.
( రమణ కొంటికర్ల
)… గోవా.. దేశ, విదేశీ పర్యాటకులకు ఓ స్వర్గధామం. కానీ, అక్కడి స్థానికులకు మాత్రం ఇప్పుడు నరకప్రాయం. చిన్న రాష్ట్రమైన గోవాకు వచ్చే అతిథుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. దాంతో హోటల్స్, రెస్టారెంట్స్, క్యాసినోస్ ఇలా అదే సంఖ్యలో నిర్మాణాలూ వెలుస్తున్నాయి.
అక్కడ పెరుగుతున్న రద్దీ, కాలుష్యంతో పాటు.. నివాస స్థలంగా ఉండటానికి కూడా గోవా ఇప్పుడు అనువైన ప్రాంతం కాదనే భావన బలపడుతోంది. దీంతో గోవా నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఏంటీ ఆ గో గోవా గాన్ కథ..?
Ads
అందమైన బీచులతో స్వదేశంలోనే విదేశీ సంస్కృతిని చూడాలనుకునేవారికి, అనుభవించాలనుకునేవారికి గోవా ఓ హాట్ స్పాట్. అయితే, గోవాకు ప్రతీ ఏడు పర్యాటకుల సంఖ్య ఓవైపు పెరుగుతుంటే.. అక్కడున్న స్థానికులు మాత్రం గోవా నుంచి వెళ్లిపోతుండటం అక్కడ కనిపిస్తున్న ప్రధాన ఆందోళన.
గోవా పర్యాటకమంటే కేవలం పాంజిమ్ నగరానికి మాత్రమే పరిమితమైందేం కాదు.. గోవా చుట్టుపక్కల సముద్రం బ్యాక్ వాటర్ తో కనెక్టై ఉన్న ఎన్నో గ్రామాలు పర్యాటక ప్రాంతాలుగా పట్టణీకరణ చెందాయి. దీంతో తమ గ్రామాలు ఇప్పుడు గోవన్స్ కి డెవిల్ విలేజెస్ లా కనిపిస్తున్నాయి.
కనుమరుగవుతున్న సంప్రదాయాలు!
గోవా రాజధాని పానాజీ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గోవా వెల్హా అనే గ్రామముంది. 17వ శతాబ్దపు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా.. సెయింట్ ఆండ్రూ చర్చ్ సెయింట్స్ తో రియలైజేషన్ ర్యాలీలకు పెట్టింది పేరుగా నిల్చే గ్రామమది.
ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించిన 31 మంది క్రిస్టియన్ సాధువులైనవారి బరువైన విగ్రహాలను మోస్తూ ఆ పశ్చాత్తాప ఊరేగింపులతో గోవా వెల్హా కనిపిస్తుంది. అయితే, స్థానికులకు మాత్రమే ఈ అవకాశం దక్కేది. కొన్నేళ్ల నుంచి ఇతర క్రిస్టియన్ భక్తులకు కూడా ఈ అవకాశం లభిస్తోంది. అందుకు కారణం వలసలేనంటున్నారు గోవన్స్.
గోవా వదిలి యూరప్ దేశాల్లో సెటిలవుతున్నారి సంఖ్య ఎక్కువగా ఉందటున్నారు అక్కడివారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికీ ఇలాంటి ప్రత్యేకమైన సంప్రదాయ ఊరేగింపుల్లో స్థానం లభిస్తోంది. సాధువుల స్టాచ్యూస్ ని భుజాన వేసుకుని తిరిగేవారు స్థానికంగా లేకపోవడంతో.. బయటనుంచి వచ్చే పర్యాటకులు, భక్తులకూ ఈ అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈస్టర్ టైంలో ఈ ఊరేగింపులు కనిపిస్తాయి.
ఇప్పుడు గోవా వెల్హా లాంటి చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లోని స్థానికుల ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తాయి. లేదంటే, కేర్ టేకర్స్ నివశిస్తుంటారు. ఒక్క గోవా వెల్హాలోనే సుమారు 18 వందల ఇళ్లల్లో మూడోవంతు విదేశాలకు తరలి వెళ్లిపోయారు. దీంతో ఎన్నో విలాసవంతమైన భవనాలు ఈ చుట్టుపక్కల తాళాలతో కనిపిస్తుంటాయి.
గోవన్స్ వలసలకు కారణమేంటి..?
గోవాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవా వెల్హాదే కాదు ఈ వలసల దుస్థితి. సిరిడావో, బాటిమ్, అగస్సైమ్ వంటి చుట్టుపక్కల గ్రామాలన్నింటా ఇప్పుడు ఖాళీ బంగ్లాలు.. లేదా, శిథిలావస్థకు చేరుకుంటున్న బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి. ఎందుకంటే, ఇక్కడివారంతా ఇప్పుడు యూరప్ వైపు చూస్తున్నారు.
దేశ, విదేశీ పర్యాటకులేమో గోవా వైపు చూస్తూ ఏటికేడు ఇక్కడి పర్యాటకం పెరిగిపోతుంటే.. మరోవైపు, అందుకు భిన్నంగా గోవన్స్ యూరప్ వైపు చూడటం ఇక్కడి స్థానికుల ఆందోళనకు కారణమేంటన్న చర్చకు తావిస్తోంది.
అదే సమయంలో గోవన్స్ కు వలసలు కొత్తేమీ కాదు. శతాబ్దాలుగా ఇక్కడివారు తూర్పు ఆఫ్రికా, ఆసియాలోని ఇతర ప్రాంతాలతో పాటు.. పర్షియన్ గల్ఫ్ వంటి ప్రాంతాలకు మహాసముద్రాల మీదుగా వెళ్లివస్తూనే ఉంటారు. చాలామంది ఆయా దేశాల్లో సెటిలవుతూ ఉంటారు.
అయితే, ఈ మధ్య అనూహ్యంగా మళ్లీ వలసల సంఖ్య పెరిగిపోయింది. ఉత్తరగోవాలోని తిస్వాడి తాలూకాలో బాంబోలిమ్, సిరిడావో, గోవా వెల్హా, బాటిమ్, అగస్సైమ్ వంటి గ్రామాల నుంచి 1990ల కాలం నుంచే యూరప్ వలసలు మొదలయ్యాయి. 2000 వరకు ఇవి మరింతగా పెరిగిపోయాయి.
ఇక గత 15 ఏళ్ల కాలంలో మెరుగైన జీవనోపాధి కోసం ఎక్కువ మంది గోవన్స్ పోర్చుగీస్ పాస్ పోర్టులను ఎంచుకుంటున్నారు. ప్రతీ ఏడూ వందలాదిమంది ఇక్కడి స్థానికులు తమ భారతీయ పాస్ పోర్ట్స్ వదిలేసుకుని.. పోర్చుగీస్ జాతీయులుగా మారిపోతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
అక్కడి ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం నుంచి వచ్చిన డాటా ప్రకారం సగటున రోజుకు పది నుంచి 15 మంది గోవావాసులు తమ భారతీయ పాస్ పోర్ట్స్ అప్పగించడానికి కార్యాలయానికి వస్తుండటం విస్తు గొల్పుతోంది.
పోర్చుగీస్ చట్టాల ప్రకారం పోర్చుగీస్ కాలనీల్లో పుట్టినవారు కన్జర్వేటోరియా డోస్ రెజిస్టోస్ (Conservatoria dos Registos Centrais – Central Registry of Births in Lisbon) ప్రకారం వారి బర్త్ నమోదు చేయబడితే పోర్చుగల్ పౌరులుగా కొనసాగేందుకు అవకాశముంటుంది.
1961 వరకూ కూడా పోర్చుగీస్ వారి ఆధీనంలో గోవా పోర్చుగల్ కాలనీగానే ఉండేది. అలా ఆ కాలనీల్లో నాటి చట్టాల రిజిస్ట్రీ ప్రకారం నమోదైనవాళ్ల మూడు తరాలవారి వరకూ కూడా పోర్చుగీస్ పాస్ పోర్టులకు అర్హత కల్గి ఉంటారు. ఇదే నేటి యువతరమంతా విదేశాలకు తరలి వెళ్లిపోవడానికి మరో ప్రధాన కారణం.
గోవా పక్కనే ఉండే సిరిడావోలోనైతే సుమారు 70 నుంచి 80 శాతం ఇళ్లకు తాళాలే కనిపిస్తాయి. సాంప్రదాయకంగా ఈ ప్రాంతంలో చేపలు పట్టుకుని బతికే మత్స్యకార సమాజంలో సుమారు 3 వేల మంది ఇప్పుడు సిరిడావో వదిలేసి విదేశాలకు తరలిపోయారు.
ఈ క్రమంలో గోవాలో దొంగతనాలూ పెరిగిపోయాయి. గోవా చుట్టుపక్కల గ్రామాల్లోని తాళాలు వేసిన ఇళ్లే ఇప్పుడక్కడి దొంగలకు టార్గెట్. బంగారం, నగదు ఉంటుందేమోనని వస్తుంటారు. కొన్ని సమయాల్లో ఏం దొరక్కపోతే నీటి కుళాయిలు కూడా ఎత్తుకెళ్తున్నారట.
మరి రాత్రిపూట జరిగే ఈ దొంగతనాలు ఎలా బయటపడతాయంటే.. వేసవిలో నజరేతు ఏసు పండుగ పేరిట ఓ ఉత్సవం జరుపుకునే సమయంలో కొందరు వలస వెళ్లినవారు తిరిగివచ్చినప్పుడు బయటపడ్డాయట.
క్రీడల్లోనూ ఇప్పుడు వలస వచ్చినవారిదే హవా!
ప్రస్తుత గోవా యువత ఎక్కువగా యూరప్ వైపు చూస్తుండటంతో క్రీడలకు పెట్టింది పేరైన గోవా ఇప్పుడు వెనుకబడిపోతోందన్న ఆందోళనా ఇక్కడ కనిపిస్తోంది. సిరిడావో ఫుట్ బాల్ కు పెట్టింది పేరు. అలాగే, అంతరాష్ట్ర పోటీలతో పాటు, గ్రామస్థాయిలో జరిగే పోటీల్లో ఇక్కడి వాలీబాల్ జట్టుకూ రికార్డులున్నాయి.
గోవా వెల్హాలోనైతే ఇప్పటికీ ఫుట్ బాల్ కు ప్రజాదరణ కనిపిస్తుంది. కానీ, స్థానికులకన్నా ఇక్కడికి వలస వచ్చినవాళ్లే జట్టులో సభ్యులు కావడం కూడా అదే సమయంలో కనిపిస్తుంది. పైగా ఇక్కడి ఫుట్ బాల్ జట్టుకు గోవా నుంచి యూరప్ కు తరలివెళ్లినవారే ఎక్కువగా స్పాన్సర్స్ గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. అందుకే గోవా ట్రోఫీ కాస్తా ఇప్పుడు లండన్ ట్రోఫీ అని పిల్చుకుంటున్నారక్కడ.
పెద్ద పెద్ద బంగ్లాలు, పెరిగిన ప్రాశ్చాత్య సంస్కృతిలో పడి ఆ దిశగా ఆలోచనలు చేయడంతో పాటే… గోవాలో పర్యాటకులు, పెరుగుతున్న రద్దీ వంటివన్నీ వెరసి… స్థానికులు గోవా వదిలి పెడుతున్నారు. విదేశాల బాట పడుతున్నారన్నది అక్కడి స్థానికులు చెప్పే మాట. మొత్తంగా గోవా బయట నుంచి వెళ్లేవారికి ఓ స్వర్గధామమైతే.. అక్కడి స్థానికులకు మాత్రం నరకప్రాయంగా కనబడటమే జీవన వైవిధ్యం…
Share this Article