.
నిన్నటి నుంచీ మనం ఇస్రో వార్తలు చెప్పుకుంటున్నాం కదా… శుభాంశ్ శుక్లాను ఇస్రో కాపాడిన నైపుణ్యం గురించి, ఇస్రో రాబోయే బాహుబలి 40 అంతస్థుల రాకెట్ గురించి… రాబోయే ప్రాజెక్టుల గురించి…
ఇప్పుడు ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
Ads
గగన్‌యాన్ పేరిట అంతరిక్షంలో ఇండియాయే తన స్వదేశీ పరిజ్ఞానంతో , సొంతంగా మానవ సహిత అంతరిక్ష యానానికి సంకల్పించిన సంగతి తెలుసు కదా… కానీ దానికన్నా ముందే ఓ మానవ రహిత అంతరిక్ష యానం ప్రాజెక్టు ఉంటుంది…
- అంటే… తొలి మానవ రహిత మిషన్ G1…, ఇందులో సగం-మానవరూప రోబో వ్యోమమిత్ర ఉంటుంది… (half humanoid robot) … ఇది వచ్చే డిసెంబర్‌లో ప్రయోగించబడుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెబుతున్నాడు…
గురువారం దేశ రాజధానిలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకొన్ని వివరాలూ చెప్పాడు… రీసెంటుగా అంతరిక్షంలోకి వెళ్లివచ్చాడు కదా శుభాంశ్ శుక్లా… తనే గగనయాన్ మానవ సహిత అంతరిక్ష యానానికీ ఎంపికయ్యాడు… గ్రేట్… ఆల్రెడీ తనకు అనుభవం వచ్చింది కదా…
‘‘ఐక్యరాజ్యసమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 13 లక్ష్యాలకు ఇస్రో సహకరిస్తోంది..,” అని ఆయన తెలిపాడు… ఆదిత్య L1 గురించి మాట్లాడుతూ, “ఈ సంవత్సరం మేము 13 టెరాబిట్ డేటాను విడుదల చేశాం,” అని అన్నాడాయన… సూర్యుని కక్ష్య నుండి ఉపగ్రహం తీసిన చిత్రాలను “అద్భుతమైన విజయం” అని అభివర్ణించాడు…
ఇటీవల ప్రయోగించిన నాసా- ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉపగ్రహం (నిసార్) “పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తోంది… అందులోని అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి..,” అని తెలిపాడు… రెండు మూడు రోజుల్లో నిసార్ చిత్రాలను ఇస్రో విడుదల చేయనుంది కూడా…
అవునూ, ఇంతకీ హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అంటే ఏమిటి..?
వ్యోమమిత్ర (Vyommitra):
వ్యోమమిత్ర అనేది రెండు సంస్కృత పదాల కలయిక… వ్యోమ (అంతరిక్షం) మిత్ర (స్నేహితుడు)… ఇది ఇస్రో రూపొందించి, అభివృద్ధి చేసిన ఒక మహిళా రోబో… గగన్‌యాన్ మానవ అంతరిక్ష యానానికి ముందు, వ్యోమమిత్రను మానవ రహిత పరీక్షా యాత్రలలో పంపనున్నారు…
ఈ రోబోకి కాళ్లు లేవు కాబట్టి దీనిని “సగం-మానవరూప రోబో” (half-humanoid) అని పిలుస్తారు… అయితే, ఇది ముందుకు, పక్కలకు వంగగలదు… మానవ రహిత గగన్‌యాన్ మిషన్లలోనే కాకుండా, వ్యోమమిత్ర వ్యోమగాములతో కలిసి మానవ సహిత మిషన్లలో కూడా ప్రయాణిస్తుంది…
వ్యోమమిత్ర యొక్క లక్షణాలు:
ఇది కృత్రిమ మేధస్సు (AI) తో పనిచేసే రోబో… ప్రయాణ సమయంలో ఉండే ప్రకంపనలను, షాక్‌లను తట్టుకోగలదు… ఇది మనిషిలాగా ముఖ కవళికలు, మాటలు, చూపును కలిగి ఉంటుంది.
ఈ రోబో అంతరిక్ష మాడ్యూల్ పారామీటర్స్ పర్యవేక్షణ, హెచ్చరికల జారీ, ప్రాణ రక్షణ ఆపరేషన్లను నిర్వహించగలదు… స్విచ్ ప్యానెల్‌లను ఆపరేట్ చేయడం, వ్యోమగాములకు తోడుగా ఉండటం, వారితో మాట్లాడటం, వారిని గుర్తించడం, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులను చేయగలదు…
గగన్‌యాన్ మిషన్ అంటే ఏమిటి?
గగన్‌యాన్ మిషన్ కింద, ఇస్రో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్ష్యలోకి మూడు రోజుల మిషన్ కోసం పంపి, వారిని సురక్షితంగా తిరిగి భూమికి తీసుకువస్తుంది… ఈ గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో అత్యంత విశ్వసనీయమైన, భారీ లిఫ్ట్ లాంచర్ మార్క్-3 (LVM3/GSLV Mk3) రాకెట్‌ను ఎంపిక చేశారు…
GSLV Mk3 అంటే ఏమిటి?
GSLV Mk3 అనేది ఇస్రో కొత్త హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్… ఇది తక్కువ ఖర్చుతో 4000 కిలోల ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రవేశపెట్టగలదు… GSLV MKIII (ఎత్తు 43.5 మీటర్లు, మొత్తం బరువు 640 టన్నులు) మూడు దశల వాహనం… ఇదీ సంగతి…
Share this Article