.
Mohammed Rafee
…. కేరళలో ఎందుకంత సింపుల్? మనవాళ్ళకు ఎందుకంత బిల్డ్ అప్?
నేషనల్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులు తిరువునంతపురంలో జాతీయ పాత్రికేయుల మహా సభలు తొలిసారిగా జరిగాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు నేను పాల్గొన్నాను. నన్ను బాగా ఆకర్షించిన అంశం ఒక్కటే ఇక్కడి రాజకీయ దిగ్గజాల వ్యవహార శైలి!
Ads
రాజకీయ నేతలు అంటే ప్రజా సేవకులు! ఆ అర్ధం మన తెలుగు రాష్ట్రాల్లో బొత్తిగా కనిపించదు! మన కార్పొరేటర్ కూడా చుట్టూ ఒక పాతిక మందిని వేసుకుని తిరుగుతుంటారు! చుట్టూ జనం లేకపోతే నామోషీగా భావిస్తారు.
ఇక ముఖ్యమంత్రి అయితే బ్లాక్ కమండోలు, పోలీస్ రోప్ పార్టీలు, సెక్యూరిటీ, వీరితో పాటు ఆయా పార్టీకి చెందిన నేతలు వంద మంది, ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వారి వ్యక్తిగత సిబ్బంది వెరసి సింగమోలే తరలి వచ్చే అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేస్తే గానీ మన నేతలకు కిక్ ఉండదు!
కానీ, కేరళలో ముఖ్యమంత్రి పినరై విజయన్ ఎంతో సింపుల్ గా ఉన్నారు! ఆయన వచ్చే పది నిముషాల ముందు నలుగురు పోలీస్ అధికారులు వచ్చారు. సభా వేదికను పరిశీలించారు. కనీసం అడియన్స్ చెక్ కూడా లేదు! ఆయన వచ్చారు! తెలిసిన పాత్రికేయులను కౌగిలించుకున్నారు! మాట్లాడారు, వచ్చినంత సింపుల్ గా వెళ్లిపోయారు!
అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత శ్రీ సతీషన్ ఇంకా సింపుల్ గా వచ్చారు. గన్ మెన్ కూడా లేరు! పూర్వ గవర్నర్ శ్రీధరన్ వచ్చారు చాలా సింపుల్ గా తనే డ్రైవ్ చేసుకుంటూ! ఆయన మిజోరామ్, పాండిచ్చేరి గవర్నర్ గా పని చేశారు! అసలు గన్ మెన్ హంగామా లేదు!
ఈ సభలకు ముందురోజు నేను హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అతిధిగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హిమాచల్ ప్రదేశ్, హరియాణా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఆరోజు చూడాలి ఆయన గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది, మిత్రుల హడావిడి! నిజానికి ఆయన జనం మనిషి! చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి! కానీ, పాపం గవర్నర్ అయ్యాక ఆయన కూడా కొన్ని ప్రోటోకాల్స్ పాటించక తప్పడం లేదు!
మరి, కేరళలో ఎందుకు అంత సింపుల్ గా ఉన్నారు నేతలు? పినరై విజయన్ అయితే వరస సియం! అయినా ఎంతో సింపుల్ గా ఉన్నారు! జనంలో కలసి పోయారు! ముఖ్యమంత్రి ఇలా ఉంటే ఇక ఇక్కడ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంకెంత సింపుల్ గా వుంటారో!
రాజ్యసభ సభ్యులు అచ్యుతన్ అయితే ఒంటరిగా వచ్చి రెండవ వరసలో నా పక్కన కూర్చున్నారు! ఆయన్ని వేదిక పైకి పిలిచినప్పుడు ఆయన రాజ్యసభ సభ్యులుగా చేశారని తెలిసింది! మీడియా అకాడమి చైర్మన్ అయితే లోపలకు సింపుల్ గా వచ్చి అడియన్స్ లో కుర్చీ కోసం వెతికి కూర్చొన్నారు!
ఇక పరిశ్రమల శాఖ మంత్రి పి. రాజీవ్, పూర్వ సాంస్కృతిక మంత్రి ప్రస్తుత ఢిల్లీలో అధికార ప్రతినిధి కె.వి. థామస్ నా ముందు వరసలో సింపుల్ గా కూర్చున్నారు! ఎప్పుడొచ్చారో ఏమో కానీ, వేదిక పైకి ఆహ్వానించినప్పుడు నాకు తెలిసింది!
నా ముందు కూర్చున్నది ఒకరు మంత్రి, మరొకరు మాజీ మంత్రి అని! ఇంత సింపుల్ గా ఎందుకు ఉన్నారని ఆరా తీస్తే, అక్కడ అందరూ అక్షరాస్యులే! అక్షరాస్యతలో కేరళ దేశంలోనే ప్రధమ స్థానంలో వుంది! ప్రతి ఇంట్లో చదువు ప్రధానం! చదువు కోవడమే అక్కడ ఆస్తి! (వామపక్ష పార్టీల్లో నేతలు, కార్యకర్తల వ్యక్తిగత జీవన వ్యవహార శైలి మీద కనిపించని పరిశీలన, కట్టుబాటు వాళ్లను పద్దతులు తప్పనివ్వదు)…
ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బంగళాలు, కాస్టలీ కార్లు, కాంట్రాక్టులు ఆస్థులు కాదు! ఎక్కువ చదివిన వారు గొప్పవాళ్ళు! అదే వారి ఆస్తి! రాజకీయ నాయకులు ఏం గొప్పవాళ్ళు కాదు! కేరళలో రాజకీయ నాయకులు అంటే కేవలం ప్రజా సేవకులు అంతే!
కేరళలో ఆటో డ్రైవర్ల నుంచి నర్సుల వరకు కష్టపడి హుందాగా జీవించే వారే! ఎదుటి మనిషిని మోసం చేసి జీవించాలనే తపన ఉండదు! ఎవరి హుందాతనం వారిదే! ఎవ్వరి చదువు వారిదే! ఎవ్వరి కష్టం వారిదే! ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారు, బతుకుతారు.
అందుకే రాజకీయ నేతలు కూడా అంత సింపుల్ గా ఉన్నారు! ప్రజలకు అంత దగ్గరగా ఉన్నారు! ముఖ్యంగా జవాబుదారి తనంతో ఉన్నారు! నాకు బాగా నచ్చేశారు! – డా. మహ్మద్ రఫీ – తిరువునంతపురం, కేరళ నుంచి
Share this Article