిలియేషన్ లేదు… తనతో అసలు కంచె ఐలయ్యకు పోలిక ఏమిటి..?
బీసీలే కనిపించలేదా అంటున్నాడు కేటీయార్… అసలు బీసీల అవకాశాలను కుదించిందే బీఆర్ఎస్… బీసీల జనాభాకు తగిన రిజర్వేషన్లు, అవకాశాల కోసం కాంగ్రెస్ ఏదో ప్రయత్నిస్తోంది, ఐనా బీసీలకు సమాన అవకాశాలు అనే ధోరణి తీసుకుంటే, ఇక వేరే కులాల వాళ్లకు ఏ అవకాశాలూ ఇవ్వకూడదా..?
పోనీ, కంచె ఐలయ్య అంత ప్రసిద్ధుడు, సమాజోద్దారకుడు అయితే ఇన్నేళ్లు బీఆర్ఎస్ పాలించింది కదా… ఓ ఎమ్మెల్సీ సీటో, ఓ అధికారిక పదవో ఇచ్చిందా..? తన సేవలు తీసుకుని ఉంటే తెలిసొచ్చేది కదా… ఇప్పుడు హఠాత్తుగా ఈ ప్రేమ ఏమిటి..?
కాంగ్రెస్ చిల్లర పార్టీ కాబట్టి, పైగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థి కాబట్టి మేం మద్దతు ఇవ్వబోం అంటున్నాడు కేటీయార్… అంటే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తారా..? సుదర్శన్‌రెడ్డి పక్కా తెలంగాణ… రాధాకృష్ణన్ తమిళ్… బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కూటములతో సంబంధం లేని తటస్థతే ముఖ్యం అనుకున్నప్పుడు… తెలంగాణ ఉద్యమం ప్లస్ స్థానికత ఉన్న సుదర్శన్‌రెడ్డికే మద్దతు దక్కాలి కదా… పైగా తను కాంగ్రెస్ పార్టీ మనిషి కూడా కాదు… పైగా కాంగ్రెస్ మద్దతు అనేది తనకు అనర్హత ఎలా అవుతుంది..?
మమ్మల్నెవరూ సంప్రదించలేదు అంటాడు కేటీయార్… అసలు బీఆర్ఎస్‌కు లోకసభలో ఎవరూ లేరు, ముగ్గురో నలుగురో రాజ్యసభలో ఉన్నారు… సభ్యులు ఎక్కువగా ఉన్న పార్టీలను సంప్రదిస్తారు, మద్దతు అడుగుతారు, రాజనాథ్‌సింగ్ అందుకే జగన్‌కు ఫోన్ చేసి మద్దతు అడిగాడు, ఇస్తాడు కూడా… పైగా ఏ కూటమికైనా ఓ ఎత్తుగడ ఉంటుంది… దాన్ని బట్టే అభ్యర్థిత్వాలు, ఏ కూటమిలోనూ లేనివాళ్లను ఎవరు అడుగుతారు..? ఎందుకు అడగాలి..?
తెలంగాణవాది, తెలంగాణ వ్యక్తి కాబట్టి మద్దతు ఇవ్వండని రేవంత్ రెడ్డి తెలివిగా ఓ పాచిక విసిరాడు కేసీయార్ మీదకు… అటూఇటూ తేల్చుకోలేని పొలిటికల్ డైలమాలోకి నెట్టేశాడు… అందుకే ఏదీ తేల్చుకోలేని అయోమయం, గందరగోళంలో కేటీయార్ ఏదేదో మాట్లాడుతున్నాడు కేటీయార్…
మాకెవరూ బాసులు లేరు అనేది కేటీయార్ మరో డైలాగ్… ఉన్నారని ఎవరన్నారు..? ఎలా ఉంటారు..? అసలు పొలిటికల్ క్రెడిబులిటీ కోల్పోయాకే కదా అందరూ దూరం పెట్టింది… ఇవన్నీ నిజాలు… గెలుపూ ఓటమి కాదు, రెండు కూటముల సైద్ధాంతిక పోరాటం ఈ ఎన్నిక… ఇటో అటో తేల్చుకోవాలి, లేదంటే దూరంగా ఉండాలి, అలా చేస్తే మరింత రాజకీయ ఒంటరితనమే ప్రాప్తం…
ఆల్రెడీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది తెలంగాణ సమాజంలో బాగా చర్చనీయాంశమైంది… ఒకవేళ బీఆర్ఎస్ ఏన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే, ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది… ఇదొక సందిగ్ధత…
మాకు ఏ కూటమితోనూ సంబంధం లేదు, కానీ ఓ తెలంగాణ పార్టీరహిత పర్సనాలిటీ కాబట్టి సుదర్శన్‌రెడ్డికి మద్దతునిస్తాం అని చెప్పి ఉంటే ఎంత హుందాగా ఉండేది…? పార్టీ పుట్టుక స్పిరిట్‌ను గౌరవించినట్టు కూడా ఉండేది కదా..!! అవునూ, తెలంగాణ సాధకుడిగా చెప్పబడే కేసీయార్ ఈ విషయంలో కూడా ఏమీ మాట్లాడడా..?!
ఏపీలో సిట్యుయేషన్ వేరు… చంద్రబాబు ఎన్డీయే భాగస్వామి, సో, సుదర్శన్‌రెడ్డి తెలుగుతనంకన్నా తనకు తన కూటమి కమిట్మెంటే ప్రధానం… జగన్ అవసరాలు వేరు, మోడీని కాదని స్వతంత్రంగా వ్యవహరిస్తే ఏ ప్రమాదాలో తనకు తెలుసు, పైగా తనను నానా కష్టాలూ పెట్టిన కాంగ్రెస్ వైపు చూడడు… ప్రధాన తెలుగు పార్టీలకు సంబంధించి అందరూ క్లియర్, ఒక్క కేసీయార్ మినహా.,.!
Share this Article