.
( రమణ కొంటికర్ల )
…….. అది కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలతో కూడిన టెహ్రాన్ శివారులో పారిశ్రామిక ప్రాంతం. ఓ మట్టిరోడ్డుపైన ఓవైపు లోయలు, మరోవైపు కొండలతో ఓ రేంజ్ రోవర్ కారు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంటుంది. షేవింగ్ చేసుకోకుండా లైట్ గా నెరిసిన తెల్లగడ్డపు ఆనవాళ్లతో…
ఓ నడివయస్కుడు బహుదూరపు బాటసారై దారివెంట ఎవరి కోసమో వెతుక్కుంటూ ఆ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా టెహ్రాన్ టౌన్ లోని లేబర్ అడ్డా నుంచి మెల్లిగా మొదలైన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న క్యారెక్టర్ పేరు మిస్టర్ బాది.
Ads
బాది వెళ్తుంటే లేబర్ అడ్డాలో… పనేమైనా దొరుకుతుందా సార్ అంటూ కొందరు అడుగుతూ వెంటపడతారు. కానీ, బాది మారుమాట్లాడడు. తనకు కావల్సిన వ్యక్తినెంచుకోవడంలో బాదిలో ఓ క్లారిటీ ఉండి ఉంటుందనేది మనకు అతడి కవళికల ద్వారా దర్శకుడు చెబుతూ ఉంటాడు. అతడెందుకు అలా ప్రయాణిస్తున్నాడు… ఎవరి కోసం వెతుకుతున్నాడు… తన లక్ష్యమేంటన్నవి మాత్రం వీక్షకుడు ఆరంభంలో పట్టుకోలేడు.
అనుకోకుండా బాదికి ఓ కుర్దిష్ యంగ్ సర్వీస్ మ్యాన్ కలుస్తాడు. అతణ్ని కారెక్కించుుకున్న బాది.. నీకెలాంటి ఆర్థిక సమస్యలున్నా నేను తీరుస్తాను. అంత డబ్బు నీకిస్తాను. కానీ, నేను చెప్పిన పని చేయాలంటూ.. నూనుగు మీసాలు కూడా రాని ఆ యువకుడికి చెబుతూ ఉంటాడు.
ఆ సందర్భంలో బాది ఓ హోమోసెక్సువలా అనే ఒక ఫీల్ ను వీక్షకుల్లో దర్శకుడు ఉద్ధేశపూర్వకంగా క్రియేట్ చేసేలా ఆ సీన్ ఉంటుంది. ఆ తర్వాత తన పర్పస్ ఏంటో చెప్పేవరకూ కూడా ప్రేక్షకుడు అదే ఫీల్ కల్గి ఉండేలా ఆ షాట్ క్రియేషన్ ఉంటుంది.
బాది ఇక తన జీవితాన్ని చాలించాలనుకుంటాడు. ఎందుకలా అనుకుంటాడు.. అతడికి అంతకుమునుపేం జరిగింది వంటి ఏ అంశాన్నీ దర్శకుడు చెప్పడు. కానీ, మరణం చుట్టూ తిరిగే కథే… ఈ టేస్ట్ ఆఫ్ చెర్రీ.
తన జీవితాన్ని చాలించాలనుకునే బాదీ ఆ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ శ్మశానంలో… తన కోసం ఓ గుంత తవ్వి పెడుతాడు. తాను పిల్స్ మింగి రాత్రి ఆ గుంతలో పడుకుంటాను. ఉదయాన్నే వచ్చి నన్ను పిలువు. ఒకవేళ నేను పలికితే నన్ను పైకి తీసుకురా… లేకపోతే, మట్టితో ఆ గుంత కప్పేయ్. అలా చేస్తే నీకు 20 వేల టోమన్స్ ఇస్తానని సదరు యువకుడికి చెబుతాడు. కానీ, ఆ యువకుడు భయపడి పారిపోతాడు.
