.
బాలకృష్ణపై 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి చిరంజీవి అభిమానులు నిర్ణయం తీసుకున్నారనీ, చిరంజీవి వారించాడని నిన్న ఓ వార్త బాగా చక్కర్లు కొట్టింది, నిజమేనా..?
చిరంజీవి బ్లడ్ బ్యాంకు సమీపంలోని ఓ హోటల్‌లో వంద మంది దాకా భేటీ వేసి, ఇక ఫిర్యాదు చేయడానికి జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లడానికి కూడా రెడీ అయిపోయారట… పోలీసులకు మేమొస్తున్నాం అని సమాచారం ఇస్తే, ఇది తెలిసిన చిరంజీవి వద్దు అని వారించడంతో ఇక సైలెంట్ అయిపోయారట…
Ads
భలే వదులుతారు జనంలోకి..! మొత్తానికి ఎవరో గానీ స్క్రిప్టు బాగా రాశాననుకున్నారు… కానీ మన తెలుగు సినిమా కథల్లో, కథనాల్లో కనిపించే అవగాహనరాహిత్యమే ఇక్కడా కనిపించింది… సినిమాల్లో ఆ లోపాలను ఎవరూ పట్టించుకోరు గానీ, క్షేత్ర స్థాయిలో, నిజజీవితంలో అలా కుదరదు…
ఎందుకంటే..?
1. మీ హృదయాలు బాధపడ్డాయి, కేసు పెట్టాలనుకున్నారు సరే… కానీ అది జరిగిందెక్కడ..? ఏపీ శాసనసభలో… మరి హైదరాబాదు పోలీసులు ఆ ఫిర్యాదు స్వీకరిస్తారని ఎలా అనుకున్నారు..?
2. శాసనసభ గానీ పార్లమెంటు గానీ సభ్యులు సభల్లో ఏదైనా మాట్లాడితే, వాటికి లీగల్ ఇమ్యూనిటీ ఉంటుందనే విషయం కూడా తెలియదా..?
3. బాలకృష్ణ నిజానికి అక్కడ సైకో గాడు అని తిట్టింది జగన్‌ను… పైగా అక్కడ తన పేరు కూడా ఎత్తుకోలేదు… పెడితే వైసీపీ వాళ్లు పెట్టాలి కేసులు, కానీ ఏపీలో ఒక్క పోలీస్ స్టేషన్ కూడా దాన్ని తీసుకోదు… ఇక కోర్టుకు వెళ్లాలి… సాంకేతికంగా కోర్టులు కూడా తీసుకుంటాయని అనుకోలేం…
4. బాలకృష్ణ మాటల్లో చిరంజీవిని తేలికగా తీసిపారేయడం ఉంది గానీ, పరుషపదాలు నేరుగా ఉపయోగించింది లేదు… అగౌరవం ఉంది గానీ అభ్యంతకర పదాలు చిరంజీవి పట్ల వాడలేదు…
5. ఆల్రెడీ ఆ సంభాషణ, అంటే కామినేని వ్యాఖ్యలు దానికి బాలకృష్ణ జవాబు మొత్తం రికార్డుల నుంచి తొలగించారు…
6. చిరంజీవి వెంటనే కాస్త ఘాటుగానే స్పందించి వివరణ ఇచ్చాడు, మీడియా మొత్తం కవర్ చేసింది… బాలకృష్ణ భాషేమిటో, తన ధోరణి ఏమిటో మళ్లీ జనం చర్చించుకున్నారు, కేస్ ఇక్కడ క్లోజ్ కావాలి…
7. పదే పదే తన అన్నను అవమానించారని గొంతు చించుకున్న పవన్ కల్యాణ్ నుంచి ఏ స్పందనా లేదు… టీడీపీ ముఖ్యులూ సైలెంట్… కొన్ని పొలిటికల్ సెన్సిటివిటీలు ఉంటాయి…
8. ఈ మొత్తం వ్యవహారంపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్క నారాయణమూర్తి తప్ప ఒక్కరూ స్పందించలేదు… ఈ రాజకీయాల్లో వాళ్లు వేళ్లు పెట్టదలుచుకోలేదు… అవసరం లేదు కూడా…
9. మరిక ఈ 300 ఠాణాలు అనే సంఖ్య ఎలా వచ్చింది..? అంటే, 300 మాత్రమే దేనికి అని..! పైగా రెండు రాష్ట్రాల్లోనట… ఏపీ రాజకీయ కాలుష్యపు బురదను తెలంగాణ మీద రుద్దడం దేనికి..?
10. చివరగా… ఈ కేసుల కథకు స్క్రిప్టు రచయిత ఎవరు..? ఎవరు తన వెనకున్నారు..? ఏమాశించారు..? ఎక్కడో చిరంజీవి, బాలకృష్ణ కలిసినప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు, ఇద్దరూ సీనియర్లే కదా, నటించేస్తారు… అంగీలే చింపుకున్న అభిమానులు తెల్లమొహాలు వేస్తారు, ఫైనల్‌గా జరిగేది ఇదే…
Share this Article