.
Raghu Mandaati...
అనుకోకుండా యూనివర్సిటీ డీన్ గారిని కలిసినప్పుడు ఆవిడ మాటలు బతుకమ్మ పండుగను మరో కోణంలో విశ్లేషించే విధంగా ఉన్నాయి…
ఉదయం ఆలోచిస్తూ, పూర్వీకులు ఈ పండుగను మహిళలకు ఉపయుక్తంగా ఎలా మలిచారో గుర్తించాను. అలాగే, ఇప్పుడు ఈ బతుకమ్మ ఎందుకు అవసరం అనేది రకరకాలుగా అనుసంధానం చేస్తూ రాసుకున్నాను.
బతుకమ్మ కేవలం పూలతో పేర్చిన గోపురం మాత్రమే కాదు. అది మనసుల మధ్య ఒక వంతెన.
Ads
తొమ్మిది రోజులు కలసి కూర్చోవడం, కలిసి పాడుకోవడం, కలిసి ఆడడం, కలిసి ప్రసాదాలు స్వీకరించడం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా ఉంటుంది. మొదటి రోజులు మనసు కట్టుబడే ఉంటుంది, మాటలు బయటికి రావు. కానీ మెల్లగా పూల రేకులు ఒకదానికొకటి తగిలి పరిమళం వెదజల్లినట్టే, మహిళల మనసులు కూడా ఒక్కో మాటతో, ఒక్కో అనుభవంతో తెరుచుకుంటాయి.
- ఈ సమూహ గానం, పూల రంగులు, కలసి పాడే పాటలు అన్నీ కలిపి ఒకే పదంలో చెప్పవచ్చు: సామూహిక స్వస్థత (collective healing).
ఒకరికొకరు విన్నపుడు, మనసులోని బాధకు ఒక రూపం దొరుకుతుంది. సంతోషానికి మరింత అర్థం వస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా ఒక ఎనర్జీ సర్కిల్ లాంటిది. మనసులోని భారాలు పంచుకుంటే తేలిపోతాయి. పంచుకున్నప్పుడు ఒకరి బాధ వందమంది మీద పడి తేలిక అవుతుంది. ఆనందం మాత్రం పంచుకున్న కొద్దీ పెరుగుతుంది.
సమాజ శ్రేయస్సు అంటే ఇదే కదా మనం మనల్ని మాత్రమే కాకుండా, పక్కవాళ్లను కూడా ఆలకించడం, వారిని అర్థం చేసుకోవడం. బతుకమ్మలో ప్రతి మహిళ ఒక దేవత స్వరూపం, ప్రతి పువ్వు ఒక ఆశీర్వాదం.
ఇలా చూస్తే, బతుకమ్మ మన సంస్కృతిలో ఉన్న ప్రాచీన కౌన్సెలింగ్, వెల్‌నెస్ థెరపీ.
- ఇది కేవలం పండుగ కాదు ఇది ఒక సామూహిక ధ్యానం, ఒక హీలింగ్ సర్కిల్, ఒక సామాజిక మానసిక ఆరోగ్యోత్సవం.
మనిషి హృదయం కొట్టుకునే రాగం ఒకటే, కానీ జీవితం మనల్ని విడదీస్తుంది. ఆ విభిన్నతను మళ్ళీ కలిపే వేదికే బతుకమ్మ. ఒకే లయలో వందల గొంతులు కలవడం అంటే వందల మనసులు ఒకే ఆత్మగా మారడం. అక్కడ వ్యక్తిగతం అనే గీత దాటిపోతుంది, సమూహం అనే మహత్తర శక్తి అవతరిస్తుంది.
- పాటల రూపంలో చెప్పే మాటలు కేవలం గీతల కవిత్వం కాదు అవి అంతరంగపు వాక్యాలు. బతుకమ్మ పాటల్లో ఒక మహిళ తన జీవితపు ఆనందం, వేదన, ఆకాంక్ష, ప్రార్థన అన్నింటినీ కలుపుతుంది. చప్పట్లు కొడుతూ, ఒకరిని ఒకరు చూడడం అంటే, నీ భావం నేనూ విన్నాను, నీ బాధ నాకు కూడా తెలుసు అని చెప్పడం.
ఇక ప్రకృతి దేవతను ఆరాధించడం… అది మన సంస్కృతిలోని గుండె. పూలు, ఆకులు, వనమూలికలు కేవలం అలంకారం కాదు. ప్రకృతితో మమేకం అవ్వడానికి, తల్లిగా గౌరవించడానికి ఒక చిహ్నం. ఆ వలయంలో తిరుగుతూ మహిళలు పాడేది ఒకే సత్యం. ప్రకృతి మనది కాదు, మనమే ప్రకృతిలో ఒక భాగం అని.
పాట, లయం, ప్రకృతి, సమూహం ఇవన్నీ కలిసినపుడు ఒక ఆధ్యాత్మిక హీలింగ్ యాత్ర ప్రారంభమవుతుంది.
ఇప్పటి ఆధునిక సమాజంలో మానసిక ఆరోగ్యం ఒక పెద్ద చర్చ. ఒత్తిడి, ఒంటరితనం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, ఆందోళన, డిప్రెషన్, శరీరక రుగ్మతలు ఇవన్నీ ప్రతి కుటుంబంలోనూ, ప్రతి మనసులోనూ దాగి ఉంటాయి. దీనికోసం మనం కౌన్సిలింగ్, గ్రూప్ థెరపీ, హీలింగ్ సర్కిల్స్ వంటి పద్ధతులను ఆశ్రయిస్తున్నాం.
ఆధునిక యుగంలో మహిళలు వలయంగా కూర్చుని తమ భావాలను పంచుకుంటే, అది సిస్టర్హుడ్ అని పిలుస్తారు. బతుకమ్మలో ఇది శతాబ్దాలుగా ఉంది. వలయంగా తిరుగుతూ, ఒకరి చెయ్యి ఒకరి చప్పట్లో కలుస్తుంది, ఒకరి గొంతు ఒకరి పాటలో కలుస్తుంది.
గ్రూప్ థెరపీ
– మానసిక ఆరోగ్య నిపుణులు ఏమంటారంటే, “బాధను మాటలుగా చెప్పండి. మీరు ఒంటరిని కాదని తెలుసుకుంటే శక్తి వస్తుంది.” అదే బతుకమ్మ పాటల్లో జరుగుతుంది. బాధ, ఆనందం, ప్రార్థన – ఇవన్నీ వ్యక్తమవుతాయి. ప్రతి ఒక్కరి జీవనగాథ ఆ పాటలో కలుస్తుంది. ఇది నిజమైన హీలింగ్ ప్రక్రియ.
ఆధునిక యుగంలో ఫారెస్ట్ బాతింగ్, నేచర్ హీలింగ్ వంటి కాన్సెప్ట్‌లు పాపులర్. బతుకమ్మలో పూలు, వనమూలికలను సేకరించడం, వాటిని జాగ్రత్తగా అలంకరించడం ప్రకృతితో గాఢమైన సంబంధాన్ని కలిగిస్తుంది. ఇది మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కి సమానం.
కాబట్టి, బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు; ఇది ఆత్మల్ని కలిపే వేదిక, మనసులను ముడిపెట్టే శక్తి, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే సమైక్య ఆధ్యాత్మిక యాత్ర. మన సంప్రదాయాలు కేవలం పండగలే కాదు. అవి సామాజిక మానసిక ఆరోగ్య పద్ధతులు. మన పూర్వీకులు శాస్త్రీయంగా పేరు పెట్టకపోయినా, వాటి తాత్పర్యం స్పిరిచ్యువల్ సైకాలజీ లాంటిదే.
- ఈ కాలంలో, బతుకమ్మ మనకు ఒక దిశ చూపిస్తుంది.
వ్యక్తిగతంగా – మనసులోని మాటలు పంచుకోవడం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం.
సామాజికంగా – మహిళల మధ్య బలమైన బంధం, పరస్పర సహాయం.
ఆధ్యాత్మికంగా – ప్రకృతిని ఆరాధించడం, మనలోని దైవత్వాన్ని గుర్తించడం.
ఇవన్నీ మరుసటి తరాల కోసం బతుకమ్మను కేవలం పూల పండుగగా కాకుండా, హీలింగ్ ఫెస్టివల్, వెల్నెస్ మూవ్మెంట్గా మార్చితే, భవిష్యత్తు మరింత సుగమం, సమైక్యం, ఆరోగ్యవంతం అవుతుంది.
ఎలాంటి మైకులు, డిజే లు లేకుండా, కేవలం మనసులు, పూలు, గీతలు, చప్పట్లు సరిపోతాయి. ప్రభుత్వం, ప్రైవేట్, స్కూల్, కాలేజీలలో అన్ని స్థాయిలా బతుకమ్మ హీలింగ్ జరగాలి.
ఇది కాంటెంపరరీగా సమాజాన్ని పునరుద్ధరించే మార్గం; ఫ్యూచరిస్టిక్ గా చూస్తే మానవ సంబంధాలు, సామూహిక శాంతి, ఆధ్యాత్మిక అవగాహన కలిగించే సుస్థిర మోడల్‌గా మారుతుంది.
తొమ్మిది రోజుల బతుకమ్మ ఇమ్మర్షన్ ద్వారా సమూహ హీలింగ్ క్లైమాక్స్ వస్తుంది. ప్రతి వ్యక్తి ఒక ఎమోషనల్ క్లీన్సింగ్ పొందతారు, ప్రతి సమాజం సోషల్ వెల్నెస్ సర్కిల్ గా మారుతుంది.
ప్రకృతి, మనసు, సమాజం, ఆధ్యాత్మికత అన్నీ కలిసి దేశం మొత్తం ఒక పెద్ద కలెక్టివ్ హీలింగ్ ఫెస్టివల్ అవుతుంది………. రఘు మందాటి
Share this Article