Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జెండేబాద్..! ఓ నొటోరియస్ బికినీ కిల్లర్ ఆట కట్టించిన హీరో కథ..!!

September 22, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల  99126 99960 ) ….. మహామహుల గురించి వచ్చే బయోపిక్ ల కన్నా కూడా… కరడుగట్టిన నేరస్థుల లైఫ్ స్టోరీస్ కే డిమాండ్ ఎక్కువ. అందుకే, రాంగోపాల్ వర్మ నుంచి తాజాగా ఇన్స్పెక్టర్ జెండే తీసిన చిన్నయ్ మండ్లేకర్ వరకూ.. అలాంటివాటినే ఎంచుకుంటారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఇన్స్ పెక్టర్ జెండే బయోపిక్ ఆ ఇన్స్ పెక్టర్ ను గొప్పగా చెప్పేదే అయినా.. అంతర్లీనంగా కథంతా నడిచేది ఆయన పట్టుకున్న క్రిమినల్ గురించే.

ఆ క్రిమినలే ఛార్లెస్ శోభరాజ్. ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్, దొంగ, మోసగాడు, కేటుగాడు ఇలా పర్యాయపదాలెన్నైనా.. తనతో పోటీ పడలేనివాడు.. ఛార్లెస్ శోభరాజ్. తన గురించి కాస్త చెప్పుకుని.. ఇన్స్ పెక్టర్ జెండే కథా చెప్పుకుందాం.

Ads

ఛార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హోత్చంద్ భావ్నాని.. అసలీ పేరే వింతగా ఉంది కదూ.. ఈ పేరంత పొడవో.. ఈ నేరచరిత్రదీ అంత కథ. ఎందుకంటే, తన నేర సామ్రాజ్యం విస్తరించని దేశాలను వేళ్లమీద లెక్కించొచ్చేమో బహుశా!

అందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరినొకరు దెప్పి పొడుచుకునే క్రమంలో పరస్పరం ఛార్లెస్ శోభారాజ్ తో పోలుస్తూ సెటైర్స్ వేసుకుంటుంటారు.

shobharaj

ఎవరా ఛార్లెస్ శోభారాజ్..?

1970ల కాలం వాళ్లందరికీ దాదాపుగా సుపరిచితుడైన నేరగాడు. సీరియల్ కిల్లర్. గజదొంగ, మోసగాడు, కామపిశాచి, తడిగుడ్డతో గొంతు కోసే పచ్చి కిరాతకుడు. 1944లో వియత్నాంలోని సైగాన్ లో పుట్టిన ఈ నేరగాడి తండ్రి.. సింధీ వ్యాపారవేత్త శోభరాజ్ హోత్చంద్ భావ్నాని ఓ భారతీయుడు.

తల్లి ట్రాన్ లోవాన్ పూంగ్ వియత్నాం దేశస్థురాలు. తర్వాత ఆవిడ ఇండియన్ మూలాలున్న భర్తను విడిచిపెట్టి.. ఓ ఫ్రెంచ్ జాతీయుణ్ని పెళ్లి చేసుకుంది. అలా ఫ్యామిలీ లైఫ్ లోనూ సరైన పెంపకం, పోషణ లేని ఛార్లెస్ శోభారాజ్.. ఆ విచ్చలవిడితనం నుంచి ఓ విలన్ గా ఎదిగాడు. మంచితనం మచ్చుకైనా కనిపించని కర్కోటకుడిగా మారాడు.

జైల్లో ఉన్నప్పుడే తనకు అనువాదకురాలిగా ఉన్న నిహితా బిశ్వాస్ ను తన చూపులతో ప్రేమలో పడేశాడు. ఆమెతో పెళ్లైంది. ఆయనకో కూతురు. ఆమె న్యాయవాది. 2017లో ఛార్లెస్ శోభారాజ్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు తన భార్యే రక్తదానం చేసింది.

స్ఫూర్తి అనే మాటకు కంప్లీట్ కాంట్రాస్ట్ గా కనిపించే అలాంటి శోభారాజ్ జీవితం ఆధారంగా కూడా కూడా బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఒక అద్భుతమైన చారిత్రక పురుషుడిపై మ్యాక్స్ ఒకటో, రెండో బయోపిక్సో రావొచ్చు. కానీ, ఛార్లెస్ శోభారాజ్ ఎన్నో సినిమాలకు ప్రేరణయ్యాడు.

