.
Rochish Mon …. — చో — ‘భారతదేశంలో వచ్చిన విలువైన, నిజాయితీ నిండిన, నిజమైన రాజకీయ విశ్లేషకుడు, ఉన్నతమైన పాత్రికేయుడు చో రామస్వామి’…
చో రామస్వామి (1934-2016) జయంతి ఇవాళ. చో రామస్వామి ఒక జాతీయతా భావాల రాజకీయ దార్శనికుడు! 2005లోనే నరేంద్ర మోదీ దేశ భవిష్యత్ ప్రధాని కావాలి అని గణించి, ఆశించి, ప్రతిపాదించిన దార్శనికుడు చో.
నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం ఆవశ్యకతను 2005లోని గుర్తించడం చో ఏ మేరకు ‘దేశ చింతన’ కలవారో తెలియజేస్తుంది; చో దార్శనికతను తెలియజేస్తుంది.
Ads
(నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడాన్ని ఆకాంక్షించిన తొలి దశ పరిశీలకులు, విశ్లేషకుల్లో సుబ్రమణియన్ స్వామి కూడా ఒకరు! సుబ్రమణియన్ స్వామి ఈనాటి మాటలు వింటున్నప్పుడు నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడాన్ని ఆకాంక్షించిన తొలిదశ వ్యక్తి ఆయన అని తెలియరావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సుబ్రమణియన్ స్వామి ప్రవర్తన, మాటలు సుబ్రమణియన్ స్వామి మార్క్. కానీ ఆయన దేశానికి చేసిన మేళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సుబ్రమణియన్ స్వామి దేశానికి చేసిన పెనుమేలు సోనియా గాంధీని దేశ ప్రధాని కానివ్వకపోవడం. ఈ విషయాన్ని నేను 2020లో ఆంధ్రభూమిలో రాశాను. ఇదే నిజాన్ని తెలంగాణ బీ.జే.పీ. నేత రఘునందన్ రావు తెలియజెప్పిన వీడియో ఇవాళ నా దృష్టికి వచ్చింది)
విశేషమైన బహుముఖీన ప్రజ్ఞావంతుడు చో…
నాటక, చలనచిత్ర రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత చో. తమిళ్ష్ చలనచిత్రాలలో హాస్య నటుడిగా లబ్దకీర్తి చో.
‘తుగ్లక్’ అన్న తమిళ్ష్ రాజకీయ పత్రికను 1970 నుంచీ నడిపి జాతీయ స్థాయిలో విశిష్టమైన రాజకీయ పాత్రికేయుడిగా వినుతికెక్కారు చో.
చో భయం లేని వ్యక్తి! ఏ శక్తికీ ఏ సందర్భంలోనూ భయపడలేదు చో. అతి భయంకరమైన శ్రీలంక LTTE కి కూడా జంకలేదు చో! 80వ దశాబ్దిలో తమిళ్ష్‌నాట LTTE.,. LTTE నేత ప్రభాగరన్ (ప్రభాకరన్ కాదు)పై ఒక విధమైన అభిమానం, సానుభూతి వ్యాపిస్తున్నా LTTE ని, LTTE నేత ప్రభాగరన్‌నూ తీవ్రంగా విమర్శిస్తూ, ప్రభాగరన్‌ను దోషిగా వాస్తవాన్ని పదేపదే చెప్పేవారు చో. అదీ చో ధైర్యం!
ఒక దశలో, రాజీవ్ గాంధీ మరణానంతరం LTTE చో ను చంపేస్తుందని అందరూ అనుకున్నారు. చో కు LTTE అతి తీవ్రమైన హెచ్చరికలు చేసింది. చో వెనక్కు తగ్గలేదు!
అన్నట్టుగానే LTTE తన నైసర్గిక ధోరణిలో చో ను అతి కిరాతకంగా చంపే ప్రయత్నం చేసింది! ఒక రోజున ఎగ్మూర్ రైలు స్టేషన్‌లో రైలు దిగుతున్న చో పై LTTE ఉగ్రవాదులు భయంకరమైన ఆసిడ్‌ను పెద్ద మొత్తంలో వెదజల్లారు.
ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆసిడ్ అక్కడి పలువురు ప్రయాణికులపై పడింది; చో పై మాత్రమే పడలేదు; ఒక్క చుక్క ఆసిడ్ కూడా చో పై పడలేదు! “నా మరణం LTTE ప్రబాగరన్ చేతిలో అని నిర్ణయమైపోయుంటే దాన్ని ఎవరూ తప్పించలేరు, కాబట్టి నేను అతడికి భయపడను, నా మాట నాది” అని చో బహిరంగంగా చెప్పారు.
చో దైవ భక్తిపరుడు. చో ఆధ్యాత్మిక అభినివేశం ఉన్న వ్యక్తి. “ఎక్కడున్నాడు బ్రాహ్మణుడు?” శీర్షికతో బ్రాహ్మణ్యంపై విప్లవాత్మకమైన రచన చేశారు చో.
తమిళ్ష్‌నాడులో ద్రావిడ విషంపై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. ‘వికార వ్యక్తి పెరియార్’ను తీవ్ర స్థాయిలో తూర్పారపట్టే వారు చో. కరుణానిధిని తీవ్ర స్థాయిలో తప్పుపడుతూనే ఉండే వారు చో. బహిరంగంగా పెరియార్, కరుణానిధి వంటి వాళ్లను అపహాస్యం చేసేవారు చో.