ఆ తర్వాత మరొక ఆఫ్ఘన్ కుర్రాడు కలుస్తాడు. తననూ తన కారు ఎక్కించుకుంటాడు. కానీ, ఖురాన్ ప్రకారం ఆత్మహత్య పాపం కాబట్టి.. తాను కూడా ఒప్పుకోడు. ఇక మరొకరి కోసం బాది సెర్చింగ్ ఆపరేషన్ మొదలవుతుంది.
బాదికి ఓ ట్యాక్సీ డెర్మిస్ట్.. అంటే జంతువులు, పక్షుల మృతదేహాలు, చర్మాలను ప్రిజర్వ్ చేసే మరో వ్యక్తి కలుస్తాడు. అతడి పేరు బాఘేరి. తానో మ్యూజియంలో పనిచేస్తూ ఉంటాడు. అతడికీ తన కథ చెబుతాడు బాది. కానీ, అనారోగ్యంగా ఉన్న తన కొడుకు హాస్పిటల్ ఖర్చులకు.. ఆ వృద్ధుడు ఒప్పుకుంటాడు. కానీ, ఆ ముసలోడు జీవించడంలో మజాను ఎలా ఆస్వాదించవచ్చో చెబుతాడు.
తానూ ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. ఓ మల్బరీ చెట్టుకు రోప్ కట్టి బలవన్మరణం కోసం యత్నిస్తున్న సమయంలో మల్బరీ పండు తిన్నాక ఆ రుచి తనకు జీవితేచ్ఛ కల్గించిందంటాడు. అంతవరకూ మరణేచ్ఛతో ఉన్న తనను ఒక్క మల్బరీ పండు ఎలా మార్చిందో చెప్పే ఆ బాఘేరీ మాటలు జీవితం గురించి చాలా గొప్పగా ఉంటాయి.
ఆ సంభాషణల్లో మరణం అంచున నిలబడ్డ బాది వినడానికి మాత్రమే పరిమితమైతే… బాఘేరీ మాత్రం జీవితం మీద ఆశ కల్పించేందుకు చెప్పే మాటలు సానుకూల దృక్పథాన్ని కల్పించేలా సాగుతాయి.
మరణిస్తే వెచ్చని ఉషోదయాన్ని చూడగలవా.. పండ్లు, పూలు, మొక్కలు, ప్రకృతి, సూర్యాస్తమయం.. ఇలాంటి సీన్స్ చూడ్డం మళ్లీ కుదురుతుందా… సమస్యలు సర్వసాధారణం.. సమస్యలేని మనిషే ఉండడు.. అంతమాత్రం చేత బలవన్మరణానికి పాల్పడటం తప్పని చెప్పే యత్నం చేస్తాడు.
ఆత్మహత్య ఎప్పుడూ ఓ ఎంపిక కాకూడదని నచ్చజెప్పుతాడు. అవన్నీ విన్నంతసేపు బాదిలో ఏదో ఆలోచనలు కనిపించినట్టనిపించినా.. తన లక్ష్యం పట్ల తాను క్లియర్ గా ఉంటాడు.
ఇక చివరగా ఏమవుతుందన్నది సినిమా చూస్తేనే ఓ థ్రిల్! సినిమా చివర్లో దర్శకుడు, అతడి బృందం సినిమా చిత్రీకరణ చేసిన కొన్ని ఘట్టాలను.. ట్రంపెట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చూపిస్తారు.
జీవితం ఒక వేడుక.. సెలబ్రేషన్… ఆనందం.. అనుభూతి… జీవితాన్ని యథావిధిగా స్వీకరించాలని కవితాత్మకంగా ఎన్నైనా చెప్పొచ్చు. సానుకూల దృక్పథానికి ఈ మాటలన్నీ ప్రతీకలు. కానీ, అదే జీవితాన్ని చాలించాలనుకున్నప్పుడు… ఓ దారి ఉండాలిగా..?
అందుకు మరణమే శరణ్యం! ఆ మరణాన్ని ఆహ్వానించేందుకు ఆత్మహత్య చేసుకోవడం సరైందా…? ముమ్మాటికీ కాదు. అయితే, అదే సమయంలో అవసరమైతే మరణాన్నీ ఆహ్వానించేందుకూ అవకాశముండాలన్నదే అబ్బాస్ కియరోస్తామి అంతర్లీన భావనేమో!
జీవితం… మరణం.. ఇవే ఇతివృత్తంగా తిప్పుతూ… కేవలం సింగిల్ డివిజన్ షాట్స్ తో.. బాది మాట్లాడుతున్నప్పుడు పక్క సీటులో కెమెరా పెట్టి తనను మాత్రమే క్లోజ్ అప్ లో చూపించడం.. బాదితో పక్కసీటులో వ్యక్తి మాట్లాడినప్పుడు బాది కోణంలో మరో వ్యక్తిని చూపించడం… లోయల్లోని ఎత్తువంతలను జీవితానికి అన్వయించేలా సుదీర్ఘంగా సాగుతున్న రేంజ్ రోవర్ కారు ప్రయాణాన్ని లాంగ్ షాట్స్ లోనూ, ఏరియల్ షాట్స్ లోనూ చూపించిన విధానం సినిమాలో హైలెట్స్. మొత్తంగా జిగ్ జాగ్ గా ఉండే గ్రామీణ రోడ్లను జీవితపు మలుపులకు ప్రతిబింబంలా చిత్రీకరించాడు.
పరిమిత వనరులు, తక్కువమంది నటులతో ఓ డాక్యుమెంటరీని తలపించేలా ప్రముఖ ఇరానియన్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాస్ కియరోస్తామి తీసిన సినిమా టేస్ట్ ఆఫ్ చెర్రీ. ఒకే ఒక్క కారులో ప్రయాణమంటే సాధారణంగా బోరింగ్ గా ఫీలవుతాం. కానీ, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో టేస్ట్ ఆఫ్ చెర్రీ మాత్రం ఆసాంతం చూసేస్తాం.
ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నట్టనిపించింది. ఆయనవి సూసైడల్ థాట్సా అని ముందు భావించే మన చిత్తభ్రమలోనుంచి.. కాదు, అంతకుమించిన ఆలోచనలనే భావనలోకి మనల్ని మళ్లిస్తాడు డైరెక్టర్.
ఇరాన్ లో ఉన్న నిషేధాజ్ఞల నుంచి బయటపడి కేన్స్ ఫెస్ట్ కు హాజరైన అబ్బాస్ కియరోస్తామి… కేన్స్ ఫిలిం ఫెస్ట్ లో నడిచివస్తుంటే… టేస్ట్ ఆఫ్ చెర్రీ వీక్షించిన క్రిటిక్స్ అంతా లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట.
బాదిగా నటించిన హోమాయున్ ఎర్షాది నటనతో పాటు.. ఇరాన్ గ్రామీణ అందాలను అద్భుతంగా బంధించిన హోమాయున్ పేవర్ కెమెరా… అబ్బాస్ కియరోస్తామి దర్శకత్వం వంటివి టేస్ట్ ఆఫ్ చెర్రీకి 1997 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రతిష్ఠాత్మక పామ్ డి’ఓర్ పురస్కారాన్ని కట్టబెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రం Taste of Cherry.
రొడ్డకొట్టుడు సినిమాలకు అలవాటు పడిన ప్రాణాలు చూడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇదేం సినిమా అని తిట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ, సినిమాను ఓ పరిశోధనలా భావించేవాళ్లకు బాగా నచ్చుతుంది ఈ ఫిల్మ్.
MUBIలో ఉంది చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ లోనూ అందుబాటులో ఉన్నట్టుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరానియన్ ఫిల్మ్ ఇది. చూసినవాళ్లూ మళ్లీ చూడొచ్చనే సినిమా Taste of Cherry…
Share this Article