Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెంకులు పగిలినా, ఇంటివాడు తిడితే అదొక ఆనందం..! (నగునూరి శేఖర్)

August 27, 2025 by Rishi

వినాయక చవితి జ్ఞాపకం
—————–
చవితి పండుగ వచ్చిందంటే.. మా పిలగాండ్ల సంబురమే వేరుగా ఉండేది..
పల్లెటూర్లలో వినాయక చవితిని చవితి పండుగ అని పిలిచేవాళ్ళు.. పొలాల
అమావాస్య పోయినంక నాలుగు రోజులకు వచ్చేది చవితి పండుగ..

వెనుకట ఊర్లల్లో బ్రాహ్మణులు, కోమట్లు,
వడ్ల, కమ్మరి, కంసాలి మొదలగు విశ్వబ్రాహ్మణులుమాత్రమే వినాయకుణ్ణి
పెట్టి పూజించే వారు. ఆ తర్వాత రోజుల్లో చదువుకున్న వారిలో కొందరు ఇళ్ళలో
వినాయకుడిని పెట్టి పూజించడం మొదలైంది. ఇప్పటిలాగా ఊరూరా, వాడవాడ లవినయకులను ప్రతిష్టించి మండపాలు ఏర్పాటు చేసి నవ రాత్ర్తులు జరిపి నిమజ్జనం చేయడం ఉండేవి కావు.

మా ఊరుమంథని మండలం గాజులపల్లె. నా చిన్నపుడు అంటే అరవై, డెబ్బయ్ దశకాల నాటిమాట. మా ఉల్లో ఒకే ఒక పానాది (వాడ ) అటూ..ఇటు.. ఇళ్ళు ఉంటాయి.మేముండే పానాదిల్నే మా వడ్ల రాజీరు ఇల్లు ఉండేది. వడ్రంగులను ఊళ్లల్లో వడ్లోల్లు అంటారు. మంచి పెద్ద చింత చెట్టు ఆ చెట్టు నీడన చిన్న పర్ణశాల లాంటి గుడిసె కాదు, కానీ మట్టిల్లు ఉండేది రాజీరుకు.

Ads

పొద్దంతా రాజీరు ఆ చింత చెట్టు
కింద రైతుల నాగళ్ళు, గుంటుకలు, గొర్లు, బండ్లు సవరించడమో, కొత్తవి చేయడమో
వ్యవసాయ పనులు లేనపుడు ఇతర వడ్రంగం పనులు చేసుడో జరిగేది. పగలు, రాత్రి ఆ చింత చెట్టు కింద ఎప్పుడు చూసినా ఇరవయి ముప్పయ్ మందికి తక్కువ ఉండే వారు కాదు. రాత్రి అయతే ఆ చింత చెట్టే మాకు వినోదం కలిగించే ప్రదేశం అయ్యేది.

రాజీరు మంచి పనివంతుడే కాకుండా కళాకారుడు కూడా. మా ఉల్లో చిడ తల రామాయణం నేర్పించే గురువు. కోలాటం కూడా వేయంచే వాడు. అయన గురువుగా చిరుతల రామాయణం వేసి పట్టాభిషేకం కట్టిన వాళ్ళలో నేను కూడా ఒకడిని.

రాజీరు నోరు తెరిస్తే దాని నుంచి వచ్చే మాట పక్కున నవ్వించే జోకో.. లేక పాటో అయ్యేది. అందుకే ఎప్పుడూ ఆయనతో జన సమూహం ఉండేది. చవితి పండుగ వస్తుందంటే వడ్ల రాజీరు రెండు రోజుల ముందే నల్ల రేగడి మట్టి తెచ్చి చింత కింద కుప్ప పోసే వాడు.

మట్టి మెత్తగా చేసి కుప్ప చేసి మద్యలో గుంటగా ఉంచి నీల్లు పోసి నాన
బెట్టి మట్టిని మెత్తగా పిసికి వినాయకులను చేసేవాడు. చవితి పండుగ నాడు
రాజీరు భార్య రాధమ్మ ప్రొద్దున్నే ఎర్ర మట్టితో ఇల్లంతా అలికేది. ఆ తర్వాత తలారా స్నానం చేసి ముగ్గులు వేసి పసుపు, కుంకుమల బొట్లతో ఆ
పర్ణశాల లాంటి మట్టి ఇంటికి పండుగ వాతావరణం తీసుకవచ్చేది. అప్పుడు
రాజీరు చింత కింద నాన పెట్టిన నల్ల మట్టిని అలుకుతో అలంకరించిన అరుగు మీదకు చేర్చి వినాయకులనుతయారు చేసేది.