కంచి పెద్ద శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి వారికి చో అంటే ప్రత్యేకమైన అభిమానం. “రాస్తున్న ప్రతి వ్యక్తీ చో అవుతాడా” అని చంద్రశేఖర సరస్వతి అన్నారు. ఈ మాట చో ఎంత గొప్ప వారో తెలియజేస్తుంది.
వీ.పీ.సింఘ్ ప్రధాని కానున్న సమయంలో దేశంలో జరగబోయే దుష్పరిణామాల్ని ముందుగానే పసిగట్టగలిగిన చంద్రశేఖర సరస్వతి వారు చో మూలంగా ఆడ్వాణీ, సుబ్రమణియ స్వామి వంటివాళ్ల పూనికతో వీ.పీ. సింఘ్ ప్రధాని కాకుండా ఉండాల్సిన ఆవశ్యకతను, అందుకు కావాల్సిన సూచనలను పంచుకున్నారు. (ఈ విషయంగా ఇంతకన్నా ఎక్కువ వివరాలను ఉద్దేశ పూర్వకంగానే ఇవ్వడం లేదు)
చంద్రశేఖర సరస్వతి వారి ఆశంస ఆచరణలోకి రాలేదు. వీ.పీ. సింఘ్ అయ్యాక దేశం అన్ని రకాలుగానూ ఏ మేరకు దెబ్బతిందో, హిందువులు ఎంత దారుణంగా దెబ్బతిన్నారో బాధాకరమైన చరిత్రగా ఇవాళ మనకు తెలుస్తోంది.
చో రామస్వామి గొప్ప కళాభిజ్ఞత ఉన్న వారు. శివాజీ గణస(శ)న్ గొప్ప నటుడు అని తమిళ్ష్ అభిజ్ఞలోకం ఆర్తనాదం చేస్తూంటుంది. శివాజీ నటనను చూస్తూ షూటింగ్ సమయాల్లోనే చో నవ్వేవారు! శివాజీ ఉడుక్కునే వారట.
చో కణ్ణదాసన్ అభిమాని. ఒక సందర్భంలో కణ్ణదాసన్ తనను విమర్శించినందుకు ఆయన పత్రికలో చో ను ‘ఒక చిన్న పురుగు’ అని రాశారు. ఆ తరువాత చో తను కలవాలనుకున్న కణ్ణదాసన్‌కు వెయ్యాల్సిన చురక వేశారు. ఆ వెంటనే కణ్ణదాసన్ పత్రికా ముఖంగా చో పై తన మాటలకు నొచ్చుకుంటున్నట్టు ప్రకటన చేశారు. చో మహాకవి బారతియార్ అభిమాని.
దేశానికి అవసరమైన మేధతో, గొప్ప పాత్రికేయుడు చో. తన తుగ్లక్ పత్రికలో ఆయన నిర్వహించే ప్రశ్న జవాబు శీర్షిక మేధ పరంగా దేశ ప్రసిద్ధం. పెద్ద సర్క్యూలేషన్ లేని తన తమిళ్ష్ పత్రికతో చో దేశవ్యాప్తంగా గొప్ప పాత్రికేయుడుగా ప్రశస్తమయ్యారు! ఈ పరిణామం చో నాణ్యతను తెలియజేస్తుంది.
తెలుగులో చో స్థాయి మేలైన రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు ఉన్నారా? లేకపోతే ఎందుకు లేరు?
మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి చో; దేశావసరాల పరంగా గొప్ప పాత్రికేయుడు చో. తన పాత్రికేయంతో ‘అవినీతి ఆదాయం’ పొందని శ్రేష్ఠమైన పాత్రికేయుడు చో.
అవినీతికి, వంచనకు, అబద్ధాలకు, విదేశీ మతాల నేరాల విషయంలో నపుంసాత్మక మౌనానికి, దేశ ద్రోహానికి, దేశ వ్యతిరేకతకు, విద్వేష వాదానికి, జన విరోధ భావజాలానికి, విదేశీ మతాల నుంచి వచ్చే లబ్దికి, విదేశీ మాఫిఆలకు, కమ్యూనిజానికి, నక్సలిజానికి, కులోన్మాదానికి, ప్రజల్ని పెడతోవ పట్టించే పాత్రికేయానికి అతీతంగా ఉన్నతంగా జీవించిన పాత్రికేయుడు, ‘మనిషి’ చో.
సంపాదకీయాలు, ఎడిట్ పేజ్ వ్యాసాలు, వార్తా కథనాలు దేశ వ్యతిరేకంగానే, ప్రజలకు వ్యతిరేకంగానే, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే, కేంద్ర ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి; ఉండాలి అన్న స్థితిలో అత్యంత అధమంగా ఉన్న ఇవాళ్టి తెలుగు పాత్రికేయం చో జీవితాన్ని, తీరును, పనితనాన్ని చదివి తెలుసుకుని సిగ్గుపడి బుద్ధి తెచ్చుకోవాలి!
అర్థ శతాబ్ది కాలంలో చో వంటి జాతీయ స్థాయిలో పరిగణించబడ్డ మేలైన పాత్రికేయుడు తెలుగులో లేకపోవడం ఏమిటి? చో వంటి గొప్ప మేధ, దార్శనికత్వం, విశ్లేషణా పటిమ, చదువు, దేశ స్పృహ, మేలైన పరిశీలన ఉండే పాత్రికేయుడు తెలుగులో భవిష్యత్తులోనైనా వస్తాడా?
రోచిష్మాన్
9444012279
Share this Article