.
Subramanyam Dogiparthi ….. సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . అయితే ఈ పాట కన్నా గొప్ప పాట జగమే మాయ రీమిక్స్ పాట . జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా అంటూ మొదలవుతుంది ఈ పాట .
భార్యాపుత్రులనే వలలో పడకోయి కాసులకే నీ సుతుడు అంకితమోయి అంటూ సంసార విలాపం కొనసాగుతుంది . హేట్సాఫ్ టు వేటూరి . అంతే గొప్పగా నటించాడు గొల్లపూడి . ఈ రీమిక్స్ పాటలో 20వ శతాబ్దపు సంసారం సంతానం కష్టాల్ని బాగా చెప్పారు . 21వ శతాబ్దంలో సంతానం ఇంకా ముదిరిపోయి తల్లిదండ్రుల్ని వేలం పెడుతున్నారు .
1987 సంక్రాంతి సీజన్లో వచ్చి ఏక్షన్ , రొమాంటిక్ సినిమాలతో పోటీపడి కలకాలం నిలబడే హిట్ సినిమాగా ఎమర్జ్ అయింది ఈ సినిమా . టివి చానళ్ళలో ఎన్ని సార్లు వచ్చిందో ! వచ్చిన ప్రతిసారీ కాసేపయినా చూస్తూ ఉంటాను .
Ads
తమిళంలో విసు వ్రాసిన ఒక నాటకానికి మెరుగులు దిద్ది AVM వారు సంసారం అధు మిన్సరంగా తమిళంలో తీసారు . లక్ష్మి , క్రిష్ము , రఘువరన్ , ప్రభృతులు నటించారు . ఒరిజనల్ నాటకంలో లేని మనోరమ పాత్రను సినిమాకు సృష్టించారు . బాగా పేలింది ఈ పాత్ర తమిళంలో కూడా .
తమిళంలో సక్సెస్ అయిన సినిమాను తెలుగులో సంసారం ఒక చదరంగం అనే టైటిలుతో రీమేక్ చేసారు AVM వారు . ఈ సినిమాలో హీరోలు , సపోర్టింగ్ హీరోలు , షీరోలు , సపోర్టింగ్ షీరోలు చాలా మందే ఉన్నారు . తెర మీద కనపడని హీరోలు కూడా ఉన్నారు .
కధను , బిర్రయిన స్క్రీన్ ప్లేని అందించిన విసు , దర్శకుడు ముత్తురామన్ , సంగీత దర్శకుడు చక్రవర్తి , పాటల్ని వ్రాసిన వేటూరి , శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు తెర మీద కనపడని హీరోహీరోయిన్లే .
చాలా చిన్న కధ . మనందరి చుట్టూ నడిచే , నడుస్తున్న కధే . మన ఇళ్ళల్లో కూడా నడుస్తూ ఉంటుంది . అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు , పైటలు వచ్చాక బిడ్డలు కారు . ఇదే ఈ సినిమా కధ . పెద్ద కొడుకు లేచిన కాడి నుంచి లెక్కలు వేస్తుంటాడు . పిల్లాడి పాలడబ్బాలను సైతం .
తనకిష్టమైన వాడితో పెళ్ళి చేసుకుని , అక్కడా ఇమడలేక మళ్ళా పుట్టింటికి వచ్చి , సంసారానికి భారం అవుతుంది ఒక కూతురు . గజనీ మహమ్మద్ లాగా ఢంకీలు కొడుతుంటాడు మరో చిన్న కొడుకు .
- ఈ సంసార వనంలో అన్నింటినీ భరించే రెండు పాత్రలు . ఒకటి 1980s సినిమా తల్లి అన్నపూర్ణది , మరొకటి పెద్ద కోడలు సుహాసినిది . వీరిద్దరికి తోడు ఒక లేడీ ఆంజనేయుడి పాత్రలో షావుకారు జానకి నటించింది . అదరగొట్టేసింది . బెస్ట్ సపోర్టింగ్ నటిగా ఆమెకు నంది అవార్డు కూడా వచ్చింది .
ఈ సినిమాకు హీరో ఎవరంటే గొల్లపూడి మారుతీరావు అనే చెప్పాలి . ఇతర పాత్రలన్నీ ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతాయి . తానే తిప్పుతాడు . ఇతని పాత్రకు ధీటుగా మరో పాత్ర నూతన్ ప్రసాదుది . ప్రేక్షకులు మరచిపోలేరు .
రెండో కొడుకుగా , కుటుంబానికి అండగా నిలబడే పాత్రలో రాజేంద్రప్రసాద్ , ఆయన మకురు భార్యగా ముచ్చెర్ల అరుణ , ఆఖరోడిగా దిలీప్ , ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు . కూతురిగా కల్పన గ్లామరస్సుగా కనిపిస్తుంది .
ముచ్చెర్ల అరుణ తండ్రిగా హేమసుందర్ చాలా చక్కగా నటించాడు . పైసా పైసా లెక్కేసే పెద్ద కొడుకుగా శరత్ బాబు బాగా నటించారు . సినిమాలో ప్రతీ నటీ నటుడు అద్భుతంగా నటించారు . ఇంత చక్కటి కుటుంబ కధాచిత్ర విజయానికి మరో కారణం గణేష్ పాత్రో చురుకైన సంభాషణలు . చిలకమ్మా మజాకా వంటి పాపులర్ డైలాగుల్ని అందించారు . ముఖ్యంగా గొల్లపూడి మారుతీరావు డైలాగులను ప్రేక్షకులు మరచిపోలేరు .
కల్పన , ఆమె ప్రియుడి (ఈ నటుడి పేరు తెలియదు) మీద చిత్రీకరించబడిన జానకి రాముల కళ్యాణానికి జగమే ఊగెనుగా అనే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . లాలి జో లాలి జో , సిరికే సీమంతం అంటూ సాగే పాటలు కూడా బాగానే ఉంటాయి .
ఈ చక్కటి కుటుంబ కధాచిత్రం యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . Undoubtedly , a watchable neat , feel-good , family emotional , sentimental movie .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article