మా ఇంటికి కూడా రాజీరే పూజకు వినాయకుడిని చేసిచ్చే వాడు. ప్రొద్దున్నే స్నానం చేసి నేను మా తమ్ముడు సత్యం వడ్ల రాజీరు ఇంటికి పోయ్ గణపతి బొమ్మలు మేమే తీసుకు వొస్తమని ఇంట్లో గొడవ చేసేవాళ్ళం.

రాజీరు నల్ల మట్టిని దేవుని విగ్రహంగా మలిచే తిరు నిజంగానే మనిషికి రూపం
పోస్తున్నట్లుగానే ఉండేది. ఆయన చేతుల్లో నల్ల మట్టి అరగంటలోనే వినాయకుడితో పాటు రెండెడ్లు, ఒక ఎలుక, ఎలుకకు వినాయకుడికి ఉండ్రాళ్లు పెట్టే రెండు ప్లేట్లుగా రూపం దాల్చేది.

వినాయకుని తల గుండ్రంగా పెట్టి దాంట్లో నుంచే చూపుడు, మద్య , బ్రొటన
వేళ్ళను ఉపయోగించి తొండం ఆకృతిని రూపు దిద్దీనపుడు ఆ వెళ్ళ మద్య మట్టి
దారం లాగా వచ్చి అపురూపంగా కనిపించేది. అలా మట్టి వినాయకుని విగ్రహం గాఅయన చేతుల్లో తయారవుతుంటే మా కంటి మిద రెప్ప పడేది కాదు.

వినాయకుడిని తయారు చేసిన తర్వాత ఆ విగ్రహం నెత్తిన దొడ్డు చీపురు పుల్లను ఉంచి పైన మట్టితో తయారు చేసిన చత్రిని కూడా అలంకరించేవాడు. ఆ తర్వాత వినాయకునికి, ఎలుకకు, ఎడ్లకు తెల్ల జొన్న గింజలను కళ్ళుగా అమర్చి తీర్చి దిద్దడం
రాజీరుకే సాధ్యం అనిపించేది.

దొడ్డు బియ్యం గింజలను ఆ వినాయకుడికి
దంతలుగా పెట్టి జాజు రంగు తో నోటిని చిత్రీకరించే వాడు. తెల్ల జొన్న
గింజలను కండ్లుగా పెట్టిన తర్వాత వినాయకుడు, ఎడ్లు , ఎలుక నిజంగా అవి
మమ్మల్ని చూసినట్లే అనిపించేది.

వినాయకుడు సిద్దమైన తర్వాత కడిగిన కట్టె పీట మీద మోదుగా ఆకులు పెట్టి వినాయకుడిని, ఎడ్లను, ఎలుక, ఉండ్రాళ్ళ
పల్లెములు ఉంచి రాజీరు మా ఇంటికి తీసుక వచ్చి అప్పగించే వారు.

నాకు తెలిసి మా ఉల్లో మూడు, నాలుగిల్లలోనే వినాయకుడిని పెట్టి పూజించే వాళ్ళం. మా బాపు వినాయకుడికి పూజలు చేస్తే మా అవ్వ వంటలు, నైవేద్యాలు , శావాల (సేమియా) పాయసం, దోసకాయతో చేసిన ఊరగయ, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఉండ్రాళ్లు, కుడుములు తయారు చేసేది.

వినాయక చవితి రోజు పప్పు వండితే అప్పు అయితరనే విశ్వాసాలుండేటివి. అందుకే ఆ రోజు ఎవరూ ఇంట్లో
పప్పు వండేవారు కాదు. వినాయకుడిని ఇంట్లోకి ఆహ్వానిచేందుకు జాజు ,
సున్నం విడివిడిగా నీళ్ళలో కలిపి చిన్న గుడ్డ ముక్కతో తెలుపు, జాజు
రంగులతో గుండాలు ( సున్నాలు ) గీసే వారు. వీటిని వినాయకుడి ఆడుగులుగా
చెబుతారు. ఇలా గిస్తే వాటి మీదుగా వినాయకుడు ఇంట్లోకి నడిచి వస్తాడని
నమ్మకం.

ఆంధ్రలో వేరు, ఇది కృష్ణాష్టమి వేడుక. అలాగే పూజ కోసం తయారు చేసిన కుడుములు, ఉండ్రాళ్ళను ఆకు
దోప్పల్లో పెట్టి ఇంటి కప్పు పైన చూర్లలో ధాన్యపు గరిసెల వద్ద మారుమూల
ప్రాంతాల్లో పెడతారు. వీటిని ఆయా ప్రాంతాల్లో తిరిగే ఎలుకలు ఆరగిస్తాయని
భావించి వాటి కోసం అలా ఉంచుతారు. వినాయక చవితి రోజు ఆ రోజుల్లో మమ్మల్ని పొద్దు గూకితే చాలు బయటకు వేల్లనిచ్చే వాళ్ళు కాదు. చవితి రోజు
చంద్రుడిని చూస్తే నిలాపనిందలు పడతాయని బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టం చేసేవారు.

రాత్రి అయిందంటే పల్లెటూర్లలో వినాయక చవితి రోజు ఇండ్ల lపైన రాళ్ల వర్షం పడేది. వర్షం అంటే నిజమైన వర్షం కాదు. పక్కింటి వారో , ఎదురింటి వారో, మరెవరో ఇళ్ళ మిద రాళ్ళూ విసిరే వారు. దీంతో ఆ రాళ్ళతో ఇంటి పైకప్పుగా ఉన్న గూన పెంకులు పగలడంతో ఇంటి యజమానులు తిట్ల దండకం అందుకునే వారు. వినాయక చవితి రోజు ఇతరుల ఇళ్ళ పైకి రాల్లు విసిరి వారిచేత తిట్లు తిన్న వారికీ శుభం జరుగుతుందని పల్లెల్లో నమ్మేవారు కనుక అల రాళ్ళూ వేసే సంప్రదాయం కొనసాగేది. కొందరు పండుగ రూపంలో పగ ఉన్నవాళ్ళ ఇంటి పైకి రాళ్ళూ విసిరి తమ కోపాన్ని తీర్చుకునే వారు. పైగా పుణ్యం,
పురుషార్ధం రెండు దక్కుతాయని పగ ఉన్న వారి ఇళ్ళ పైనే రాళ్ళూ వేసే వారు…

ఇంట్లో పాఠశాలకు వెళుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వారి పుస్తకాలు, కాపీలు,
పెన్నులు వినాయకుడి పూజలో ఉంచే వారు. అలా చేస్తే పిల్లలకు విద్యాబుద్దులు
సక్రమంగా అలవడుతాయని నమ్మేవారు. వినాయక చవితి రోజు దేవుడిని అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయమే స్నానం చేసి, మరోసారి దేవుడిని పూజించి కొబ్బరికాయ కొట్టి దేవుడిని ఎత్తుకునే వారు. ఎత్తుకోవడంఅంటే పూజ స్థలం నుంచి దేవుడి విగ్రహాన్ని తీసి నిమజ్జనం కోసం పక్కకు పెట్టడమే.

నిమజ్జనం అంటే యీ రోజుల్లో లాగా హంగు ఆర్భాటాలు, అట్టహాసాలు ఏమి ఉండేవి కాదు. వినాయకుడి మట్టి విగ్రహాన్ని తీసుకుని ఇంటి పెద్దో లేక అయన భార్యో ఇంటి పక్కనే ఉన్న బీర, చిక్కుడు చెట్ల వద్దకు వెళ్లి వాటి పాదు మొదల్లల్లో మట్టి విగ్రహాన్ని ఉంచే వారు. చెట్ల పాదుల్లో పెడితే వాటిని ఎవరు ముట్టరని భావించే వారు. అలాగే చిన్న, చితక వర్షం కురిస్తే మట్టి విగ్రహం కరిగి మల్లీ మట్టిలోనే కలిసి పోతుందని అలాచేసే వారు. దాంతో తమకు పంటలు కూడా బాగా పండుతాయని నమ్మేవారు.

ఇప్పుడయతే పల్లెల్లో యీ ఆచారాలు నమ్మకాలూ ఏవి లేవు, కానీ భక్తితోనో ఒకరిని చూసి ఒకరు ఎవరి వాడ, ఎవరి ఉరు గొప్పదో చాటుకోవడానికి ఉరూరా, వాడవాడలా వినాయక మండపాలు వెలుస్తున్నాయి.

.

అన్నట్లు మా ఊర్లో కూడా మూడు, నాలుగుచోట్ల వినాయక విగ్రహాలు పెట్టుడే కాకుండా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే నాకు మాత్రం వినాయక చవితి అంటే గుర్తుకు వచ్చేది వడ్ల రాజీరు, అయన జీవించిన మట్టి ఇల్లు, కళాక్షేత్రం గా విలసిల్లిన చింత చెట్టు, అయన చేతిలో అందంగా రూపు దిద్దుకున్న మట్టి వినాయకుడు, ఎడ్లు, ఎలుక,ఉండ్రాళ్ళ పల్లెములు మాత్రమే. అన్నింటికీ మించి
వడ్ల రాజీరు స్మృతులు…!! ( నగునూరి శేఖర్)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…
  • రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)
  • మోస్సాద్ వదిలేసిన ఏకైక టార్గెట్… ఎవరు అతను.. !? ( రమణ కొంటికెర్ల )
  • పెంకులు పగిలినా, ఇంటివాడు తిడితే అదొక ఆనందం..! (నగునూరి శేఖర్)
  • ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
  • అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
  • ర్యాప్ అస్త్రంగా ఓ యువతి చైతన్య పోరాటం..! (రమణ కొంటికర్ల)..
  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions