.
Prabhakar Jaini
….. చిరంజీవి అంటే ఒకప్పుడు పిచ్చి అభిమానం. దాదాపు నాదీ అదే ఏజ్. 1981 నుండి 1985 మధ్య కాలం చిరంజీవి విజృంభిస్తున్న రోజులు. నేను జీవితంలో పైకి రావాలని సివిల్స్ అటు తర్వాత పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం, అహర్నిశలు శ్రమిస్తున్న రోజులు అవి.
ఎప్పుడైన నిరాశ ఆవహించినప్పుడు, మనకు కుల బలం, రాజకీయ బలం, ఆర్థిక బలం లేని కారణంగా, పోటీ పరీక్షల్లో నెగ్గలేక పోతున్నప్పుడు, డిప్రెషన్ ఆవహించేది. అంతులేని అగాథంలోకి పడిపోతున్నట్టనిపించేది.
అప్పుడు, అప్పుడు చిరంజీవి సినిమా చూసేవాణ్ణి. సినిమా అయిపోగానే ఉత్సాహం తన్నుకొచ్చేది. మనం కూడా ఈ ప్రపంచాన్ని జయించవచ్చుననే ధీమా కలిగేది. పోరాటానికి పునరంకితం అయ్యేవాణ్ణి.
Ads
తరువాత, నా ‘చోర్ బజార్’ నవల, 1993-94 ల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడుతున్నప్పుడు, Thotakura Raghu గారు ప్రశ్నలు జవాబులు శీర్షిక పెట్టారు. 90% మంది పాఠకులు ఆ నవలను సినిమా తీయాలని, హీరో ఎవరైతే బాగుంటారని నన్ను ప్రశ్నించే వారు.
ఆ నవలలో ఇద్దరు హీరోలు – ఆకాశ్, అర్జున్ – ఉంటారు. చిరంజీవి అయితేనే, డబుల్ రోల్ లో, రెండు పాత్రలకు న్యాయం చేస్తాడని చెప్పేవాణ్ణి. కానీ, వెళ్ళి, కలిసి, కథ చెప్పే ధైర్యం లేదు. అప్పటికే నేను డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేసేవాణ్ణి. కానీ, ఏదో బెరుకు.
అటువంటి చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించగానే, నా అభిమానం ఎగిరిపోయింది. ఇప్పటికీ చిరంజీవి సినిమాల్లో హీరోగా నటిస్తుంటే, అవి ఫెయిల్ అవుతుంటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు థియేటర్ కు వెళ్ళి చూసే సినిమా అభిమానులు 20 నుంచి 30 ఏళ్ళ వయసు వాళ్ళే.
వాళ్ళని targetted audience అంటారు. అంటే ఒక ప్రాడక్ట్ తయారు చేసే ఉత్పత్తిదారులు, ఆ ప్రాజక్టును ఎవరు ఎక్కువగా వినియోగిస్తారో అంటే వినియోగదారులు ఎవరో వారి అభిరుచుల మేరకు తయారు చేస్తారు.
చిరంజీవిని ప్రాణప్రదంగా ప్రేమించే అభిమానులు, targetted audience, ఇప్పుడు 50 నుంచి 70 ఏళ్ళ వయసులో ఉన్నారు. వీళ్ళు థియేటర్లకు రారు. ఓటీటీలో వస్తే ఫ్రీగా చూస్తారు.
చిరంజీవి అనే కాదు అమితాభ్ బచ్చన్, కమల్ హసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖుల ప్రభ తగ్గిపోతుంది. ఎందుకంటే, వీళ్ళు కాలంతో పాటు మార లేకపోతున్నారు. ఇంకా ‘అహం బ్రహ్మస్మి’ అనే మిథ్యాలోకంలో బ్రతుకుతున్నారు.
ఇంకా, మనుమరాళ్ళ వయసున్న ఇద్దరు అందమైన భామలతో పిచ్చి గంతులు వేయాలనుకోవడం, సీజీతో – కంప్యూటర్ గ్రాఫిక్స్ – ఫైట్లు చేయడం, ఐటెం సాంగ్స్, బూతు డైలాగులు, మరీ ఈ మధ్య పెరిగిన పౌరాణిక, దొంగ చారిత్రాత్మక, మతతత్త్వ కథలతో సినిమాలు చేయడం, వల్ల సిల్వర్ స్క్రీన్ మీద తేలిపోతున్నారు…
ఈ మధ్య చిరంజీవిని సినిమా ఫంక్షన్ల వేదికల మీద చూస్తే, ముఖంలో కళా కాంతి లేక దీనంగా ఉండడం చూస్తే, బాధ కలుగుతుంది. విశ్వంభర కోసం చేసిన ప్రోమోలో మోచేతులు అదో విధంగా కనిపించాయి.
నాకైతే, ఇప్పటికీ చిరంజీవి అంటే గలగలా పొంగే సెలయేరు వంటి ఉత్సాహం, విద్యుల్లతలా మెలికలు తిరిగే డ్యాన్సులు, విలన్ను చూస్తూ తూటాల్లా వదిలే డైలాగులే గుర్తుకొస్తాయి. ఆ చిరంజీవిని అలాగే ఉంచండి చిరంజీవి సార్!
మీరు నిజాయితీగా కూడా ఉండాలి. హిపోక్రసీ వదిలేయండి. రాజకీయ క్రీడల్లో బలి కాకండి. ఈ ర్యాట్ రేస్ మీకెందుకు సార్? మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. యూ ఆర్ ఏ లెజెండ్ సార్! యూ ఆర్ ఏ లయన్. లయన్ ఈజ్ ది కింగ్ ఆఫ్ జంగిల్! దట్సాల్!
Share this Article