.
మొన్న ఒకాయన చెబుతున్నాడు… హైదరాబాదులోని ఓ ఫేమస్ పబ్… డ్రగ్స్ అడ్డా అంటుంటారు… రాత్రి 11 గంటలకు వస్తారు పాపులర్ హీరోలు కొందరు… ఎప్పుడో 2, 3 ప్రాంతాల్లో వెళ్లిపోతారు… తిరిగి ఎప్పుడు లేస్తారో వాళ్లకే తెలియదు…
చాలామంది సెలబ్రిటీలు రాత్రయిందంటే చాలు… సెలబ్రేషన్సే… సెలబ్రిటీలు అని అందుకే అంటారేమో హహ… పూర్తి భిన్నమైన కేరక్టర్ ఒకటి మనకు బాలీవుడ్‌లో కనిపిస్తుంది… అక్షయ్ కుమార్… కొన్ని అంశాల్లో తనను బీట్ చేసేవాళ్లు లేరు…
Ads
ఓసారి కపిల్ శర్మ తన షోలో చెబుతున్నాడు… ఒక హీరో తన స్టోరీ సిట్టింగులు పూర్తిచేసేలోపు అక్షయ్ కుమార్ తన సినిమా షూటింగూ పూర్తిచేసి, రిలీజ్ కూడా చేసేస్తాడు అని… అవును, పాసో ఫెయిలో జానేదేవ్… అదొక నటయంత్రం… మన సూపర్ స్టార్ కృష్ట తరహాలో… చక్రం గిరగిరా తిరుగుతూనే ఉండాలి…
రీసెంట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అంశాలు, అంటే జీవనశైలి మీద చెప్పుకొచ్చాడు… 6.30 – 7 గంటలకల్లా డిన్నర్ అయిపోతుంది ( ఏం తింటాడో చెప్పలేదు )… రాత్రి 10 – 10.30 గంటలకు పడుకుంటాడు… అంతే, ఇక ఎక్కడికీ వెళ్లడు… క్లబ్బులు, పబ్బులు, పార్టీలు మన్నూమశానం నథింగ్ డూయింగ్…
ఆదివారం రాత్రి డిన్నర్ ముగిసిందీ అంటే మళ్లీ మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ వరకు ఏమీ తినడు… కటిక ఉపవాసం సోమవారం మొత్తం… తన ఫిట్‌నెస్, ఎనర్జీ అందుకెే ఎప్పుడూ డిస్టర్బ్ కాలేదు… తన హోమ్ జిమ్ కూడా సింపుల్… తను బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడు… ఎక్కువగా వేలాడేవి అట… నాది కోతుల జిమ్ అంటాడు తను నవ్వుతూ…
ఎర్లీ డిన్నర్ విషయానికి వద్దాం… ‘‘ఇది చాలా ముఖ్యం… రాత్రి నిద్రపోయేటప్పుడు, మన కళ్ళు విశ్రాంతి తీసుకుంటాయి, మన కాళ్ళు- చేతులు, మన దేహం మొత్తం విశ్రాంతి తీసుకుంటుంది.., ఈ విశ్రాంతి చాలా ముఖ్యం… కానీ మనం ఆలస్యంగా ఆహారం తిన్నందున విశ్రాంతి తీసుకోనిది మీ కడుపు మాత్రమే… అది పనిచేస్తూనే ఉండాలి…
అందుకని నిద్రకు మూణ్నాలుగు గంటల ముందే తినేస్తే, కడుపు కూడా ఫ్రీ అయిపోతుంది… పడుకున్నాక అదీ విశ్రాంతి తీసుకుంటుంది, చాలా రోగాలకు కడుపు బాగా లేకపోవడమే కారణం, దాన్ని ఆరోగ్యంగా ఉంచాలీ అంటే దానికి సరైన విశ్రాంతి అవసరం… అందుకే నా ఎర్లీ డిన్నర్…’’ ఇదీ తన వివరణ… బాగుంది…
డాక్టర్లు కూడా చెబుతుంటారు కదా… ‘‘ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారం తిన్న వెంటనే పడుకోకుండా, కనీసం 2- 3 గంటల తర్వాత పడుకోవడం మంచిది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది…’’ దీన్నే అక్షయ్ ఇంకోరకంగా చెబుతున్నాడు… రోజూ మీరు పడుకునే సమయానికి 2- 3 గంటల ముందే డిన్నర్ చేసేయండి అని..!
ఈమధ్య చాలామంది IF అంటే intermittent fasting గురించి చాలా చెబుతున్నారు కదా… అంటే 12 గంటలు, 16 గంటలు లేదా 18 గంటలు… ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచేయాలి… దాని వల్ల వచ్చే ఆరోగ్య లాభాల గురించీ చాలా వీడియోలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, పోస్టులు కూడా కనిపిస్తుంటాయి…
అక్షయ్ చెబుతున్నది కూడా ఓరకంగా అలాంటిదే… సాయంత్రం 7 గంటల నుంచి తిరిగి పొద్దున 7 లేదా 8 గంటల బ్రేక్ ఫాస్ట్… అంటే 12, 13 గంటల ఇంటర్‌మెటెంట్ ఫాస్టింగ్ అమలు చేస్తున్నట్టే కదా…
ఇంకాస్త మెడికల్ పరిభాషలోకి వెళ్దాం...
‘‘ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి పట్టే సమయం మనం ఏమి తిన్నాం, ఎంత తిన్నాం, మన జీర్ణవ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంది వంటి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది…
కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు): చాలా త్వరగా జీర్ణమవుతాయి, దాదాపు 1-2 గంటల్లో… ప్రోటీన్లు: ఇవి జీర్ణం కావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది, సుమారు 3 గంటలు… (అఫ్‌కోర్స్, జీర్ణాశయం దాటాక ప్రేగుల గుండా ప్రయాణించే శోషణ సమయం మినహాయిస్తే…)
సో, ఎర్లీ డిన్నర్ తరువాత 3 గంటల టైమ్ ఇచ్చి నిద్రపోతే… కడుపులో జీర్ణరసాల రిలీజ్ కూడా ఆగిపోయి, జీర్ణక్రియ ఆగిెపోయి, కడుపు రిలాక్స్ అవుతుంది… అక్షయ్ కుమార్ చెప్పిందీ ఇదే… వారానికి ఒకరోజు కటిక ఉపవాసంతో ఫలితాలుంటాయా..? ఆచరణీయమేనా, అనుసరణీయమేనా..? అది మరోసారి చెప్పుకుందాం…
Share this Article