.
హీరో కాదు… నటుడు… సంపూర్ణ నటుడు…
ఒక గొప్ప హీరో నటించిన
గొప్ప సినిమాలో
గొప్ప పాట
గొప్ప మ్యూజిక డైరెక్టర్ కంపోజ్ చేయగా
గొప్ప గాయకులు
గొప్పగా పాడగా
గొప్పగా లిరికల్ విడుదల అయిన గొప్పల కుప్పను మనం సాధారణంగా చెవులున్నాయి కాబట్టి వింటూ ఉంటాం. కళ్లున్నాయి కాబట్టి చూస్తూ ఉంటాం.
Ads
అత్యంత సున్నితంగా పెరిగినవారికి కూరలో కారమే అసాధారణ హింస. అలాంటిది మన పాటల్లో గొప్ప హీరో చేసే అరాచకం వర్ణిస్తే అది అక్షరాలా శిక్షార్హమయిన హింస అవుతుంది. ఆ పాటల రచయిత భాషకు చేసిన హింసకు ప్రతిహింస తప్పదేమో! మ్యూజిక్ డైరెక్టర్ కర్ణ ధ్వంస హింసకు భారీ మూల్యం తప్పదేమో!
మనలో మన మాట. ఇలాంటి హీరో ఉండేవాడా? ఉంటాడా? ఉండబోతాడా?
ఇది క్రియేటివ్ లిబర్టీనా?
కల్పిత కథలో హీరోను పొగడలేక గేయ రచయిత పదాలను కల్పించి రాశాడా?
హతవిధీ!
హీరోలను పొగడలేక పాటలు మూగబోతున్నాయి. సంగీతం గొంతు కోసుకుంటోంది.
- “ఎవరెస్టు అతడి ఎడమకాలి కింది ధూళి.
ఆకాశం అతని చొక్కా జేబులో కర్చీఫ్.
సునామి అతని శ్వాస.
భూకంపం అతని నిశ్వాసం.
సప్త సముద్రాల ఉప్పు జలం అతని చెమట చుక్క.
మేరు పర్వతం అతని చెప్పుకింద నల్లి.
జూలు విదిల్చిన సింహం అతని ఇంటి గోడపై బల్లి.
హిరోషిమా అతని సిగరెట్టు లైటర్.
నాగసాకి అతని వంట పొయ్యి.
అతని చూపు యమధర్మరాజుకు చుక్కాని.
అతని అడుగు బ్రహ్మాండాలకు గొడుగు.
అతని పిడికిలి పిడుగులకు గండం.
అతని పిలుపు ముల్లోకాలకు వణుకు.
అతని కోపం మానవజాతికి శాపం”.
ఇంకా ఎంతో చెప్పాల్సిన వీర రౌద్ర బీభత్స భయానక ప్రళయ భీకర మహోగ్ర దంష్ట్రా కఠిన కర్కశ కరాళ పాషాణ పదబంధాలు ఉన్నా… అవేవీ ఈ హీరో కాలి ధూళికి కూడా సమానం కావు అని తమకు తాము సిగ్గుతో తలవంచుకుని, భయపడి, బాధపడి పారిపోవడం వల్ల గేయ రచయితలు కొన్ని కొత్త పదాలను, పదబంధాలను సృష్టించి రాయాల్సి వస్తోందని గుండె బలహీనంగా ఉన్నవారు, మెదడుందని అనుకునేవారు అర్థం చేసుకోగలరు.
ఇంతకూ-
ఆ పాట పల్లవి ఏమిటి?
గొంగట్లో కూర్చుని వెంట్రుకలను ఏరుతున్నట్లు… ఏ హీరో పాటయినా… ఏ టైటిల్ సాంగయినా… భావం ఇంతే!
అది నరమానవులు-
పలకలేని పల్లవి;
పాడలేని చరణం;
రాయలేని గేయం!
తాతలు తాగిన నేతుల మూతుల వాసనల దగ్గర ఆగిపోయిన, కత్తితో సొరకాయలు కోసినట్లు విలన్ల తలలు పరపరా నరికే మన హీరోయిజం కళ్ళతో మలయాళ నటుడు మోహన్ లాల్ ను చూస్తే మనకు అతడి నటన అర్థం కాదు. నిజానికి నటన అర్థం చేసుకోవాల్సినంత దుర్భరంగా ఉంటే అది నటనే కాదు.
