ఏమిటి..? మరీ బజారులో నిలబడి బరిబాతల పోతురాజులా కొరడాతో కొట్టుకుంటున్నదేమి..? ఈ వికృత నర్తనం ఏమిటి..? అని పాఠకులు చాలామంది ఏవగించుకుంటున్నారు గానీ, తెలుగుదేశం పుట్టిన కొత్తలోనూ అంతే కదా… సాక్షి, నమస్తే, జ్యోతి కూడా అంతేకదా, ఇంకా ఎక్కువ కదా అంటారా..? ఆ దరిద్రాల గురించి కాదు… ఈనాడును దశాబ్దాలుగా తెలుగు జనం అక్కున పెట్టుకుని పోషించారు, పెంచారు, లక్షల కోట్ల సంపదలకూ, పెత్తనాలకూ ఆస్కారమిచ్చింది ఆ ఆదరణే… ఐనా సరే, తనలో పాత్రికేయ, ప్రజాస్వామిక పరిణతి ఈరోజుకూ రాలేదు… హఠాత్తుగా ఓ పాత స్టోరీ గుర్తొచ్చింది… ప్రస్తుత ఈనాడు రాతలకూ ఈ కథనానికీ సంబంధం లేదు… కానీ అలా గుర్తొచ్చింది… 2021 నాటి స్టోరీ ఇది…….. ముచ్చట
….. By… Taadi Prakash……… సరికొత్త రికార్డింగ్ డాన్సు కంపెనీల కథ!
Darkness Behind The dazzling Headlines!
Ads
—————————————————
1970వ దశకం వార పత్రికల్లో ప్రశ్నలు-జవాబులు వుండేవి. శ్రీశ్రీ, మాలతీ చందూర్, కె.రామలక్ష్మీ పాఠకుల ప్రశ్నలకు జవాబులు యిచ్చుట.
అప్పట్లో అదో పెద్ద ముచ్చట!
‘‘రామలక్ష్మీగారు, నేను జ్యోతిలక్ష్మి అభిమానిని.. ఆమెకో చీర పంపాలనుకుంటున్నా.
ఏ కలర్ అయితే బావుంటుందో చెబుతారా?’’ ఒకడి ప్రశ్న. ‘‘జ్యోతిలక్ష్మీకి చీరెందుకూ! ఒక మంచి రిబ్బను కొని పంపించండి- రామలక్ష్మి జవాబు.
ఇలా నడిచేది కాలక్షేపం.
శ్రీశ్రీని ఒకాయన ‘‘యండమూరి వీరేంద్రనాధ్..?’’ అని అడిగాడు. ‘‘వేడివేడి పెసరట్టు’’ అని మహాకవి సమాధానం. యండమూరి రచనలు వేడిగా వున్నంత
వరకే, చల్లారితే పనికి రావని కవి హృదయం.
పొద్దున్నే ప్రతి యింటి తలుపూ తట్టే దినపత్రికలు కూడా వేడి ఇడ్లీల్లాగో, పెసరట్టుప్మాలాగో వూరించాలి. చల్లారిన చప్పటి వార్తల్ని చదివించడానికి వేడి పకోడీల్లాంటి హెడ్డింగులు కావాలి.
జనాన్ని వూరించాలి. ఎందుకలా?
జర్నలిజం అంటే ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేదనీ, ప్రజల ఆశల దీపమనీ, ప్రతిరూపమనీ అంటారు. వినే వుంటారు. అవన్నీ పిచ్చిమాటలు. నన్ను నమ్మండి. నిజం చెబుతున్నా. మహోన్నత జర్నలిజం అనేది, వాస్తవానికి మన దేశంలో ఒక పూర్తి స్థాయి రికార్డింగు డాన్సు కంపెనీ! ఎవడో పాడుతుంటాడు. వేరెవరో సంగీత వాయిద్యాలు మోగిస్తుంటారు. కట్ జాకెట్లూ, మెరుపు లంగాలూ ధరించిన సీనియర్ జర్నలిస్టులం అయిన మేము, మతులు పోయేలా డాన్స్ చేసీ, వొళ్లు ప్రదర్శించీ పాఠకుల్ని కింద పడేస్తుంటాము. (Presstitutes అనే పేరు నేను పెట్టింది కాదు). మా టీంకో లీడరుంటాడు. ఆటపట్టించడానికో, రక్తి కట్టించడానికో అతన్ని ఎడిటర్ అని అంటూ వుంటారు. నాకేం కోపం లేదు. శ్రీశ్రీ 60 ఏళ్ల క్రితమే సంపాదకుడంటే, నాకింపారెడు భక్తి కలదు… ఏంచేతంటే… సంపూర్ణ మనుజుడాతడు, చింపాజీవంటి వాడు సిరిసిరి మువ్వా’’ అన్నాడు.
ఎవరి వ్యాపార అవసరాలో… ఎవరి పారిశ్రామిక సామ్రాజ్య విస్తరణో… ఎవరి కోట్లు పెరిగి పెరిగి రాజకీయాధికార మెట్లుగా మారతాయో, వారి ఇంటి గేట్ల దగ్గర, గొలుసులు కట్టిన మేలు జాతి శునకములై, అవసరమైనప్పుడల్లా మొరిగేలా కండీషన్ చేయబడి వుంటాము. మారాజులు వేళకిన్ని బిస్కెట్లు పడేస్తూ వుంటారు. అంచేత ఈ వార్తలూ, మా హెడ్డింగులూ, సమాచారం ముసుగులో మీతో మింగించే ప్రచార రసగుళికలు!
మేం ఊడబొడిచామనీ, చరిత్ర లిఖించామనీ గప్పాలు కొట్టడానికి కేమీ లేదిక్కడ. వేడి వేడి పకోడీలు ఎంత బాగా సప్లయి చేశామన్నదే యింపార్టెంటు. … a kind of entertainment with a political twist.
ప్రఖ్యాతిగాంచిన ‘ఈనాడు’లో ఒక వార్తకి శీర్షిక-
‘‘మరదల్ని రేప్ చేయడం ఎలా?’’
ఈ హెడ్డింగ్ పెట్టినాయన మా అందరికీ తెలిసినవాడే. అతని ఉద్యోగం పోతుందని సాటి జర్నలిస్టులు అనుకున్నారు. అయితే యాజమాన్యం చాలా తేలిగ్గా తీసుకుంది. అది ఎంత దిక్కుమాలిన హెడ్డింగ్ అయినా చాలా ఆసక్తి రేపుతుంది.
యజమానికి అదే కావాలి.
ఇంకో జర్నలిస్టు మిత్రుడు విజయవాడ ‘ఈనాడు’లో ‘‘భార్యని రేప్ చేసిన భర్త అరెస్ట్’’ అని హెడ్డింగ్ పెట్టాడు. చదువుతాం కదా మరి. ఒక తాగుబోతు భర్త, సుఖవ్యాధులు కూడా వున్నవాడు, రోజూ భార్యని ఫోర్స్ చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ కెళ్లి ఆమె రేప్ కేసు పెట్టింది. అతన్ని అరెస్టు చేశారు. నిజమే. అలాంటి హెడ్డింగ్ పెట్టాల్సిందేనా?
*** *** ***
1985. విజయవాడ. ఉదయం దినపత్రికలో పని చేస్తున్నాను. అప్పుడే జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ గెలిచారు. ‘‘రాజీవ్ చేతిలో రాజదండం’’ అని పతంజలి హెడ్డింగ్ పెట్టాడు. ఆ ఎన్నికల్లో కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. బ్రహ్మానందరెడ్డి మెట్లు దిగి వెళ్లిపోతున్న ఫోటో వేసి, ‘‘చెల్లని కాసు’’ అని హెడ్డింగ్ పెట్టాను.
అప్పట్లో పంజాబులో హింస, కాల్పులు, బీభత్సం అంతా జరిగాక, చివరికి చర్చలు ఫలించాయి. ఆ వార్తకి ‘‘వీడిన సిక్కుముడి’’ అని హెడ్డింగ్ పెట్టానని కవి ఖాదర్ మొహియుద్ధీన్ గుర్తు చేశారు. ఆ రోజుల్లో కాకినాడలో పెద్ద పెద్ద ఓడల్ని మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే ఆపేవారు. అవి వొడ్డుకి రాలేవు. పడవల్లో వెళ్లి వాటి లోంచి సరుకులు దించుతారు. అయితే వోడల్లో మగాళ్ల అవసరాల కోసం పడవల్లో ఆడవాళ్లని తీసుకెళతారు. అదో రహస్య వ్యాపారం. ‘ఉదయం’లో ఆ వార్తకి..
‘‘అది ఓడరేవా? ఆడరేవా?’’
అని హెడ్డింగ్ పెట్టానని రిపోర్టర్ భోగాది వెంకట రాయుడు గుర్తు చేశారు.
తాడేపల్లిగూడేనికి చెందిన ఈలి ఆంజనేయులు
అనే రాష్ట్ర మంత్రి ఒకాయన వుండేవారు.
ఆయన చనిపోవడం వల్ల అక్కడ ఉపఎన్నిక జరగబోతోంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో ఊహిస్తూ విలేకరి ఒక పచ్చి గాసిప్ వార్త పంపించాడు. చివరికి పంపుల దగ్గర నీళ్లు పట్టుకుంటున్న ఆడవాళ్లు కూడా అదే మట్లాడుకుంటున్నారని రాశాడు. ఆంజనేయులుగారి భార్య ఈలి వరలక్ష్మికి టిక్కెట్టు యిస్తే గెలిచే అవకాశం ఉందని కనిపెట్టాడు. లోకల్ వార్త ఒకటి హైలైట్ చేయాలి గనక, ‘ఉదయం’ మొదటి పేజీలో దీన్ని పెద్ద వార్తగా ఇచ్చి…
‘‘వదినా! వరలక్ష్మికి టిక్కెట్టు ఇస్తారా?’’
అని హెడ్డింగ్ పెట్టాను.
లోకల్ గానే కాకుండా, టోటల్ గా పేలింది!
ఏకంగా దాసరి నారాయణరావు, కొందరు సీనియర్లను పిలిచి భలే ఉంది, ఈ హెడ్డింగ్ పెట్టింది ఎవరు? అని అడిగారు.
రేడియో న్యూస్ రీడర్ అద్దంకి మన్నార్ చనిపోయినపుడు నేను పెట్టిన శీర్షిక:
‘‘అద్దంకి మన్నార్ వార్తలు సమాప్తం’’
కోళ్లఫారం పెట్టి ఒకాయన లక్షల్లో నష్టపోయాడు. ‘ఉదయం’లో కుర్ర జర్నలిస్టు లక్ష్మణరావు ఆ వార్తకు పెట్టిన శీర్షిక:
‘‘కోళ్లఫారం పెట్టి గుడ్లు తేలేశాడు’’
ఎస్టీమ్ కారు కొత్తగా మార్కెట్టులోకి వచ్చినపుడు ఆ కారులో చాలా విశేషాలున్నాయన్న వార్తకి యువ జర్నలిస్టు ప్రసేన్ పెట్టిన శీర్షిక:
‘‘ఎస్టీమ్ కారుంటే మీరు మామూలు మనుషులు కారు’’
పెసరెట్లన్నా, పకోడీలన్నా ఇవే మరి!
*** *** ***
1982లో ఎన్టీఆర్ పార్టీతో సీపీఐ, సీపీఎంలు పొత్తు చర్చలు జరిపాయి. సాక్షాత్తూ చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య టీడీపీ వాళ్లతో మాట్లాడారు. రామోజీ రావే మధ్యవర్తి అని గుర్తు. రెండు పార్టీలకు కలిపి 60 అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారు. పుచ్చలపల్లి, చండ్ర రెచ్చిపోయారు. కేడర్ బలం గల నిర్మాణాత్మకమైన పార్టీలు మావి. ఈ డ్రామా కంపెనీ, ఈ సినిమావాడు ఎలా గెలుస్తాడు? మాకు 100 సీట్లు యివ్వండి అని పట్టబట్టారు. నేను ఖచ్చితంగా చెప్పలేనుగానీ చివరికి రెండు పార్టీలకీ 80 సీట్లు యిస్తామన్నారని విన్నాను. చండ్ర, సుందరయ్య లేచి వచ్చేశారు. ఎన్టీరామారావ్ ని ‘పోరా కుయ్యాం’ అన్నారు.
1983 జనవరి 9న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీకి 202 సీట్లు వచ్చాయి. అయితే, పోలింగ్ జరగడానికి ముందే పతంజలికి, రామోజీరావు ఆఫీసు నుంచి ఒక మెసేజ్ వచ్చింది. విజయవాడ, హైద్రాబాద్, తిరుపతి ‘ఈనాడు’ ఎడిషన్లలోని సీనియర్స్ అందరూ ఒక్కొక్కరూ రెండేసి హెడ్డింగులు పెట్టాలి (తెలుగుదేశం గెలుపుపై). నన్ను పిలిచి రెండు హెడ్డింగులు పెట్టండి అన్నారు పతంజలి.
1. ఎదురులేని జెండా ఎగరేసిన ఎన్టీయార్.
2. ‘తెలుగుదేశం’ సూపర్ హిట్
అని కాగితమ్మీద రాసిచ్చాను. ఆయన మొహం అదోలా పెట్టాడు. నచ్చలేదన్న మాట.
అలా అన్ని ఎడిషన్ల నుంచీ పోలింగ్ కు ముందే 30 లేదా 40 హెడ్డింగులు సేకరించారు. రామోజీరావు సన్నిహితులతో కూర్చుని మాట్లాడి ‘తెలుగుదేశం’ సూపర్ హిట్ అనే శీర్షికను సెలక్ట్ చేశారు.
టీడీపీని సినిమా పార్టీ అనీ ప్రతిపక్షాలు వెక్కిరించాయి. గనక, ఆ సినిమాయే సూపర్ హిట్టయ్యిందన్న చమత్కారం రామోజీరావుకి తెగ నచ్చింది. ఒక పక్క ‘ఈనాడు’ సర్క్యులేషన్ దుమ్మురేపుతున్నది. తెలుగుదేశం సూపర్ హిట్ అక్షరాల్ని ప్రత్యేకంగా ఆర్టిస్టుతో రాయించి అన్ని ‘ఈనాడు’ కేంద్రాలకూ పంపించారు. కౌంటింగ్ కు రెండు రోజుల ముందే అందాయవి. గెలవగానే అందరం ఈ హెడ్డింగ్ వాడాము. హెడ్డింగ్ ఎవరు పెట్టారని అడుగుతూ పతంజలిగారికి ముందే మెస్సేజ్ వచ్చింది. నా పేరు పంపించారు.
కంగ్రాచ్యులేట్ చేస్తూ రామోజీరావు నాకో పర్సనల్ మెస్సేజ్ పంపారు. ఇదంతా ఎందుకో పతంజలికి నచ్చలేదు. ముభావంగా ఉండిపోయారు. నాకు బాధనిపించింది. ఇలాంటి సందర్భాలు ఎవరికైనా వస్తాయి. పెద్దవాళ్లు, మరీ ముఖ్యంగా రచయితగా ప్రసిద్ధుడయిన పతంజలి లాంటివాళ్లు magnanimous గా ఉండాలి కదా.
*** *** ***
1994లో కావచ్చు. హైదరాబాదులో ఆంధ్రభూమి దిన పత్రిక న్యూస్ ఎడిటర్ గా చేస్తున్నా. ఎన్నికలు రాబోతున్నాయని, నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఏలూరులో భారీ బహిరంగ సభ తలపెట్టారు. కాంగ్రెసు వాళ్లు మందూ, డబ్బు కట్టలూ విరజిమ్మి ప్రతిష్ఠాత్మకంగా ఆర్గనైజ్ చేశారు.
సభ రోజు, మధ్యాహ్నానికే ఏలూరు జనంతో నిండిపోయింది. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి.
ఐనా వస్తూనే వున్నారు జనం. కాంగ్రెస్ వాళ్లకి పట్టపగ్గాల్లేవు. ‘ఆంధ్రభూమి’ మొదటి పేజీ అంతా అదే వార్త, ఫోటోలు పెట్టాలి.
అసలే ఇది కాంగ్రెస్ రెడ్ల పేపరు. సి.ఎం.విజయ భాస్కరెడ్డి. నేను ఎంత వోవర్ యాక్షన్ చేసినా చెల్లుతుంది. ఇక్కడ నాకో పర్సనల్ సరదా వుంది. మాది ఏలూరు. కనక, ఏలూరు అనే మాట హెడ్డింగ్ లో రావాలని నా పంతం. అయితే అది బాగుండాలి. జనం మెచ్చాలి!
కిటకిటలాడిన ఏలూరు సభ… బాలేదు.
ఏలూరు సభలో ఎటు చూసినా జనమే…
ఛ… కిక్కు రాలేదు. లేటవుతోంది..
ఫస్ట్ పేజీ యిచ్చేయాలి.
ఒక చాయ్ తాగా. జట్టు పీక్కున్నా.
ఒక సిగరెట్ కాల్చా… చొక్కా చించుకున్నా.
‘సార్ చాలా లేటయిందండీ’ కార్మికుడి అసహనం.
హా… వెలిగెన్. ‘‘పెట్టుకో హెడ్డింగ్’’ అన్నాను.
‘‘జజ్జనకరి జనారే, జనమంతా ఏలూరే!’’
అని పెద్ద అక్షరాలు పేజీలో పరిచేశాం.
నా సినిమా హిట్టయింది.
*** *** ***
The last resort of a journalist:
పై విధముగా యాజమాన్యమును సంతోషపెట్టుట అనే స్వామి కార్యము ముగిసిన పిమ్మట, నిత్య జీవన విషాదాన్ని మౌనంగా భుజానికెత్తుకున్న శాపగ్రస్థులయిన బానిస జర్నలిస్టులు చీకటి వేళ… ఖైరతాబాదులోని బార్ అండ్ రెస్టారెంట్… ప్రెస్ క్లబ్బు అను శ్మశానవాటిక వైపు నిశ్శబ్దముగా నడిచి వెళ్లు దృశ్యమును చూచి తీరవలెను.
– Taadi Prakash. 97045 41559
Share this Article