.
ఓ అమ్మాయి పతకాలు తెస్తోంది… జనమంతా చప్పట్లు కొడుతున్నారు… మీడియాలో ప్రత్యేక కథనాలు, ప్రసారాలు… ఆమె జీవితంలోకి సంతోషం వచ్చింది…
ఆమె కాదు, నిజంగా సంతోషించేది, సంతోషించాల్సింది, ప్రశంసలు దక్కాల్సింది… ఎవరు, ఎవరికి..? కంటికి రెప్పలా సాకి, త్యాగాలు చేసి, ఆమెను అంతగా తీర్చిదిద్దిన వాళ్లకు… వాళ్లు గురువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు…
Ads
అవును, Veerendranath Yandamoori ఆలోచన కూడా అలాగే అభినందనీయంగా సాగింది… తెలంగాణలోని కల్లెడలో బుద్ధిమాంద్యంతో జన్మించిన ఓ బిడ్డ పెరిగిన తీరు, 2024 పారాఅథ్లెటిక్స్‌లో 400 మీటర్లు టీ20 పోటీల్లో కాంస్యం సాధించింది… కేంద్రం ఆమెకు అర్జున అవార్డునిచ్చింది… ఆమె కథను యండమూరి రన్ దీప్తి రన్ పేరి పుస్తకంగా వేశాడు…
ఆమె తల్లిదండ్రులకు ఉన్నది అరఎకరం… రోజువారీ కూలీలు… ఆమె ఈ స్థాయి దాకా రావడానికి వాళ్లెంత కష్టాలు పడి ఉంటారు, ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు… అందుకే తన పుస్తకాన్ని వాళ్లకే అంకితం ఇచ్చాడు… అది నిజమైన అభినందన, నిజమైన ప్రశంస…
ఈ పుస్తకం ప్రమోషన్ కోసం ఫేస్‌బుక్‌లో తను రాసుకున్న పోస్టులో మరో కథ ఉంది… అది కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించిన కథ… ఆ కథ కదిలించేలా ఉంది… ఆ కథను యండమూరి తనదైన శైలిలో ఇలా రాశాడు…
కచ్ ప్రాంతపు పాకిస్తాన్ సరిహద్దు గ్రామంలో ఒక స్త్రీ. పేరు కమలా బెన్ అనుకుందాం. అప్పటికే ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. మళ్ళీ గర్భం..! పుట్టేది అబ్బాయి అనుకుంటూ ఆర్నెలలు కలలు కన్నారు..! ఆ బిడ్డ కూడా అమ్మాయే అయ్యేసరికి, కుటుంబం మొత్తం నిరాశలో మునిగి పోయింది.
రాజస్థాన్- మారుమూల ఎడారి గ్రామాల కుటుంబాల్లో స్త్రీలను చాలా చిన్న చూపు చూస్తారు. ఆడపిల్ల పుట్టడం అసలిష్టం ఉండదు. దురదృష్టవశాత్తు కమలా బెన్ అటువంటి పురుషాధిక్య సమాజపు ఇంటి కోడలు. ఇంటి చుట్టూ ఇసుక. ఇంటి వారి మనసుల్లోనూ ఇసుకే.
ఆమె అత్తా మామలు ఆ పసికందు మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. పిల్లని పెంచటానికి భర్త ఒప్పుకోలేదు. చివరికి ఆమె తల్లిదండ్రులు కూడా గుక్కెడు పాలు పోసి పాపని పెద్ద చెయ్యటానికి నిస్సహాయత వ్యక్తం చేశారు.
అందరూ మూకుమ్మడిగా కలిసి ఆ ముక్కు పచ్చలారని పాపని చంపెయ్యమన్నారు. కనులు విప్పి ప్రపంచం ఇంకా చూడని పసికందు ఈ ప్రపంచంలో ఉండకూడదన్నారు.
తల్లికి ఇంకో దారి లేదు. ఆమె ఒక్కత్తె. వారు పదిమంది.
సంసారం కోసం, మిగతా పిల్లల మనుగడ కోసం, కడుపు తీపి చంపుకుని, కన్నీళ్ళని దిగమింగుకుని, బొడ్డు ఊడని ఆ పసికందుని ఆ రాత్రి ఆరు బయట వసారాలో పడుకోబెట్టి లోపలికి వచ్చేసింది.
నీళ్ళు గడ్డకట్టే చలికాలం అది. రెండు స్వెటర్లు వేసుకుంటే తప్ప పెద్దలు కూడా తట్టుకోలేని రాజస్థాన్ చలి ఎడారి అది..! శూలాలు గుచ్చే శీతల పవనాల మధ్య, పై ఆచ్ఛాదన లేకుండా ఆ పసికందుని పడుకో బెడితే, తెల్లవారేసరికి రక్తం గడ్డకట్టి ప్రాణం విడుస్తుందని పెద్దల అంచనా.
ఎముకలు కొరికే చలిలో… బయట వసారాలో… రాత్ర౦తా మరణంతో పోరాడుతూ ఒక చిన్నారి..! లోపలి గదిలో ఆ పసిగుడ్డు మరణం కోసం ఎదురు చూస్తూ ఒక తల్లి..! ఎవరన్నారు మన జీవితాల్లో డ్రామా లేదని..?
తెల్లవారింది. ‘చనిపోయిందా? నా పసికూన శరీరం గడ్డ కట్టుకు పోయిందా..?’ అనుకుంటూ… గుండె గొంతులో కొట్టుకుంటూ… దుఃఖంతో, ఉద్వేగంతో వెళ్లి చూసింది తల్లి. కానీ చాలా ఆశ్చర్యంగా…
ఆ పిల్ల చనిపోలేదు.
తల్లిని చూసి ఆత్మీయంగా పలకరిస్తూ నవ్విందా? కన్నతల్లి కన్నీటి పొర వెనుక కనపడలేదు.
పాపని హృదయానికి హత్తుకుని, “…బతకాలన్న చిన్న ఆశతో నా కూతురు ఇంతటి చలిని జయించినప్పుడు, నా చిట్టితల్లి కోసం నేను జీవితాన్ని జయించలేనా?” అనుకుంది ఆ తల్లి.
తన ముగ్గురు బిడ్డలతో బయటికి వచ్చేసి స్వతంత్రంగా జీవించటం ప్రారంభించింది. తన కాళ్ళ మీద నిలబడి, ముగ్గురు అమ్మాయిల్నీ మంచి స్కూల్లో చదివి౦చింది. ప్రస్తుతం పెద్దమ్మాయి అదే స్కూల్లో టీచరు. మిగతా ఇద్దరు పిల్లలూ ఇంకా చదువుకుంటున్నారు…
** ** **
‘పది’ సంవత్సరాలు కృషి చేసి ఎన్నో మెడల్స్ సంపాదించింది దీప్తి… మంచిదే..! అభినందనీయమే..! కానీ చూడటానికి అందంగా లేక, ముద్దగా తప్ప మాట ముద్దుగా రాక, ముప్పు తిప్పలు పెట్టిన ఒక దివ్యా౦గురాలిని ‘ఇ..ర..వై’ సంవత్సరాలు పెంచి పెద్ద చేయటమంటే మాటలు కాదు.
అంతే కాదు. ఆమె శక్తి మీద నమ్మకం ఉంచి, తమ జీవనాధారమైన ఇల్లు, పొలం అమ్మేసి, కూతుర్ని పోటీలకి తీర్చి దిద్దారు. మనసూ, మెదడూ ఎదగని ఇలాంటి పిల్లల కథలు పేపర్లలో చదివి, ‘అహా-ఓహొ’ అని మెచ్చుకోవటానికి బావుంటాయి గానీ, పెంచటంలో ఉండే కష్టనష్టాలు ప్రాక్టికల్‌గా అనుభవిస్తేనే గానీ అర్థం కావు…
ఆ విధంగా ఆలోచిస్తే… ఈ అద్భుతమైన గెలుపుకి అమ్మాయిని కాదు..! ముందుగా ఆ పాప తల్లిదండ్రులని అభినందించాలి..!
అందుకే ఈ పుస్తకం వారికి అంకితం…
** ** **
……. ఇదీ ఆయన పోస్టులో కొంత భాగం… యండమూరి ఆలోచన అందుకే అభినందనీయం అని చెప్పింది… అంతకుమించిన అభినందన దేనికీ అంటే… ఈ పుస్తకం ద్వారా వచ్చే రాయల్టీ మొత్తం అభయం ఫౌండేషన్‌కు ఇస్తానని ప్రకటించడం..!! అన్నట్టు, చప్పట్లు దక్కాల్సింది ఆమె కోచ్ నాగపురి రమేష్‌కు, స్కూల్‌లో ఆమె ప్రతిభను గుర్తించి ఆమె బాటను ఇటు మళ్లించిన పీఈటీ సార్‌కు..!!
Share this Article