నటన ఒక పాత్ర స్వరూప స్వభావాల వ్యక్తీకరణ. ఆ పాత్ర ద్వారా చెప్పదలచుకున్న కథకు ఆలంబన. హీరో చుట్టూ, హీరో కాళ్ళమీదపడి అల్లే కథలు హీరో కాలికిందే ఉంటాయి కానీ… ఆ కాలు దాటి పైకి ఎగబాకలేవు. అలాగని మోహన్ లాల్, మమ్ముట్టిలాంటి వారు హీరోలు కారా? హీరోలే.
మూడు, నాలుగు దశాబ్దాల వారి హీరోయిజంలో మన హీరోల్లాంటి పాత్రలు కూడా వేసి ఉండవచ్చు. కానీ కథ ప్రధానంగా, పాత్రలోకి ఒదిగి హీరో కనిపించని వారు వేసిన వేషాలు మన హీరోలు వేయగలరా? కనీసం కలలో అయినా మన హీరోలను అలా ఊహించగలమా? నో. నెవర్.
మోహన్ లాల్ కు భారత సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (2023 సంవత్సరానికి) వచ్చింది. రావాలి కూడా. ఇప్పటికే ఆయన నటన కీర్తి కిరీటంలో అనేక జాతీయ ఉత్తమ నటుడి అవార్డులున్నాయి. పద్మశ్రీ ఉంది. అభిమానుల అండదండలున్నాయి.
ఆమధ్య ఒక నగల దుకాణం ప్రకటనలో మోహన్ లాల్ మహిళల్లా నగలు అలంకరించుకుని మురిసిపోతూ ఉంటాడు. సున్నితమైన వ్యక్తీకరణ. ప్రకటన రూపొందించినవారు దీనికి మోహన్ లాల్ ను ఎంచుకోవడమే ఒక కొలమానం. వారి అంచనాలకు మించి అందులో మోహన్ లాల్ అద్భుతంగా నటించాడు. కాదు- జీవించాడు.
జాతీయ స్థాయిలో ఆ ప్రకటన గుర్తింపు పొందింది. షూటింగ్ మధ్యలో ఒక మహిళ వేసుకోవాల్సిన వజ్రాల హారం, ఉంగరాలు మోహన్ లాల్ కంటపడతాయి. షూటింగ్ మొదలుకాబోతే నగలు మాయం. ఈలోపు క్యారవాన్ లో మోహన్ లాల్ ఆ నగలు ధరించి అచ్చం మహిళలా ఒయ్యారాలు పోతుంటాడు.
అద్దం ముందు తనను తాను చూసుకుని మురిసిపోతుంటాడు. అప్పుడు దర్శకుడు క్యారవాన్ తలుపు తెరిచి చూస్తాడు. మోహన్ లాల్ సిగ్గుపడతాడు. తరువాత గర్వపడి నవ్వుతాడు. అప్పుడు ఆ నగల దుకాణం పేరు పడుతుంది. ప్రకటన ముగుస్తుంది.
ఆసక్తి ఉన్నవారికోసం ఆ ప్రకటన యూట్యూబ్ లింక్:-
https://youtu.be/jfujsACTD08?si=q7v2HAAfKdbnhyvD
ఇవన్నీ ప్రయోగాలు. నటనకు పరీక్షలు. పరీక్షలకు తగ్గ ప్రతిఫలాలు. ఆ ప్రతిఫలాల్లో దాదా సాహెబ్ ఫాల్కే కూడా ఒకటి.
కొస కోరిక:- కాలి చెప్పుకింద ఆకాశాన్ని తొక్కి పెట్టి, నెత్తిమీద పాతాళాన్ని గొడుగుగా పెట్టుకున్న మన తెలుగు హీరోలు మోహన్ లాళ్ళ నుండి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, అనుసరించాల్సింది ఏముంటుంది? ఉండదుగాక ఏమీ ఉండదు!
పాపం!
మన హీరోలకు కూడా ప్రయోగాలు చేయాలని అంతరాంతరాల్లో ఏమూలో ఉంటుందేమో! మన సైకోఫ్యాన్స్ వీరాభిమానం ఒప్పుకోదని వారికి లోలోపల ఒకటే వణుకేమో! యథా అభిమానం- తథా హీరోయిజం! మన హీరో నంద్యాల రైల్వే స్టేషన్లో తొడగొడితే ఆ తొడ తాడన శబ్ద విస్ఫోటనానికి రైలు కన్యాకుమారి దగ్గర నాగర్ కోయిల్ దాకా దానంతట అదే వెనక్కు వాయువేగంతో వెళ్ళే కథ, కథనాల్లో…
ప్రయోగం- అంటరానిది!
నటన- చేయకూడనిది!
పాత్ర- చూడకూడనిది!
అవార్డు- రాకూడనిది!
ఫలితం- చెప్పకూడనిది!
నిర్మాణం- కూలిపోయినది!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article