ఎర్రగులాబీ సినిమానే తీసుకోండి హీరోయిక్ విలన్ గా అమ్మాయిలపై ద్వేషంతో కడతేర్చే కమల్ పెట్టుకునే టోపీ కూడా అదే ఛార్లెస్ శోభారాజ్ తరహాలో కనిపిస్తుంది. అయితే ఆ సినిమా మూలం రామన్ రాఘవన్ అనే 12 మంది యువతులను కడతేర్చిన మరో క్రిమినల్ స్టోరీ ఇన్సిపిరేషన్ అని చెప్పినా.. భారతీరాజా ఛార్లెస్ శోభారాజ్ ను కూడా తన మదిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది.

1963లో పారిస్ లో దొంగతనం చేసి పట్టుబడి జైలుపాలవ్వడంతో ఛార్లెస్ శోభారాజ్ నేరచరిత్రకు బీజం పడింది. ఆ తర్వాత జైలంటే భయమే లేకుండా పోయింది. ఆ తర్వాత అదే అత్తగారింటిలా మారిపోయింది. అక్కడి నుంచే ఎవరితోనంటే వారితో మాట్లాడే స్థాయికెదిగిపోయాడు శోభారాజ్.

ఆడపిల్లలను కట్టిపడేసే అందగాడు. అలాంటి హ్యాండ్సమ్ పర్సనాలిటీతో తేనె పూసిన కత్తిలా ఎందరో పర్యాటక అతివలను ఆకట్టుకోవడం, వారిని ఆ తర్వాత హతమార్చడం ఆ సైకో జీవితచర్యగా మారిపోయింది. అందుకే, తనను బికినీ కిల్లర్ అని పిల్చేవారు.

దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో కనీసం 20 మందికి పైగా పర్యాటకులను హత్య చేసినట్టు అభియోగాలెదుర్కొన్నాడు. ఒక థాయా లాండ్ లోనే 14 మందిని అంతమొందించాడు. ఫ్రాన్స్, గ్రీస్, ఇరాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, నేపాల్, ఇండియా, మలేషియా ఇలా తన నేర సామ్రాజ్యం విస్తరించని దేశాల్లేవన్నట్టుగా సాగింది అతగాడి అరాచకం.

దొరికినట్టే దొరికి తప్పించుకుపోయే ఒడుపు ఛార్లెస్ శోభారాజ్ ప్రత్యేకత. అందుకే, శోభారాజ్ కి నాగుపాము అని పేరు. సర్పెంట్ అనే మారుపేరుతోనే తాను చలామణి అయ్యాడు. బీబీసీ వంటి ఛానల్ ఏకంగా ఓ టీవీ సీరియల్ ను కూడా నిర్మించింది. ఇక తన జీవితం ఆధారంగా బుక్స్, డాక్యుమెంటరీస్, సినిమాలు, సీరిసులకైతే కొదవే లేదు.

భారత్ పోలీసులకు చిక్కి 1976 నుంచి 97 వరకు జైల్లో గడిపాడు. ఆ తర్వాత పారిస్ వెళ్లాడు. 2003లో మళ్లీ నేపాల్ చేరుకున్న ఛార్లెస్ శోభారాజ్.. అక్కడ అరెస్టై జీవితకాల ఖైదు శిక్షకు గుర్యాడు. ఇరవై ఏళ్ల ఖైదులో ఇంకో ఏడాది ఉందనగా.. నేపాల్ సుప్రీం కోర్ట్ అతడిని విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఫ్రాన్స్ కు వెళ్లిపోయాడతను.

అలా నేర సామ్రాజ్యంలో ఛార్లెస్ శోభారాజుది ఓ పెద్ద రక్త చరిత్ర. మరి ఇండియాకు వచ్చిన ఛార్లెస్ శోభారాజును చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఎవరు..?

zende

మధుకర్ జెండే.. ముంబై ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్!

ఇదిగో ఈయన స్టోరీనే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఇన్స్ పెక్టర్ జెండే పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.

1980ల కాలంలో శోభారాజ్ గోవాలో ఓ రెస్టారెంట్ లో పట్టుబడ్డాడు. గోవా పోలీసుల ప్రమేయం లేకుండా.. ముంబై పోలీసులు చేసిన ఆపరేషన్ అది. దాన్నే సినిమాగా ఇన్స్ పెక్టర్ జెండే పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ హీరోగా రూపొందించారు.

అయితే, ఓ కరడుగట్టిన నేరస్థుడి చరిత్ర.. అతణ్ని పట్టుుకున్న పోలీస్ ఆఫీసర్ కథను చూపించేటప్పుడు సాధారణంగా చాలా సీరియన్ నెరేషన్ కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా ఈ సినిమా చిత్రీకరణ హ్యూమర్ టచ్ తో కనిపిస్తుంది. కానీ, ఆ హ్యూమర్ ఇంకొంచెం సాలీడ్ గా చేసుంటే బాగుండేనేమోననిపిస్తుంది.

జెండే పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ ఎలాగూ తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి నటుడిగా ఆకట్టుకుంటాడన్నది తెలిసిందే.. అయితే, ఛార్లెస్ శోభారాజ్ క్యారెక్టర్ లో జిమ్ సర్బ్ అదరగొట్టాడు. ఈమధ్య వచ్చిన తెలుగు సినిమా కుబేరాలోలాగే మళ్లీ ఈ సినిమాలోనూ అలరించాడు.

దేశాదేశాల పోలీసులను, నేరపరిశోధకులను ముప్పుతిప్పలు పెడుతున్న శోభారాజ్ ను మధుకర్ జెండే అనే ఇన్స్ పెక్టర్ పట్టుకోవడం నాడు ముంబైలోని పెద్ద పెద్ద ఆఫీసర్లనే ఆశ్చర్యపర్చింది. అయితే పోలీసుగా తన సమాయాన్ని పూర్తి చిత్తశుద్ధితో నెరేవేర్చానంటాడు ఇన్స్ పెక్టర్ మధుకర్ జెండే.

తమను స్కాట్లాండ్ యార్డ్ తో పోలిస్తే.. మేం పట్టువిడవకుడా అంతకన్నా మెరుగ్గా పనిచేశామన్న ఒక ఉద్యోగ సంతృప్తి జెండే మాటల్లో కనిపించేది. అంతేనా, నా పేరు మధుకర్ జెండే అంటే అందరికీ గుర్తొచ్చేది ఛార్లెస్ శోభారాజ్ కథనే.

కానీ, ముంబై వీధుల్లో ఓ ఏనుగు వీరంగం సృష్టిస్తున్నప్పుడు ఓ చెరకుబండిని ఆశగా చూపి.. ఆ వెర్రెక్కి ప్రవర్తిస్తున్న ఏనుగును దాని దారిని మళ్లించిన ఘటన నా కెరీర్ లో ఓ సూపర్ మ్యాన్ తరహా ఫీట్ అంటాడు మధుకర్ జెండే.

zende

కేవలం అధికారంతో మాత్రమే అన్నింటినీ జయించలేమనేది జెండే నమ్మిన సత్యం. అధికారాన్ని మించి స్నేహంతో కూడా ఎన్నో సాధించవచ్చంటాడతను. జెండే ముంబైలోని కొన్ని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోస్టింగ్ లో ఉన్నప్పుడు అక్కడివారితో చేసిన స్నేహం.. తనకు 1992 అల్లర్ల కాలంలో ఎలా ఉపయోగపడిందో కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అలా వారితో స్నేహం చేయడానికి ఉర్దూ, ఇస్లాం కూడా నేర్చుకున్నానన్నాడు. అల్లర్ల సమయంలో ఓ పోలీస్ వ్యాన్ కు అక్కడి అల్లరిమూకలు నిప్పు పెట్టాలని చూస్తున్నప్పుడు.. తానొక్కడినే వీధుల్లో తిరుగుతూ ఎలా శాంతింపజేశానో గుర్తు చేసుకుంటాడు. అతి కూడా తన కెరీర్ లో మరో అతి పెద్ద విజయమంటాడు జెండే.

అలా జెండే కెరీర్ లో ఎన్నో విజయాలు కనిపిస్తాయి. 1997 నారీమన్ పాయింట్ కూపరేజ్ ఫుట్ బాల్ గ్రౌండ్ లో సెమీ ఫైనల్స్ లో ఓ పెద్ద గొడవ జరిగింది. రిఫరీ తీసుకున్న నిర్ణయంతో ఒక గ్రూప్ కు సంబంధించిన అభిమానగణం.. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం.. మ్యాచ్ రద్దవ్వడంతో.. ఆందోళనకారులు స్టేడియంలో నిప్పు పెట్టాలనుకున్నారు.

అప్పటికే కొన్ని సీట్లను దగ్ధం చేశారు. ఆ సమయంలో ఓ నల్లబోర్డుపై మీ టిక్కెట్ డబ్బులు వాపస్ ఇస్తాం.. శాంతించండి అంటూ ఆ బోర్డును పట్టుకుని మైదానంలో చుట్టూ తిరుగుతూ.. ఆ వినాశనాన్ని సమర్థవంతంగా ఆపగల్గాడు జెండే.

అలా జెండే ఒక మామూలు ఇన్స్ పెక్టర్ స్థాయిలోనే.. తన పరిధికి మించి పనితీరును కనబర్చి ఔరా అనిపించుకున్న హీరో అయ్యాడు.

హాజీ మస్తాన్ అనే ముంబైకి చెందిన ఓ బడా నాయకుడి కారు ముందే జెండే స్కూటర్ పై ప్రయాణిస్తున్నాడు. హాజీ మస్తాన్ డ్రైవర్ తో ఆ స్కూటర్ ను ఓవర్ టేక్ చేయకుండా పక్క లేన్ నుంచి వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత ఆ విషయం హాజీ మస్తాన్ డ్రైవర్ వచ్చి జెండేకు చెప్పి.. తన బాస్ జెండేనెంత గౌరవిస్తాడో అతడితో పంచుకున్నాడు. గమ్మత్తేందంటే.. అదే హాజీ మస్తాన్ ను జెండేనే స్వయానా రెండుసార్లు అరెస్ట్ చేశాడు.

అలా జెండే ఖ్యాతి రాజీవ్ గాంధీతో సహా ఉన్నతస్థాయి రాజకీయ నాయకులెందరిలోనో ఓ చర్చలా మారింది. అందుకే ఓసారి రాజీవ్ జెండేను రాజ్ భవన్ లో తనను కలవాలని కోరాడు. పోలీస్ అధికారం అనేది కేవలం శక్తిగా భావిస్తే సక్సెస్ కాలేరని.. అది ప్రజాసేవగా భావించి వారితో సత్సంబంధాలను కల్గి ఉంటేనే విజయవంతమవుతామంటాడు జెండే…. సూక్ష్మంగా ఇదీ ఓ విలన్ అండ్ ఓ హీరో స్టోరీ!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ’’కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా..?’’
  • జెండేబాద్..! ఓ నొటోరియస్ బికినీ కిల్లర్ ఆట కట్టించిన హీరో కథ..!!
  • దాదా మోహన్‌లాల్‌ను వరించి… ఆ అవార్డు తనే మురిసిపోయింది..!!
  • జన్మభూమే కర్మభూమి..! సిద్దిపేటలో హరీష్‌రావుపైనే కవిత పోటీ..!!
  • అక్కడే దులిపేసింది కదా… మళ్లీ ఇంకా ఎందుకు ఈ సాగదీత..?!
  • ఈజిప్ట్ గనుక బరిలోకి దిగితే… ఇక మూడో ప్రపంచయుద్ధం షురూ..!!
  • అడవి అంటే చాలు, తెలుగులో హిట్ పక్కా… కథాకాకరకాయ డోన్ట్‌ కేర్…
  • కాళేశ్వరం అక్రమాలపై హరీష్‌రావు తెలివిగా కేసీయార్‌ను ఫిక్స్ చేశాడా..?
  • ఆహా… తను నందమూరి తమన్ కాదు… ఇప్పుడు తమన్ కళ్యాణ్..!!
  • తెలంగాణ పెద్ద పండుగ దసరా… ఈ సోయి సర్కారుకు లేకుండా పోయింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions