.
కమర్షియల్ వాసనలు గుప్పించి… అనగా నానా చెత్తా నింపేసే సినిమాలు బోలెడు… టాప్ హీరోల సినిమాలన్నీ అంతే… సమాజానికి నయాపైసా పనికిరావు, పైగా కల్చరల్ కాలుష్యం కూడా… విచిత్రంగా అవే వేల కోట్లను కొల్లగొడుతుంటాయి…
కొన్ని ఆలోచనాత్మక సినిమాలు వస్తుంటయ్ అడపాదడపా… కానీ వాటికి థియేటర్లు దొరకవు, దొరకనివ్వరు, ప్రేక్షకులు కూడా దొరకరు… అఫ్‌కోర్స్, కథ, ఉద్దేశం మంచిదే అయినా ప్రజెంటేషన్ రక్తికట్టకపోవడం కూడా ఓ కారణమే…
Ads
మనం పరదా అనే సినిమా విషయానికి వద్దాం… గుడ్… మంచి కాన్సెప్టు… ఓ కథ రాసుకుని, అన్యాపదేశంగా స్త్రీ స్వేచ్ఛకు, ఆలోచనలకు ఎలా సమాజం పరదాలు కట్టేస్తుందనేది దర్శకుడు చెప్పాలనుకున్న విషయం… కాన్సెప్ట్ వైజ్ గుడ్…
కథేమిటంటే..? ఓ ఊరు… దానికి ఓ శాపం… అందరూ పరదాలు కట్టుకుని ఉండాలి, మొహాలు కనిపించకూడదు… కనిపిస్తే ఆ ఊరి ఓ దేవతకు ఆత్మాహుతి ఇవ్వాల్సిందే… సరే, ఓ ఫిక్షన్… చెప్పాలనుకున్న అసలు పాయింట్ వేరే కాబట్టి వోకే…
ఈ కథలో కథానాయిక సుబ్బు (అనుపమ పరమేశ్వరన్), అనుకోకుండా ఆమె పరదా తొలగిపోయి ఆమె ముఖం బయటపడుతుంది… దీంతో గ్రామస్తులు ఆమెను బలివ్వాలని నిర్ణయించుకుంటారు… ఒరే, నన్ను నమ్మండిరా అంటుంది ఆమె… నిరూపించుకో లేదా స్వీయబలి ఇచ్చుకో అంటుంది ఊరు… నేపథ్యంలో కథానాయిక లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది…
ఆమె ఎలా నిరూపించుకుందో చెబుతూనే… స్త్రీ ఇంకా పరదాలు కట్టుకునే బతకమంటోంది ఈ సొసైటీ అని చెప్పడం దర్శకుడి ఆలోచన… పేరు ప్రవీణ్ కండ్రేగుల… గతంలో సినిమా బండి, శుభం తీశాడు… ఈ పరదా ప్రయత్నంలో సగమే సక్సెసయ్యాడు తను…
ఎందుకంటే..? ప్రేక్షకులకు తనేం చెప్పదలుచుకున్నాడో సరిగ్గా ఎక్కదు… చాలాచోట్ల అసహజంగా అనిపిస్తూ ఉంటుంది… అందుకని కనెక్ట్ కాడు సగటు ప్రేక్షకుడు… ధర్మశాల ప్రయాణం మొత్తం ఏదో వ్లాగ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది… గెస్ట్ పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ తో చెప్పించిన పక్షి, స్వేచ్ఛ కాన్సెప్ట్ అసంబద్ధంగా ఉంది… ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు…
ఎస్, అనుపమ పరమేశ్వరన్ మంచి నటే… కానీ ఆమెకు ఇన్నాళ్లూ ఎప్పుడూ ఓ సరైన రోల్ పడలేదు… అన్నీ ఏవేవో గ్లామరస్ రోల్స్ చేసేది… ఇందులో మాత్రం మంచి పాత్ర దొరికింది… బాగా చేసింది… తోడుగా దర్శన రాజేంద్రన్, సంగీత పాత్రలకు తగినట్టు నటించారు…
గోపీ సుందర్ అందించిన పాటలు పర్వాలేదు అనిపించినా, నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు… సినిమాలోని విజువల్స్, ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని చూపించిన విధానం బాగుంది…
Share this Article