.
ఉస్మానియా విశ్వవిద్యాలయం… తెలంగాణ మణిమకుటం… సుదీర్ఘ చరిత్ర కలిగిన విద్యాకేంద్రం… చైతన్య దీప్తి కూడా..! ఇంకా దానికి పరిచయం అక్కర్లేదు… కొత్తగా ప్రశంసలూ అక్కర్లేదు… కాకపోతే ఇప్పుడెలా మారింది అనేది ఓ పెద్ద డిబేట్…
ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశం అవుతోంది…? కొత్త హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్తున్నాడు… 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టళ్లను ప్రారంభిస్తాడు… దీంతో పాటు ‘సీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ పథకం ప్రారంభం… గిరిజన విద్యార్థుల కోసం మరో రెండు హాస్టళ్లకు కూడా శంకుస్థాపన… డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం ప్రారంభం…
Ads
అనేక జేఏసీలు, అనేక శిబిరాలు… ఆవేశాలు… డిమాండ్లు… సో, సహజంగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, తప్పదు… ఐతే వారం రోజులుగా అందరూ రాస్తున్నారు… 20 ఏళ్ల తరువాత తొలిసారి ఒక ముఖ్యమంత్రి ఓయూకు వస్తున్నాడు అని…
కానీ కరెక్టు కాదు… విద్యార్థుల నిరసనలు ఉంటాయనే సందేహంతో కేసీయార్ ఓయూకు వెళ్లేవాడు కాదు… తన నిరాహారదీక్ష విరమణ ఓ ప్రహసనంలా ముగించేసరికి… ఓయూ విద్యార్థులే దాన్ని నిరసిస్తూ ఉద్యమమంటను అంటించారు… ఆ కచ్చ ఓయూ విద్యార్థుల మీద ఉన్నట్టుంది కేసీయార్‌కు… అందుకే ఓయూ మీద పూర్తి నిర్లక్ష్యం…
కానీ తన పదవీకాలంలో ఓసారి వెళ్లాడు… అది నిజం… ఇదీ రుజువు…
President Pranab Mukherjee with Chief Minister K. Chandrasekhar Rao inaugurates the centenary celebrations of Osmania University in Hyderabad on Wednesday as Union minister Bandaru Dattatreya, TS education minister Kadiam Srihari (right) and MP K. Keshav Rao, OU vice-chancellor S. Ramachandram (left) ….. (27 April 2017)…
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల సందర్భపు చిత్రం ఇది… అనేక ఆంక్షల నడుమ ఈ వేడుకలు నిస్తేజంగా ముగిశాయి. యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, అలాగే యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు… ఇద్దరూ ప్రసంగించాల్సి ఉన్నా, వారికి మాట్లాడే అవకాశం రాలేదు, ఇవ్వలేదు…
కార్యక్రమ ఆహ్వాన పత్రికలో గవర్నర్, ముఖ్యమంత్రి ప్రసంగాలు ఉంటాయని స్పష్టంగా ముద్రించినా, ఎటువంటి కారణాలు చూపించకుండానే వాటిని హఠాత్తుగా రద్దు చేశారు… విద్యార్థుల నిరసన నినాదాలు ఉంటాయనే సందేహాలతో..! రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం తర్వాత కార్యక్రమం త్వరగా హడావుడిగా ముగిసింది… ఓయూ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు కేసీయార్ నుండి ఒక భావోద్వేగపూరిత ప్రసంగాన్ని ఆశించారు… కానీ అది జరగలేదు…
ఇక్కడే మరొక విశేషం చెప్పుకోవాలి… 2012లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కెరటంలా విరుచుకుపడుతున్న రోజులు… విద్యార్థుల ఆగ్రహావేశాలతో రోజూ యూనివర్శిటీ నిప్పుల కుంపటిలా ఉండేది మరి… ఉమ్మడి పాలకులు పోలీసు బలగాల మొహరింపు, విద్యార్థులపై నానా ఆంక్షలు, కేసులు, వేధింపులు… అదొక రణస్థలి అప్పట్లో…
- ఓసారి దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, దయాకర్‌రావు, నాగం జనార్దనరెడ్డి వెళ్తే, వాళ్ల మీద విద్యార్థుల దాడి జరిగింది… నాగం బాగా గాయపడ్డాడు కూడా… (ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు టీడీపీ క్యాంపే… ఓయూ వెళ్లిన టీమ్‌లో తను కూడా ఉన్నాడు… తన మీద దాడి జరగలేదు, ప్రధాన బాధితుడు నాగం… కానీ నాడు ఆ దాడి జరిగిన క్యాంపస్‌కే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పర్యటన, ఘన స్వాగతం… అదీ అసలు విశేషం)…
Share this Article